డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, శృతి రామచంద్రన్, జయప్రకాశ్, రావు రమేష్, సుకన్య, బ్రహ్మాజీ, రఘు బాబు, అనీష్ కురువిళ్ళ [more]

Update: 2019-07-26 08:44 GMT

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, శృతి రామచంద్రన్, జయప్రకాశ్, రావు రమేష్, సుకన్య, బ్రహ్మాజీ, రఘు బాబు, అనీష్ కురువిళ్ళ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
మ్యూజిక్ డైరెక్టర్:జస్టిన్ ప్రభాకరన్
నిర్మాత: యాష్ రంగినేని
దర్శకత్వం: భరత్ కమ్మ

‘పెళ్లి చూపులు’ సినిమాలో అమాయకమైన హీరో, ‘అర్జున్ రెడ్డి’ లో రఫ్ స్టూడెంట్ అండ్ డాక్టర్, ‘ద్వారక’లో గాడ్, ‘గీత గోవిందం’ లో భార్యను విపరీతంగా ఆరాధించే కుర్రాడు, ‘నోటా’లో పొలిటీషియన్, ‘టాక్సీవాలా’ లో కెరీర్ కోసం కష్టపడే కుర్రాడు… ఇన్ని పాత్రలను తనదైన యాక్టింగ్ తోనూ, ఫేస్ ఎక్సప్రెషన్స్ తోనూ అలవోకగా పండించిన విజయ దేవరకొండ అంటే యూత్ కి విపరీతమైన క్రేజ్. నటించింది చాలా తక్కువ సినిమాలే. అయినా.. ఈ రౌడీ హీరో అంటే పిచ్చే అభిమానం. అందుకే యూత్ కి అభిమానులకు విజయ్ ఎప్పుడు దగ్గరగానే ఉన్నాడు. అర్జున్ రెడ్డి తో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ని పెంచుకున్న విజయ దేవరకొండ గీత గోవిందం, టాక్సీవాలా తో ఫ్యామిలీస్ ని తనవైపు తిప్పేసుకున్నాడు. అందుకే ఈ హీరో నుంచి సినిమా వస్తుంది అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు. అందులోను ‘గీత గోవిందం’ తో గీత, గోవిందులుగా హిట్ ఫెయిర్ అనిపించుకున్న రశ్మికతో విజయ్ సెకండ్ టైం నటిస్తున్నాడు అంటే ఆ క్రేజే వేరు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో విజయ దేవరకొండ యూత్ ఫుల్ ఫిలిం ‘డియర్ కామ్రేడ్’ అంటూ సినిమా చేసాడు. భరత్ కమ్మ అనే దర్శకుడు గురించి పూర్తిగా తెలియకపోయినా. విజయ్, రశ్మికలు హీరో హీరోయిన్స్ అంటే చాలు సినిమా మీద హైప్ రావడానికి. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదలకావల్సి ఉన్నప్పటికీ.. విజయ దేవరకొండ ఈ సినిమా ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వైపు నడిపించాలని… కాస్త రీ షూట్స్ అవి చేసి చివరికి నేడు ఈ సినిమా భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ తోనే సినిమా అంటే ఇలా ఉంటుంది అని చెప్పిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా మీద ఇంతగా అంచనాలు పెరగడానికి కారణం.. విజయ్ చేసిన ప్రమోషన్స్. డియర్ కామ్రేడ్ గురించి మనకెందుకులే అనుకున్నవాళ్ళకి కూడా విజయ్ చేసిన ప్రమోషన్స్ తో పిచ్చ ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాని విజయదేవరకొండ ఏకంగా నాలుగు భాషలంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లలో విడుదల చేస్తున్నాడు. మరి విజయ దేవరకొండ ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న ఈ ‘డియర్ కామ్రేడ్’ ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

కథ:

చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) కాకినాడకు చెందిన ఒక స్టూడెంట్. కానీ విప్లవ భావాలు గల బాబీ.. అందరికి కామ్రెడ్ గా ఓ స్టూడెంట్ యూనియన్ ని ఏర్పాటు చేసుకుని దానిలో లీడర్ గా ఉంటాడు. నాయకత్వ లక్షణాలు కలిగిన బాబీ కి ఆవేశం కోపం అన్ని కాస్త ఎక్కువే. స్టూడెంట్ లీడర్ గా ఓ గ్రూప్ ని వెంటపెట్టుకుని అన్యాయాలకు ఎదురు తిరుగుతుంటాడు. ఎప్పుడూ స్ట్రైక్‌లు, గొడవలు చేసే బాబీ స్టేట్ క్రికెట్ ప్లేయర్ అయినటువంటి లిల్లీ ( రశ్మిక మందన్న) ని ప్రేమలో పడేయడానికి నానారకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. బాబీ తో ప్రేమలో పడిన లిల్లీ.. బాబీ కోపావేశాలకు చాలా బాధపడుతుంది. కానీ బాబీ మాత్రం లిల్లీ ఎంత చెప్పిన వినే పరిస్థితుల్లో ఉండడు. ఎప్పుడూ గొడవాలంటూ తిరుగుతూ ఎంతో ప్రేమించిన లిల్లీకి దూరమవుతారు. చాలాకాలం దూరంగా ఉన్న బాబీ, లిల్లీ లు మల్లి కలుస్తారు. కానీ బాబీ మాత్రం ఎప్పటిలాగే కోపావేశాలను కంట్రోల్ చేసుకోడు. ఇక లిల్లీ కూడా బాబీ కి దూరమైనప్పుడు తన ప్రవర్తలో అనుకోని మార్పులొస్తాయి. లిల్లీ మానసిక రుగ్మతో బాధపడుతుంటుంది. అసలు లిల్లీ మారడానికి కారణం ఏమిటి? దూరమైనా లిల్లీ కోసం బాబీ ఎందుకు మారలేకపోతాడు? లిల్లీ కి బాబీ కి ఎదురైన సమస్యలేమిటి? అసలు లిల్లీ – బాబీ చివరికి ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

ఎప్పుడు అదిరిపోయే ఫేస్ ఎక్సప్రెషన్స్, అద్భుతమైన నటనతో ఆకట్టుకునే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లోను మంచి నటన ప్రదర్శించాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ గా కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని యువకునిగా విజయ్ నటన సూపర్. చైత‌న్య అలియాస్ బాబీ అనే స్టూడెంట్ పాత్ర‌కు ప్రాణం పోసాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. స్టూడెంట్ గాను, రశ్మికాని లవ్ లో పడేసే యువకుడిలా విజయ్ నటన బావుంది. రశ్మిక తో రొమాంటిక్ సన్నివేశాల్లోను విజయ్ దేవరకొండ రెచ్చిపోయి నటించాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. ఇక రశ్మిక కూడా లిల్లీ పాత్రలో క్రికెటర్ గా అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సీన్స్ లోనూ రశ్మిక నటన ఆమె పలికించిన ఫేస్ ఎక్సప్రెషన్స్ అన్ని చాలా బాగున్నాయి విజయ్ తో లవ్ ట్రాక్ లో రశ్మిక ఎప్పటిలాగే అంటే గీత గోవిందం సినిమాలోలా అద్భుతమైన నటన కనబర్చింది. మిగతా నటీనటులు చాలావరకు కొత్తవారే. ఇక వారు కూడా తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సందేశాన్ని అందించాడు. ఆడపిల్లలు తమ లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు వాళ్లకు వచ్చే అడ్డంకులకు భయపడకుండా తల్లిదండ్రులు, స్నేహితులు వాళ్లకు ధైర్యం చెప్పాలని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాడు. అయితే భరత్ కమ్మ చెప్పాలనుకున్నది బాగానే ఉంది… అలాగే మంచి స్టోరీ లైన్ ని కూడా తీసుకున్న భరత్… ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ గొడవలు, రాజకీయాలు, ప్రేమకథ మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రశ్మిక మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. సరదా సరదా సన్నివేశాలు, లవ్ సీన్స్, కాలేజీ గొడవలతో ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని బాబీ కొట్టే సన్నివేశం కూడా ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని బయటికి తెస్తుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా సీరియస్‌గా సాగుతుంది. కాస్త కామెడీని జోడించి ఉంటే ప్రేక్షకుడికి ఉపసమనం లభించేది. విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ అండ్ కామెడీ ఈ సినిమాలో పెద్దగా క‌నిపించ‌వు. సెకండాఫ్‌లో కూడా విజయ్, రష్మిక మధ్య సన్నివేశాలే బలం. సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్ ట్విస్టులు కానీ ఈ సినిమాలో కనిపించవు. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. అయితే స్లో నేరేషన్ లో ఆ ఎమోషనల్ డ్రామా అంతగా పండలేదు. ఇలాంటి స్లో నెరేషన్‌తో కూడిన సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు.

అదే అదనపు బలం….

సాంకేతికంగా…. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలం. మంచి పాటలతో పాటు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. ఇక రెండో బలం సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రాఫర్ సుజీత్ సారంగ్ కశ్మీర్‌ను ఎంత అందంగా చూపించారో… కాకినాడనూ అంతే బాగా చూపించాడు. సినిమా మొత్తం కాకినాడ, హైదరాబాద్, కశ్మీర్‌లో తెరకెక్కించారు. కాకినాడలో డ్రోన్ కెమెరా సహాయంతో తీసిన సన్నివేశాలు మంచి అనుభూతినిస్తాయి. ఇక సినిమాకు మెయిన్ మైనస్ ఎడిటర్ శ్రీజిత్ సారంగ్. శ్రీజిత్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. మైత్రివారు నిర్మాణ విలువలు బావున్నాయి. కథానుసారంగా ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ నటన, విజయ్ – రశ్మికల కెమిస్ట్రీ, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: కథనం, భరత్ కమ్మ దర్శకత్వం, ఎడిటింగ్, స్లో నేరేషన్, కామెడీ మిస్ కావడం

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News