టాలీవుడ్ లో విషాదం.. బిల్డింగ్ పై నుంచి పడి దర్శకుడు మృతి !
పైడి రమేశ్ అదే బిల్డింగ్ లోని నాల్గవ అంతస్తులో నివాసముంటున్నారు. నిన్న సాయంత్రం వాకింగ్ కు వెళ్లొచ్చిన అనంతరం..
బంజారాహిల్స్ : టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన మరో ఘటనతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దర్శకుడు పైడి రమేశ్ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో ఉన్న ఓ భవనంపై నుంచి జారి పడి ఆయన దుర్మరణం చెందారు.
పైడి రమేశ్ అదే బిల్డింగ్ లోని నాల్గవ అంతస్తులో నివాసముంటున్నారు. నిన్న సాయంత్రం వాకింగ్ కు వెళ్లొచ్చిన అనంతరం.. వర్షం రావడంతో బాల్కనీలో ఆరేసిన బట్టలను తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని బట్టలు కరెంట్ తీగలపై పడటంతో రాడ్ తో వాటిని తీసేందుకు యత్నించారు. దీంతో షాక్ కొట్టి ఆయన కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దర్శకుడి మృతిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పైడి రమేశ్ 2018లో రూల్ అనే సినిమాను తీశారు. మరో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉండగా.. ఈ దుర్ఘటన జరిగింది. రమేశ్ ఆకస్మిక మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.