బహుకాలం తర్వాత క్లాప్ కొట్టిన రామోజీ!

Update: 2016-10-19 16:51 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిన రామోజీరావు చాలా కాలం విరామం తర్వాత తన చేత్తో క్లాప్ కొట్టారు. ఆర్. నారాయణమూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రానికి రామోజీరావు క్లాప్ కొట్టారు. రామోజీ ఫిలింసిటీ రూపకర్తగా సినీ రంగ దిగ్గజాల్లో రామోజీరావు కూడా ఒకరు. తెలుగులో నిర్మించిన చిత్రాల సంఖ్య పరంగా రెండో అతిపెద్ద నిర్మాత ఆయనే. అలాంటి రామోజీరావు సొంత చిత్రాలు తీసి చాలా కాలం గ్యాప్ వచ్చింది. సాధారణంగా రామోజీరావు సినిమా ఫంక్షన్లకు రావడం ఇతర నిర్మాతల చిత్రాల కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

అలాంటిది చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో, చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి బుధవారం ఆయన పూజ నిర్వహించడంతో పాటు క్లాప్ కొట్టారు. తన ఫిలింసిటీలో నిత్యం ఎన్నో సినిమాలు ప్రారంభం అవుతున్నా, ఫంక్షన్లు జరుగుతున్నా వాటిలో సాధారణంగా ఎప్పుడూ రామోజీరావు పాల్గొనరు.

నిజానికి రామోజీది గోల్డెన్ హ్యాండ్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. మరి ఆ సెంటిమెంట్ ఆర్.నారాయణ మూర్తికి ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.

Similar News