ఎప్పటిలానే క్రిస్టమస్ కి తన సినిమాని విడుదల చేసి సంచలన విజయంతో నడుస్తున్న సంవత్సరానికి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇవ్వాలని దంగల్ చిత్రంతో సిద్దమైపోతున్నాడు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. అయితే దంగల్ తెలుగు సినిమాల పై పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయేది కానీ ఆమిర్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా దంగల్ చిత్రం చేరువ చేయటం కోసం యుద్ధం పేరుతో అనువదించి హిందీ వెర్షన్ తో పాటే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరో పక్క ముందు నుంచి డిసెంబర్ 23 కు వస్తుంది అనుకున్న నేను లోకల్ చిత్రం ఏకంగా రెండు నెలలు వాయిదా పడింది. ఇప్పుడు సూర్య ఎస్ 3 కూడా 23 నుంచి వెనక్కి వెళ్లిపోయింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలనం వంగవీటి ఆమిర్ కి ధీటుగా నిలవనుంది.
ఇక దంగల్ విడుదల ఐన మరుసటి రోజునే తమ చిత్రాన్ని విడుదల చేయనున్నారు పిట్ట గోడ నిర్మాత రామ్ మోహన్. అష్ట చెమ్మ, గోల్కొండ హై స్కూల్, ఉయ్యాలా జంపాల, తాను నేను చిత్రాలతో తన అభిరుచి చాటుకున్న రామ్ మోహన్ నిర్మాణం లో తెరకెక్కిన చిత్రం కావటం, పైగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి ముందుకు రావటంతో పిట్టా గోడ పై ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి చూపులు తరువాత సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న చిన్న చిత్రం ఈ నెల 24 న విడుదలై ఆమిర్ ఖాన్, వర్మ ల పోటీకి తట్టుకుని విజయం సాధించాలని ఆశిద్దాం.