సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి
కార్యక్రమం ముగిశాక వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొందరు రాళ్లదాడి చేశారు. అంతకుముందే మంగ్లీ పాటలు పాడి..
టాలీవుడ్ ఫేమస్.. మాస్ సాంగ్స్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమానికి హాజరైంది మంగ్లీ. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా.. సింగర్ మంగ్లీ, కొందరు గాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిశాక వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొందరు రాళ్లదాడి చేశారు. అంతకుముందే మంగ్లీ పాటలు పాడి.. తన పని ముగించుకుని తిరిగి వెళ్లేటపుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు మేకప్ టెంట్ లోపలికి వెళ్లారు. పోలీసులు అలెర్టై వారిని అడ్డుకున్నారు. ఒక సింగర్ తమను కనీసం కలిసేందుకు కూడా అనుమతించని కారణంగా ఆ యువకులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.
కాగా.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని అక్కడి యాంకర్ అనుశ్రీ కోరారు. కానీ.. అక్కడున్న వారందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి, రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగ్లీ తీరుపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని, ఆమెకి కన్నడ అర్థం కాదు? ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడటానికి భయపడే ఆమెకు కన్నడలో ఎందుకు అవకాశం ఇస్తారు? అని ఫైర్ అయ్యారు.