చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సింగర్ కెకె హఠాన్మరణం

కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో కచేరీ ముగిసిన తర్వాత 53 ఏళ్ల గాయకుడు తాను బస చేసిన హోటల్‌లో కుప్పకూలిపోయాడు.

Update: 2022-06-01 01:24 GMT

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ కెకె(కృష్ణ కుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. మంగళవారం నాడు.. కోల్‌కతాలో మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న కొన్ని గంటల తర్వాత కెకె మరణించారనే వార్త తెలిసింది. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోటల్‌కు చేరుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు. ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని గంటల క్రితం కోల్‌కతా ఆడిటోరియంలో జరిగిన సంగీత కచేరీ విజువల్స్ ఉన్నాయి. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో కచేరీ ముగిసిన తర్వాత 53 ఏళ్ల గాయకుడు తాను బస చేసిన హోటల్‌లో కుప్పకూలిపోయాడు. ఆయన మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కృష్ణకుమార్ కున్నత్ సింగర్ గా మారాక KK అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు. 'పల్', 'యారోన్' వంటి ఎన్నో పాటలకు ప్రసిద్ధి చెందారు. 1990ల చివరలో అతడి కెరీర్ మొదలవ్వగా.. ఎన్నో బాలీవుడ్ సినిమాలలో హిట్ సాంగ్స్ పాడాడు. షారుఖ్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ సినిమాలలో కెకె సాంగ్ ఉందంటే చాలు.. అది పక్కా హిట్ అనే నమ్మకంతో ఉండేవాళ్లు అభిమానులు.
1999లో కెకె తొలి ఆల్బం 'పల్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2000ల ప్రారంభం నుండి, అతను ప్లేబ్యాక్ సింగింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించాడు. బాలీవుడ్ చిత్రాల కోసం ఎక్కువగా పని చేశాడు. కెకె హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి ఇతర భాషలలో పాటలను రికార్డ్ చేశారు. మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినిమా ప్రముఖులు, రాజకీయనాయకులు ట్వీట్లు చేస్తున్నారు. కెకె మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కెకె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.



Tags:    

Similar News