జాతీయ స్థాయిలో గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు వున్న రామ్ గోపాల్ వర్మ మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేయనప్పటికీ ఆయన పరిచయం లేని భారతీయుడు ఉండడు ఏమో. 1989 నుంచి నిర్విరామంగా తెలుగు, హిందీ సినిమాలు చేతున్న రామ్ గోపాల్ వర్మ భాష అడ్డుగోడలు లేని ట్విట్టర్ ద్వారా వినూత్న శైలిలో వుండే తన వ్యక్తిగత ఆలోచనలను సామాజిక అంశాలకు అన్వయించి ప్రతి పౌరుడి చూపుని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నాల్లో నిత్యం ఉంటుంటారు. ఆయన సినిమాలకు విడిగా పబ్లిసిటీ బడ్జెట్ ను కేటాయించాల్సిన భారం నిర్మాత పై పడదు. ఆయన ట్విట్టర్ ద్వారా దేనికైనా అవసరానికి మించి ప్రచారం కలిపించగల దిట్ట. ఆలా ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చి రిజిస్టర్ చేసిన రెండు టైటిల్స్ ఇప్పటికి కూడా చిత్రీకరణ దశకి చేరుకోలేదు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రమాదవ శాత్తు మృతి చెందగా ఆయన మరణానంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిత్రం తీయబోతునాన్నంటూ రెడ్డి గారు పోయారు అనే టైటిల్ అనౌన్స్ చేసాడు వర్మ. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి అక్కడి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చేయూత అందించే విషయమై కొన్ని విభేదాలు తలెత్తిన తరుణంలో 'ఏపీ సీఎం కిడ్నాప్డ్ టీఎస్ సీఎం సస్పెక్టెడ్' అనే టైటిల్ అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ రెండు చిత్రాలు నేటికీ కూడా పట్టాలెక్కలేదు. ఆయనకు సమాంతర సామాజిక అంశాలు దాటుకుని ప్రేక్షకుడు ఆయన గురించి మాట్లాడుకోవాలని ఆశ ఎక్కువ కావటంతో టైటిల్స్ అనౌన్స్ చేశారు తప్ప సినిమాలు చేసే ఉద్దేశం ఆయనకీ ముందు నుంచి లేదు అనే విమర్శలు కూడా బలంగానే వచ్చాయి.
ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో జయలలిత మరణానికి ఆవిడ స్నేహితురాలు శశికళపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు, పార్టీలోని అసమ్మతి నేతల వాదనల నేపథ్యంలో తమిళనాడులో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వర్మ శశికళ అనే టైటిల్ అనౌన్స్ చేసి ఇది పొలిటికల్ డ్రామా చిత్రం. పూర్తిగా కల్పితం, నా ఊహాగానం అని వెల్లడించాడు. మరి ఇది కూడా వర్మ పాటించే పబ్లిసిటీ స్టంట్ లలో ఒకటో లేక నిజంగానే అటువంటి కథ సిద్ధం చేసుకున్నాడో వర్మకే తెలియాలి.