ప్రభుత్వ అధికార లాంఛనాలతో.. కృష్ణ అంత్యక్రియలు పూర్తి
సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని నానక్ రాంగూడలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం 7 గంటల వరకు..
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్15) తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరన్న వార్త విన్న యావత్ తెలుగు సినీలోకి, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఐదు దశాబ్దాలపాటు తన నటనతో చిత్రసీమను ఏలిన కృష్ణ.. నటశేఖరుడనే బిరుదు పొందారు. ఆయనను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుడే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని నానక్ రాంగూడలోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం 7 గంటల వరకు ఉంచారు. అభిమానులను కూడా ఆయన సందర్శనకు అనుమతినిచ్చారు. ఉదయం 7 గంటలకు కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించి, అక్కడ మరికొంత మంది ప్రముఖులు, అభిమానులు సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం పద్మాలయ నుండి జూబ్లిహిల్స్ మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. ఈ అంతిమయాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు.. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.
మహాప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల అభివందనంతో మొదలైన కృష్ణ అంత్యక్రియలను.. ఘట్టమనేని కుటుంబ సభ్యులు తమ ఆచారం ప్రకారం నిర్వహించారు. కృష్ణ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు.