ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పి.వి.పి సంస్థ పలు భారీ బడ్జెట్ సినిమాలను స్టార్స్ తో తీసినప్పటికి ఒక్క విజయం కూడా దక్కలేదు. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ వ్యయంతో తెరకెక్కిన క్షణం విడుదలైన రెండవ రోజుకే అనూహ్యంగా మంచి మౌత్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టి పి.వి.పి కి తొలి సారి సక్సెస్ రుచి చూపించింది. చివరి వరకు ఉత్కంఠ తో సాగే కథ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది క్షణం. ఈ చిత్రం తెలుగులో విజయం పొందటంతో ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులు పొంది హిందీలో తెరకెక్కిస్తున్నారు వసు భగ్నానీ. ఇప్పుడు క్షణం తమిళ రీమేక్ కు రంగం సిద్ధం అవుతుంది.
ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ ఈ చిత్ర రీమేక్ హక్కులను కొద్ది కలం క్రితమే సొంతం చేసుకున్నారు. తాజాగా బేతాళుడు చిత్రాన్ని దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి కి క్షణం రీమేక్ అవకాశం వరించింది. బేతాళుడు చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలలో దర్శకుడి ప్రతిభ కనపడటంతో, సస్పెన్స్ థ్రిల్లర్ ని హేండిల్ చేయగలడు అన్న నమ్మకంతో శిబిరాజ్ ప్రదీప్ కృష్ణమూర్తి కి ఈ అవకాశం కలిపించారు. తెలుగులో కథానాయికగా చేసిన అదా శర్మ నే తమిళంలోనూ కథానాయికగా తీసుకున్నారు. తెలుగులో రవి వర్మ పోషించిన హీరోయిన్ మరిది పాత్రను తమిళంలోనూ ఆయనే పోషించనున్నారు.