నేటి తరం నటులలో 2011 వరకు సక్సెస్ రేట్ ఎక్కువ వున్న హీరో అల్లరి నరేష్. అనతి కాలంలో 50 చిత్రాల మార్క్ ను దాటినా కథానాయకుడు కూడా అల్లరి నరేషే. కానీ ఈ యువ హీరోకి గత నాలుగేళ్లుగా అసలు కాలం కలిసి రావటం లేదు. విరామమే లేకుండా వరుసగా చిత్రాలతో ప్రేక్షకులని పలకరిస్తున్నప్పటికీ అల్లరి నరేష్ కు విజయం వారించటం లేదు. సుడిగాడు చిత్రం తరువాత దాదాపు డజను చిత్రాలలో అల్లరి నరేష్ నటించగా అవన్నీ పరాజయం పొందాయి. గతంలో అల్లరి నరేష్ కి వున్న సేఫ్ మార్కెట్ ఇప్పుడు అతనికి పరిస్థితి ప్రతికూలం గా మారిపోయింది. ఈ తరుణంలో తనకు సీమ శాస్త్రి, సీమ టపాకాయ్ వంటి విజయాలు ఇచ్చిన హాస్య కథల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అల్లరి నరేష్.
అనుకోని కారణాల వలన దీపావళికి విడుదల కాలేకపోయినా ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రానికి తరువాతి నెలలో పెద్ద నోట్ల రద్దు చర్య తీవ్రంగా ప్రభావం చూపింది. ఇక ఈ నెల ప్రథమార్ధంలో ధ్రువ వంటి పెద్ద చిత్రం విడుదల ఉండటంతో తొలి నుంచి డిసెంబర్ 30 న విడుదలకు ప్రాధాన్యం ఇచ్చారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. డిసెంబర్ ఆఖరున వస్తే సంక్రాంతికి విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్స్ కి మధ్య రెండు వారాల సమయం దొరుకుతుంది కాబట్టి ఇంట్లో దెయ్యం నాకేం భయం సేఫ్ అవుతుంది అని అంచనా వేసుకున్నారు. కానీ తమిళనాట వార్ధా తుఫాను ప్రభావానికి 23 న విడుదల కావాల్సిన ఎస్ 3 వరం వాయిదా పడి 30 న విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అదే రోజు నారా రోహిత్ నటించిన అప్పట్లో ఒకడుండేవాడు విడుదల కూడా ఉండటంతో అల్లరి నరేష్ ఈ సారి కూడా గట్టెక్కటం కష్టంగానే కనపడుతుంది.