నటీనటులు: సునీల్, మనీషా రాజ్, సంజన, రాజా రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శివాజీ షిండే మొదలుగు వారు.
సంగీత: గోపి సుందర్
నిర్మాత: ఎన్.శంకర్
స్టోరీ, డైరెక్షన్: ఎన్.శంకర్
సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ హీరోగా తెరంగేట్రం చేసినప్పటినుండి కెరీర్లో రెండు మూడు హిట్ సినిమాలు తప్ప అసలు హిట్ అనే పదానికే అర్ధం తెలియనట్టుగా సినిమాలు చేస్తున్నాడు. కమెడియన్ గా చూసి చూసి ఉన్న ప్రేక్షకులు హీరోగా బాగానే ఆదరించారు. అది కూడా కామెడీ హీరోగానే..... కానీ సునీల్ మాత్రం సీరియస్ హీరోగా మారిన తర్వాత ఆయన హీరోగా పనికి రాడని ప్రేక్షకులు డిసైడ్ అయినా... దర్శక నిర్మాతలు డిసైడ్ కాలేకపోతున్నారు. అందుకే సునీల్ ని హీరోగా పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అస్సలు సునీల్ సినిమాలకు ఏ మాత్రం మర్కెట్ లేకపోయినా.. అతని సినిమాలు మాత్రం అనుకున్న టైం కి విడుదలవుతూ ప్రేక్షకులకు పరీక్ష పెడుతున్నాయి. అయితే గత కొన్ని సినిమాల నుండి ప్లాప్ లో ఉన్న సునీల్ ఇప్పుడు డైరెక్టర్ శంకర్ తో కలిసి మలయాళంలో సూపర్ హిట్ అయినా 2 కంట్రీస్ సినిమాని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు. మరి 2 కంట్రీస్ మలయాళంలో సెన్సేషన్ హిట్ అయ్యింది. అలాంటి సినిమాని తెలుగులో ఎన్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడనగానే సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. అలాగే 2 కంట్రీస్ ట్రైలర్ లో సునీల్ కామెడీ చెయ్యడం కూడా సినిమా మీద అంచనాలు పెరిగేలా చేసింది. మరి సునీల్ మళ్ళీ తన కామెడీతో హీరోగా మెప్పించాడా లేదంటే మళ్ళీ గత సినిమాల వలే యాక్షన్ అంటూ బోల్తా కొట్టాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
వెంకటాపురం లో పని పాట లేకుండా కోట్లు సంపాదించేసి కోటీశ్వరుడిగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ అందరిని మోసం చేస్తుంటాడు ఉల్లాస్(సునీల్). ఉల్లాస్ కి డబ్బు పిచ్చి. ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అందరిని నట్టేట ముంచేసి పచ్చి మోసగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఉల్లాస్ అదే గ్రామానికి చెందిన ఎమ్యెల్యే ని, మరియు పటేల్(షియాజీ షిండే)లను డబ్బు కోసం మోసం చేస్తాడు. పటేల్ చెల్లెలికి అవిటితనం ఉన్నా.. ఆమెతో పెళ్ళికి సిద్ధపడతాడు ఉల్లాస్. కానీ పెళ్లి ముహూర్తం దగ్గర పడినప్పుడు ఒక ధనవంతురాలైన అమెరికా అమ్మాయి లయ(మనీష రాజ్)ని పెళ్లి చేసుకుంటాడు ఉల్లాస్. అయితే అంత ధనవంతురాలైన లయ తో ఉల్లాస్ సుఖంగా వుండలేకపోతాడు. అసలు వెంకటాపురం ఎమ్యెల్యే తమని మోసం చేసిన ఉల్లాస్ ని ఏం చెయ్యకుండా వదులుతాడా? అలాగే పటేల్ తన చెల్లిని పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకున్న ఉల్లాస్ ని వదులుతాడా? అసలు ఉల్లాస్ లయని పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి కష్టాలు పడతాడు? లయ తో పెళ్లి తర్వాత లయ గురించి తెలిసిన ఆ షాకింగ్ విషయమేమిటి? ఇవన్నీ తెలియాలంటే 2 కంట్రీస్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే బావుంటుంది.
నటీనటుల నటన:
సునీల్ నటనకు పేరు పెట్టడానికి లేదు. తన కామెడీ టైమింగ్ తో ఎప్పటిలాగే ఇరగదీసాడు. కానీ గత సినిమాల్లో చాలా సన్నగా హీరో లక్షణాలతో కనబడిన సునీల్ ఈ సినిమాలో షాకింగ్ లుక్ తో చాలా లావుగా నిజం గా కమెడియన్ గా కనబడ్డాడు. అంత లావుగా ఉండబట్టే సునీల్ పక్కన ఈ సినిమాలో నటించేందుకు ఏ హీరోయిన్ ముందుకు రాలేదేమో.. అయితే ఎమోషన్ గా సునీల్ బాగా ఆకట్టుకున్నాడు. అసలు సునీల్ గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమాలో సునీల్ నటన ఆసలేమాత్రం బాగోలేదు. కాకపోతే డాన్స్ ల విషయంలో సునీల్ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ మనీషా రాజ్ మాత్రం గ్లామర్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ మనీషా మాత్రం నటనలో చాలా వీక్ గా అనిపిస్తుంది. నటనలో ఆమె నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన హీరోయిన్ సంజన యాక్టింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఇకపోతే సీనియర్ హీరో అయిన నరేష్ తన పాత్ర వరకు పర్వాలేదు అనిపించాడు. అలాగే రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, ఇంకా శ్రీనివాస్ రెడ్డి వీళ్ల కామెడీ అక్కడడక్కడా నవ్వు తెప్పించింది.
దర్శకుడు:
జై బోలో తెలంగాణతో తెలంగాణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్ శంకర్ సునీల్ హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్ ని తెలుగులో రీమేక్ చేసాడు. మరి మలయాళం నేటివిటీకి దగ్గరగా ఉన్న ఆ సినిమాని తెలుగు నేటివిటీకి దగ్గరగా తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. కథ రొటీన్, డబ్బు కోసం ఏదైనా చేసే వాడు ఆ డబ్బు కోసమే పెళ్లి చేసుకుని భార్య చేతిలో చిత్ర హింసలకు గురవ్వడం అనే విషయం మనకు బోలెడన్ని సినిమాల్లో కనబడతాయి. కాకపోతే దర్శకుడు రొటీన్ స్టోరీకి కామెడీ టచ్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీని జొప్పించి దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా విడాకుల డ్రామాతో.. కుటుంబ సభ్యుల మధ్య సీన్స్ అన్ని రొటీన్ గా చెత్తగా అనిపిస్తాయి. అస్సలు ట్విస్టులు లేకుండా సాగే కథతో ప్రేక్షకుడు ఫుల్ బోర్ ఫీలవుతాడు. ప్లాట్ గా సాగే నేరేషన్ జనాల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ కి దగ్గరగా కథను, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సినిమాలో హీరో సునీల్ లుక్ మాత్రం చాలా దారుణంగా వుంది. మరి హీరోగా సినిమాలు వదిలేయాలని అనుకుని బాడీ మీద కాన్సంట్రేషన్ తగ్గిందో ఏమో గాని సునీల్ లుక్ మాత్రం బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక దర్శకుడు శంకర్ కథ, దర్శకత్వం విషయంలో మాత్రం ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి సంగీతం అందించిన గోపి సుందర్ బాగా నిరాశ పరిచాడు. పాటలు అస్సలు ఆకట్టుకునేలా లేవు. పాటలన్ని సినిమాలో స్పీడు బ్రేకర్స్ మాదిరి చికాకు పుట్టించాయి. ఇక బ్యాకరౌండ్ స్కోర్ విషయానికొస్తే మాత్రం కొని సీన్స్ లో ఆకట్టుకునేలా వుంది. కానీ కొన్ని సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగోలేదు. ఇకపోతే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సి.రామ్ ప్రసాద్ తన కెమెరా వర్క్ తో మూవీ ని బాగానే కమర్షియల్ మోడ్ లోకి తీసుకెళ్ళాడు. అమెరికా అందాలను, కొన్ని సీన్స్ లో సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఎస్సెట్. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే మాత్రం.. ఎడిటింగ్ విషయంలో బోలెడు లోపాలున్నాయి. చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్లు ఉండడంతోపాటు.... కొన్నిచోట్ల గందరగోళంగా అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: సునీల్, ఎడిటింగ్, సంగీతం, కామెడీ, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే