ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ ‘హమ్ దిల్‌దే చుకే సనమ్’ (1999), కమల హాసన్ సినిమా ‘హే రామ్’, ‘భూల్ భులైయా’ (2007),
ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేటి సాయంత్రం పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ మరాఠీ థియేటర్, సినీ నటుడైన చంద్రకాంత్ గోఖలే కుమారుడే విక్రమ్ గోఖలే. బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ 'హమ్ దిల్‌దే చుకే సనమ్' (1999), కమల హాసన్ సినిమా 'హే రామ్', 'భూల్ భులైయా' (2007), 'దే దనాదన్ (2009), 'మిషన్ మంగళ్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. మరాఠీలో వచ్చిన 'ఆఘాత్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2010లో ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. బుల్లితెరలో 'ఘర్ ఆజా పరదేశి', 'అల్ప్విరామ్', 'జానా నా దిల్ సే దూర్', 'సంజీవ్ని', 'ఇంద్రధనుష్' వంటి షోలతో ప్రేక్షకులను అలరించారు విక్రమ్ గోఖలే. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇటీవల విక్రమ్ గోఖలే వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండగానే.. ఆయన చనిపోయారంటూ ప్రచారం జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు సైతం విక్రమ్ గోఖలే మృతి చెందారని ట్వీట్లు చేయడంతో.. వారి కుటుంబం ఆ వార్తలను ఖండించింది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని, ఇలాంటివి ప్రచారం చేయొద్దని కోరింది.