రెండు దశాబ్దాల తర్వాత.. శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు
తమ తండ్రి శివాజీగణేశన్ కు చెందిన 271 కోట్ల రూపాయల ఆస్తి పంపకం సరిగా జరగలేదని
తమిళ లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తన సోదరుడు ప్రభు తమను మోసం చేశాడని శివాజీ గణేశన్ కుమార్తెలైన శాంతి, రజ్వీలు.. నటుడు ప్రభు, ఆయన సోదరుడు, నిర్మాత రామ్‌కుమార్‌లపై మద్రాస్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. శివాజీగణేశన్‌కు ప్రభు, రామ్‌కుమార్ అనే ఇద్దరు కుమారులు…శాంతి నారాయణ స్వామి, రజ్వీ గోవిందరాజన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తమ తండ్రి శివాజీగణేశన్ కు చెందిన 271 కోట్ల రూపాయల ఆస్తి పంపకం సరిగా జరగలేదని శాంతి నారాయణ స్వామి, రజ్వీ గోవిందరాజన్ ఆరోపించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని.. ఆస్తిలో వాటాలు ఇవ్వలేదని, వెయ్యి సవర్ల బంగారం, 500 కిలోల వెండిని తమ సోదరులు మోసం చేశారని ఆరోపించారు. శాంతి థియేటర్‌లో 82 కోట్ల రూపాయల విలువైన వాటాలను వారు తమ పేరున మార్చుకున్నారని.. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభు, రామ్ కుమార్ లతో పాటు వారి కుమారులు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌లపైనా కేసు పెట్టారు. తమకు తెలియకుండా ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు.
తమ తల్లి ద్వారా సంక్రమించాల్సిన ఆస్తులకు తమ సోదరులు సహకరించలేదని శాంతి, రజ్వీలు కూడా ఆరోపిస్తున్నారు. శివాజీ గణేశన్ కుమార్తెలు 2005లో అమల్లోకి వచ్చిన హిందూ వారసత్వ చట్టాన్ని సూచిస్తూ.. తమ తండ్రి శివాజీ గణేశన్ ఆస్తిపై తమకు, కుమార్తెలకు హక్కు ఉందని, విభజనను సక్రమంగా నిర్వహించాలని కోర్టును కోరారు. అనారోగ్యం కారణంగా 2001లో శివాజీ గణేశన్ కన్నుమూశారు, తమిళనాడు వ్యాప్తంగా ఆయన ఆస్తుల విలువ రూ.270 కోట్లుగా ఉంది.