ఈ నగరానికి ఏమైంది మూవీ రివ్యూ

Update: 2018-06-29 06:56 GMT

బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్

నటీనటులు: విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

ఎడిటర్: రవి తేజ గిరజాల

మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ సాగర్

ప్రొడ్యూసర్: సురేష్ బాబు

డైరెక్టర్: తరుణ్ భాస్కర్

షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. విజయ్ దేవరకొండ అనే కొత్త అబ్బాయితో... రీతూ వర్మ తో కలిసి 'పెళ్లి చూపులు' వంటి సింపుల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాడు. తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' సినిమా తీసి విడుదలకు చాలానే ఇబ్బందులు పడ్డాడు. ఆ సినిమాని సురేష్ ప్రొడక్షన్ వారి నుండి సురేష్ బాబు విడుదల చెయ్యడంతో.. హైప్ క్రియేట్ అవడం.. సినిమా కి హిట్ టాక్ రావడంతో.. చిన్న సినిమాగా విడుదలై 'పెళ్లి చూపులు' భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ఫెమస్ అయ్యాడు. అలాగే హీరో విజయ్ కి కూడా మంచి మర్కెట్ వచ్చేసింది. ఇక తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' సినిమా తర్వాత స్టార్ హీరోతో సినిమా చేస్తాడు అనుకుంటే... రెండేళ్ల తర్వాత మెల్లగా కొత్త మొహాలతో.. సురేష్ ప్రొడక్షన్ లో 'ఈ నగరానికి ఏమైంది' అంటూ యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాని తెరకెక్కించాడు. 'ఈ నగరానికి ఏమైంది' అంటూ థియేటర్ లో సినిమాలు స్టార్ట్ అయ్యేటపుడు వచ్చే ఒక యాడ్ తో తరుణ్ భాస్కర్ ఒక సినిమానే తెరకెక్కించాడు. మరి కొత్త కాన్సెప్ట్ తో, కొత్త మొహాలతో... కొత్తగా ట్రై చేసిన తరుణ్ భాస్కర్ కి 'ఈ నగరానికి ఏమైంది'.. ఎలాంటి విజయాన్ని కట్టబెట్టిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఈ సినిమా నలుగురు స్నేహితులకు సంబందించిన కథ. నలుగురు స్నేహితుల లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో తరుణ్ భాస్కర్ ఈ సినిమాని తెరకేకించాడు. ఇక కథలోకి వెళితే... చిన్నప్పటి నుండి స్నేహంగా ఉండే చిన్ననాటి స్నేహితులు కార్తీక్(సుశాంత్ రెడ్డి), ఉపేంద్ర(వెంకటేష్ కాకుమాను), కౌశిక్(అభినవ్ గౌతమ్), వివేక్( విశ్వక్ సేన్ నాయుడు). వీరు ఇంటర్ పూర్తయ్యి.. ఇంజినీరింగ్ చదుకునేటప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తియ్యాలనే కోరికతో ఉంటారు. ఇక ఆ షార్ట్ ఫిలిం కోసం ఒకరు కథ తయారు చెయ్యడం, మరొకరు దాన్ని షూట్ చెయ్యడం, ఇంకొకరు హీరోగా.. మరొకరు ఎడిటర్ గా మారలనుకుంటారు. కానీ కొన్ని కారణాల వలన ఆ కల నెరవేరకుండా పోతుంది. అయితే కొన్నాళ్ళు గడిచాక అంటే నాలుగేళ్ళ తర్వాత ఎలైట్ క్లబ్బులో కార్తీక్ మేనేజర్ గా, ఉపేంద్ర సినిమా ఎడిటర్ గా, కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వివేక్ మాత్రం ఆల్కహాలిక్ గా డ్రగ్స్ కి బానిసగా మారతారు. మరి షార్ట్ ఫిలిమ్స్ తీసి పేరు సంపాదించాలన్న నలుగురు ఫ్రెండ్స్ ఇలా సెటిల్ అవడంతో.. వారి కల కలగానే మిగిలిందా? అసలు ఈ నలుగురు లైఫ్ లో షెర్లిన్( అనిషా అంబ్రోస్) శిల్ప(సిమ్రాన్ చౌదరి) ల పాత్ర ఏమిటి? అసలు ఆ నలుగురు తమ కలను వదిలేసి.. ఇలా సెటిల్ అవడానికి కారణమేమిటి? ఇన్నివిషయాలు తెలియాలి అంటే కచ్చితంగా ఈ నగరానికి ఏమైంది సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన:

ఈ సినిమాలో హీరోలుగా అంటే నలుగురు స్నేహితులుగా చేసిన వారంతా కొత్తవారే. ప్రేక్షకులకు వీరు పరిచయం లేని మొహాలు. ఇక సుశాంత్, విశ్వక్ సేన్ నాయుడు లు తమ నటనతో ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశారు. కొత్తవారైనా ఆ ఛాయలు ఎక్కడా కనబడకుండా ఉండేందుకు చాలా కష్ట పడ్డారు. సుశాంత్ కొన్ని సీన్స్ లో పర్వాలేదనిపించింది... మరికొన్ని ఎమోషనల్, అండ్ బోడి లాంగ్వేజ్ పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. అభినవ్ అండ్ వెంకటేష్ లు ఫ్రెండ్స్ గా బాగానే నటించారు. ఆ నలుగురిలో ఎవ్వరికి 100 మార్కులైతే పడవు. ఇక హీరోయిన్స్ గా నటించిన అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి లకు నటనలో స్కోప్ లేని పాత్రలే దొరికాయి. అనిషా అంబ్రోస్ గ్లామర్ పరంగా మెప్పించింది. ఉన్నంతలో అందాలు ఆరబోసినా.. ఆమెకి స్క్రీన్ మీద నిలబడే అవకాశాన్ని దర్శకుడు ఇవ్వలేదు. సిమ్రాన్ చౌదరి ని ఎందుకు తీసుకున్నారో తెలియని పరిస్థితి. మిగిలిన వారు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

పెళ్లి చూపులు వంటి సింపుల్ స్టోరీ తో సినిమా చేసి హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ రెండో సినిమా మీద భారీ ఎక్సపెక్టేషన్స్ వచ్చేసాయి. అలాగే తరుణ్ భాస్కర్ రెండో సినిమాపై ఆసక్తి అంచనాలు ఒక రేంజ్లో ఏర్పడ్డాయి. పెళ్లి చూపులు తర్వాత ఎంతో ఆలోచించి ముందుగా కమిట్ అయిన సురేష్ ప్రొడక్షన్ లో మీడియం బడ్జెట్ తో తన జీవితంలో జరిగిన కథనే ఆధారంగా తీసుకుని ఈ నగరానికి ఏమైంది అంటూ ఆసక్తికర టైటిల్ తో కొత్త నటులతో ఈ సినిమాని తెరకెక్కించాడు. విభిన్నమైన టైటిల్ అనగానే అందరూ ఈ సినిమాపై ఆసక్తిని చూపించారు. అయినా ప్రేక్షకుల్లో క్రేజ్ తేవాలని నిర్మాత సురేష్ బాబు తమ ప్రమోషన్స్ తో శతవిధాలా ప్రయత్నించాడు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు దర్శకుడు తరుణ్ భాస్కర్ రీచ్ కాలేకపోయాడనే చెప్పాలి. ప్రేక్షకులు తరుణ్ భాస్కర్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసాడు. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకునేలా లేదు. కథ, కథనం విషయం లో తరుణ్ అసలు పట్టు సాధించలేకపోయాడు. ఎంతో తెలివిగా కాలిక్యులేటెడ్ గా వుండే సురేష్ బాబు తరుణ్ భాస్కర్ మీద గుడ్డి నమ్మకంతో.. కథను పట్టించుకోలేదేమో... అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. కామెడీతో సినిమాని నడిపించేసి ప్రేక్షకుల మెప్పు పొందాలని చూసినా కామెడీ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. కామెడీ మరి రొటీన్ టైప్ లోనే ఉంది. పెళ్లి చూపులు సినిమాని కొత్త హీరో విజయ్ దేవరకొండతో తెరెక్కిస్తే.... తరుణ్ టేకింగ్.. విజయ్ యాక్టింగ్, అతని మేనరిజం తో సినిమా హిట్ ఆవడం.. విజయ్ పేరున్న హీరోగా మారడం జరిగిపోయాయి. అయితే ఈ నగరానికి ఏమైంది హీరో లు కూడా విజయ్ లా పేరు తెచ్చుకుంటారని తరుణ్ భాస్కర్ తో పాటు అందరూ ఊహించారు. కానీ వారి నటన ఆశించిన స్థాయిలో లేదు. అలాగే వారి ఫేస్ లను మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చేలా లేవు. సినిమా చూసిన అరగంటకు వారిని మర్చిపోవడం ఖాయం. మరి పెళ్లి చూపులు స్థాయిలో ఈ సినిమా కనబడడం లేదు. ఏది ఏమైనా ఈ సినిమా యూత్ ని టార్గెట్ చేసి తీసింది గనక యూత్ కాస్త తరుణ్ ని ఎమన్నా కాపాడాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

వివేక్ సాగర్ మ్యూజిక్ ఎక్కడా ఆకట్టుకునేలా లేదు. మ్యూజిక్ అంతా యావరేజ్ గా అనిపిస్తుంది. పాటలైతే చూసినప్పుడు మాత్రం.. తర్వాత గుర్తుండే సీన్ లేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం బావుందని చెప్పాలి. చాలా సీన్స్ లో నేపధ్య సంగీతం బాగా హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బావుంది. పలు సీన్స్ ని హైలెట్ చెయ్యడంలో కెమెరా పనితనం గొప్పదిగా ఉందని చెప్పాలి. బార్ సీన్స్ కానివ్వండి బీచ్ సీన్స్ కానివ్వండి అన్నిటిని రిచ్ గా చూపించారు. ఎడిటింగ్ విషయంలో మాత్రం బాగా శ్రద్ద పెట్టాల్సింది. ఇక సురేష్ బాబు నిర్మాతగా... ఈ సినిమా కి నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్: కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ, కొన్ని డైలాగ్స్, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్, ట్విస్ట్ లు లేకపోవడం

రేటింగ్: 2.25 /5

Similar News