బ్యానర్: వైజయంతి మూవీస్
నటీనటులు: నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, నవీన్ చంద్ర, శ్రీనివాస్ అవసరాల, మురళి శర్మ, వెన్నెల కిషోర్,కునాల్ కపూర్, రావు రమేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: శాందత్ సాయినుద్దీన్
ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
నిర్మాత: అశ్వినీదత్
దర్శకత్వం: శ్రీ రామ్ ఆదిత్య
ఏ భాషలో అయినా ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమాకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో దర్శకనిర్మాతలు ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చిన్న హీరోలను పెట్టయినా, పెద్ద హీరోలను పెట్టయినా మల్టీస్టారర్ తెరకెక్కింది అంటే... ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే విభిన్న సినిమాలు చేసే ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమా చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడడం మాములే. ఇక భలే మంచి రాజు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీరామ్ ఆదిత్య రెండో సినిమాగా శమంతకమణి అనే బుల్లి మల్టీస్టారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఆ సినిమా హిట్ కాకపోయినా.. ప్రేక్షకులకు నచ్చింది. తాజాగా శ్రీ రామ్ ఆదిత్య వైజయంతి అనే పెద్ద బ్యానర్ లో నాగార్జున - నాని లతో దేవదాస్ అనే నాగేశ్వరావు పాత సినిమా టైటిల్ తో కామెడీ ఎంటెర్టైనెర్ ని తెరకెక్కించాడు. నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా ఇద్దరి మధ్య కామెడీ పండించే డైలాగ్స్ తో... రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ అనే అందమైన అమ్మాయిలను హీరోయిన్స్ గా పెట్టి శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి దేవదాస్ ట్రైలర్, సాంగ్స్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆఫీసర్ సినిమా ప్లాప్ తో నాగార్జున, కృష్ణార్జున యుద్ధం సినిమా యావరేజ్ తో ఉన్న నాని ఈ దేవదాస్ తో హిట్ కొట్టారా? రెండు సినిమాలతో యావరేజ్ గా ఉన్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈసారైనా హిట్ అందుకున్నాడా? ఛలో సినిమాతో, గీత గోవిందం సినిమాతో హిట్స్ కొట్టిన రష్మిక దేవదాస్ తో హ్యాట్రిక్ కొట్టిందా? మళ్ళీ రావా సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్ కి దేవదాస్ ఇచ్చిన ఫలితమేమిటి? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
తీవ్రంగా గాయపడిన దేవా(నాగార్జున) అనే అండర్ వరల్డ్ డాన్ కి రహస్యంగా దాస్(నాని) తన క్లినిక్ లో వైద్యం చేస్తూ ఉంటాడు. దాస్ ఒక అమాయకమైన, ఉద్వేగభరితమైన డాక్టర్. ఎంత అమాయకత్వం అంటే... ఎంబీబీఎస్, ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ.. తన మంచితనం, నిజాయతీతో కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉద్యోగం కోల్పోతాడు. ఇక ఒక పాడుబడిన క్లినిక్ లో వైద్యం అందిస్తున్న డాక్టర్ దాస్ యొక్క ప్రవర్తన డాన్ దేవాని ఆకట్టుకోవడంతో దేవా... దాస్ తో అన్ని పంచుకోవడమే కాదు... దాస్ ని తరుచూ కలవడానికి క్లినిక్ కి వస్తూ ఉంటాడు. అలా దాస్, దేవా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని విషయాల్లో దేవా వలన దాస్ చిక్కులో పడుతుంటాడు. ఒక రోజు దాస్ కళ్లముందే దేవా ఒకరిని చంపెయ్యడంతో దేవకి, దాస్ కి మధ్య గొడవ మొదలవుతుంది. అప్పటి నుండి దేవాని అవాయిడ్ చెయ్యడానికి దాస్ ట్రై చేస్తుంటాడు. అసలు దేవా డాన్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేవా వెనుకున్న కథ ఏమిటి? దేవా.. దాస్ తో ఎందుకు ఫ్రెండ్షిప్ చెయ్యాల్సి వచ్చింది? దేవా వలన దాస్ ఎదుర్కున్న సమస్యలేమిటి? దేవా ని దాస్ అర్ధం చేసుకుని మళ్ళీ కలుస్తారా? ఇక ఈ సినిమాలో పూజ (రష్మిక ), జాహ్నవి (ఆకాంక్ష సింగ్) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే దేవదాస్ సినిమాని తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
నాగార్జున ఎప్పటిలాగే నటనలో అదరగొట్టేసాడు. స్టైలిష్ డాన్ దేవా గా నాగార్జున ఈ సినిమాకి ప్రాణం పోసాడు. డాన్ గా కామెడీ పండిస్తూ దేవా పాత్రలో ఇరగ దీసాడు నాగార్జున. డాన్ గా నాగార్జున లుక్స్, హీరోయిన్ తో రొమాన్స్ చేసేటప్పుడు లుక్స్ అన్నీ బాగున్నాయి. ఇక దాస్ గా నాని కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయకమైన, ఉద్వేగభరితమైన డాక్టర్ గా దాస్ కేరెక్టర్ నాని డిఫ్రెంట్ గా నటించి ఆకట్టుకున్నాడు. మంచితనం, నిజాయతీ, ఎవరికీ హాని తలపెట్టని తత్వం కలిగిన డాక్టర్ పాత్రలో నాని నటన అద్భుతం. తన అమాయకత్వంతోనే హాస్యాన్ని పండించాడు. ఇక దేవా, దాస్ పాత్రల్లో నాగార్జున, నానిల మధ్య సన్నివేశాలు సినిమా కె హైలెట్ అనే రేంజ్ లో వాళ్ల పాత్రలను వారి మధ్య సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నాడు... డిజైన్ చేసుకున్నాడు. అందుకే దేవా, దాస్ పత్రాలు సినిమాకే హైలెట్ అయ్యాయి. దేవగా నాగ్, దాస్ గా నాని బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చారు. ఇక హీరోయిన్స్ విషయానికొకటే.. ఈ సినిమాల హీరోలను ఎలివేట్ చేసినట్టుగా హీరోయిన్స్ రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ ల పాత్రలను దర్శకుడు లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. హీరోయిన్లు ఇద్దరి పాత్రలు ఈ సినిమాలో వీకే. రష్మికకి ఛలో సినిమాకి, గీత గోవిందం సినిమాలుకొచ్చిన పేరైతే రాదు. ఛలో లో అల్లరి పిల్లగా, గీత గోవిందం సినిమాలో సినిమానే లీడ్ చేసే పాత్రలో పేరు కొట్టేసిన రశ్మికకి దేవదాస్ లో పూజ కేరెక్టర్ పెద్దగా పేరు తీసుకురాదు. గ్లామర్ పరంగా, లుక్స్ పరంగా రష్మిక చాలా బాగుంది. ఇక మళ్ళీ రావా సినిమాలో సాదా సీదా హీరోయిన్ గా తెరకు పరిచయమైన ఆకాంక్ష సింగ్ దేవదాస్ లో గ్లామర్ పరంగా మెప్పించింది కానీ.. నటనకు ఆస్కారం లేకపోవడంతో ఆమె పాత్ర తేలిపోయిందనే చెప్పాలి. ప్రధాన విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ చూడటానికి బాగున్నాడు. అయితే నటించడానికి ఆయనకు పెద్దగా స్కోప్ లేదు. శరత్ కుమార్, మురళీశర్మ, నరేష్, సత్య, రావు రమేష్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
విశ్లేషణ :
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గత చిత్రాలు భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాల వలే దేవదాస్ చిత్రాన్ని కూడా ఒక సాధారణమైన చిన్న స్టోరీ లైన్ ని పట్టుకొని సినిమాగా మలిచాడు. అయితే దేవదాస్ కథలో పెద్దగా బలం లేకపోయినా కథనాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బాగానే నడిపించాడు. కథకు కొంచెం హాస్యం జోడించి కథని నడుపుతూ కాస్త సేఫ్ గేమ్ ఆడాడు అని చెప్పుకోవాలి. అలాగే ఇద్దరు హీరోలను సమానంగా చూపించే ప్రయత్నంలో ఎక్కువగా దర్శకుడు కామెడీకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే నాగార్జున ఎంట్రీ సన్నివేశం. ఈ మధ్య వచ్చినటువంటి నాగార్జున చిత్రాల్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాని అమాయకుడిగా, అధికారం చెలాయించే డాక్టర్ గా సరిగ్గా సెట్ అయ్యాడు. ఎప్పటిలాగే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, తన సహజ నటనతో ఈ చిత్రానికి మరింత పరిపూర్ణత అందించాడు. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున, నానీల మధ్య ఉండే స్నేహపూరిత సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి అని చెప్పాలి. తరవాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడి ఊహకు అందుతున్నప్పటికీ సరదా సరదా సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. నాగార్జున, నాని స్టార్‌డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. నాగ్, నాని మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. కామెడీ, ఎమోషన్ అన్నీ పండాయి. ఇంటర్వల్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ సెకండాఫ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని ప్రేక్షకుడిలో కలుగజేస్తుంది. కానీ ఆ ఆసక్తి సెకండాఫ్‌లోకి అడుగుపెట్టాక ఎంత సేపో ఉండదు. ఎందుకంటే అప్పటికే సినిమా ఎటు వెళ్తుందో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఇక హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక దర్శకుడు నాని, నాగ్ కేరెక్టర్స్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇచ్చాడో.. వాళ్ళు కూడా దేవదాస్ ని తమ భుజాల మీద మోసారనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
మణిశర్మ అందించిన మ్యూజిక్ లో రెండు పాటలు బాగానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా నాగార్జున స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే ప్రతిసారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనేలా ఉంది. ఇక మ్యూజిక్ కి తగ్గట్టుగానే పాటల చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ గా ప్లస్ అయ్యింది. ప్రతి సీన్ ని అద్భుతంగా కెమెరాలో బంధించాడు. ఇక సినిమా నిడివి కాస్త ఎక్కువగానే ఉంది. అదే సినిమాకి ప్రధాన మైనస్. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది. వైజయంతి మూవీస్ లో అశ్వినీదత్ ఈ సినిమాకి ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ పెట్టాడు. అందుకే ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్ లో నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది.
ప్లస్ పాయింట్స్ : నాగార్జున నటన, నాని నటన, నాగ్ - నాని కాంబో సీన్స్, ఫస్ట్ హాఫ్, పాటలు, సాంగ్స్ విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ : కథ, సెకండ్ హాఫ్, హీరోయిన్స్ కి ప్రాధాన్యత లేకపోవడం, దర్శకత్వం
రేటింగ్: 2.75/5