బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నటీనటులు: అడివి శేష్, శోభిత ధూళిపాళ్ల, సుప్రియ, మధు షాలిని, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనీష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీచరణ్ పాకాల
కథ: అడివి శేష్ , అబ్బూరి రవి
సినిమాటోగ్రఫీ: షానియేల్ డియో
నిర్మాతలు: అభిషేక్ నామ
దర్శకత్వం: శశి కిరణ్ తిక్కా
టాలీవుడ్ లో విభిన్న నటుడిగా అడివి శేష్ కనబడతాడు. ఆయన నటించిన చిత్రాలన్నీ విభిన్నతతో కూడుకున్నవే. అడివి శేష్ లో కేవలం నటుడు మాత్రమే కాదు ఒక రచయిత కూడా దాగున్నాడు. అందుకే తాను కీలక పాత్రలు పోషిస్తున్న సినిమాలకు తానే కథను అందిస్తాడు. తన కథతో చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం సినిమాలో అడవి శేష్ ని హీరో అనలేం కానీ... సినిమా కథ మొత్తం అడివి శేష్ చుట్టూనే తిరుగుతుంది. ఆ సినిమాలో అడివి శేష్ అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చాడు. మరి కథలో తన పాత్రకి ప్రాముఖ్యం ఇచ్చుకున్న అడివి శేష్.. హీరోయిన్ పాత్రని, పోలీస్ ఆఫీసర్ అయిన అనసూయ పాత్రలను అంతే బలంగా రాసుకున్నాడు. మరి ఇప్పుడు కూడా తానే కథ అందించడమే కాదు స్క్రీన్ ప్లేని అందిస్తూ హీరోగా ఒక కొత్త డైరెక్టర్ శశి కిరణ్ తిక్కాని టాలీవుడ్ కి అందిస్తూ ఈ గూఢచారి అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చేసాడు. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అమితంగా ఆకట్టుకుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత తెరమరుగైన అక్కినేని నాగ్ మేనకోడలు సుప్రియ ఈ సినిమాలో నటించడం, అడివి శేష్ సినిమాలనంటే సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడుకున్నవిగా వుంటాయని ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు. మరి అడివిశేష్ గూఢచారిగా ఏ మాత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
గోపి ఉరఫ్ అర్జున్ (అడివి శేష్) తండ్రి (జగపతిబాబు) నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేస్తూ టెర్రరిస్టుల దాడిలో చనిపోతాడు. ఆ టెర్రరిస్టుల నుండి గోపి కి కూడా ప్రాణ హాని ఉందని భయపడిన జగపతి బాబు సన్నిహితుడు(ప్రకాష్ రాజ్) గోపి ఐడెంటిటీని మార్చేసి ఎక్కడో దూరంగా పెంచుతాడు. అయితే గోపి మాత్రం తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఎన్ఎస్ఏ ఏజెంట్ కావాలని, దేశానికి సేవ చేయాలని కోరుకుంటాడు. అదే పనిగా అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకుని ఎట్టకేలకు అర్జున్ త్రినేత్ర అనే ఒక జాతీయ నేర సంస్థలో చేరతాడు. అక్కడే సైకియాట్రీస్ట్ సమీరా(శోభిత ధూళిపాళ) ప్రేమలో పడతాడు. అయితే అర్జున్ త్రినేత్ర లో చేరిన తరువాత తన తండ్రి గత చరిత్ర, అతని అసలు ఐడెంటిటీ గురించి తెలుసుకుంటాడు. అందులో భాగంగానే విధి నిర్వహణ మొదలుపెట్టేలోగానే శత్రువులకు టార్గెట్ అవుతాడు. డిపార్ట్ మెంట్లోని కీలక వ్యక్తులను హత్య చేసి నేరం అతడి మీద మోపుతారు. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? తనను టార్గెట్ చేసింది ఎవరనే విషయాన్ని అర్జున్ ఎలా కనిపెట్టాడు? అర్జున్ అసలు ఐడెంటిటీ ఏమిటి? దానిని దాచడం వెనుక అసలు కథ ఏమిటి? అనేది తెలియాలంటే గూఢచారి సినిమాని అర్జెంట్ గా చూసెయ్యాల్సిందే.
నటీనటుల పాత్ర:
అడివి శేష్ గూఢచారిగా అర్జున్ అలియాస్ గోపీ పాత్రలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్లలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు అడివి శేష్ ప్రధాన బలం. నిజం చెప్పాలంటే స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చాలా ఈజ్ తో మోసి రచయిత కం హీరోగా డ్యూయల్ రోల్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించాడు. ఇక హీరోయిన్ గా తెలుగమ్మాయి.. శోభిత ధూళిపాళ్ల పాత్ర పెద్దగా లేకపోయినా.. ఉన్నంతలో మెప్పించింది. అడివి శేష్ లవర్ గా సినిమా మొత్తం ప్రయాణించే పాత్రే. కానీ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇచ్చిన సుప్రియ పాత్ర డిమాండ్ కు తగ్గట్టు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అర్జున్‌ను పెంచిన తండ్రి పాత్రలో, దేశ రక్షణ కోసం ఆరాటపడే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నటన బాగుంది. హీరో తండ్రిగా జగపతి బాబు పాత్ర ఈ సినిమాలో కీలకం. ఐబీ ఆఫీసర్‌గా వెన్నెల కిశోర్ సందర్భానుచితంగా కామెడీ చేసి ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
అడివి శేష్ ఒక సస్పెన్స్ త్రిల్లర్ కథను రాసుకుని ఒక కొత్త కుర్రాడికి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వానికి కొత్తే అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అడివి శేష్, అబ్బూరి రవిల కథను ఆకట్టుకునే తెరకెక్కించాడు. గూఢచారుల శిక్షణ ఎలా ఉంటుందనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపించినా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయ్యాక ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ దాకా వేగంగా నడిపించిన తీరు బాగానే తీసాడనే ఫీలింగ్ కలిగిస్తుంది . ఈ మధ్య కాలంలో ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఇంత ఎంగేజ్ చేయటం గూఢచారిలోనే చూస్తాం. సమీరా ఖాన్.. సమీరా రావుగా పేరు మార్చుకొని తన జీవితంలోకి ఎందుకొచ్చిందో తెలుసుకున్న హీరో.. చిన్న క్లూ ఆధారంగా శత్రువులను వెతుక్కుంటూ బంగ్లాదేశ్ వెళ్తాడు. అక్కడ వచ్చే యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది. అక్కడే తన తండ్రి బతికే ఉన్నాడని అర్జున్‌కి తెలుస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో శోభిత, శేషుల మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం కాస్త ఇబ్బంది పెడుతుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించినట్టు అనిపించినా.. ప్రీ క్లైమాక్స్ ట్విస్టుతో మళ్లీ సినిమా ఓ రేంజ్‌కు వెళ్తుంది. క్లైమాక్స్ కూడా అంత డ్రామా అవసరం లేదు అనిపిస్తుంది. శత్రువును వెతుక్కుంటూ బాంగ్లాదేశ్ దాకా వచ్చిన అర్జున్ అక్కడ వాళ్ళ స్థావరాలను కనిపెట్టే దాకా మంచి టెంపో మైంటైన్ చేసిన శశికిరణ్ క్లైమాక్స్ ముందు నుంచి కాస్త తడబడ్డాడు. ఏది ఏమైనా తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
మ్యూజిక్ కి అవకాశం లేకపోయినా... యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కే సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలం. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఒక్కొక్కచోట కాస్త బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కువయినా పెద్ద ఇబ్బందిగా అనిపించదు. షానియేల్ డియో సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. సినిమాని పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కించినా కెమెరా పనితనంతో సినిమాకి రిచ్ లుక్ వచ్చింది. ఎడిటింగ్ చేయాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య చాలా సన్నివేశాలకు కత్తెర వెయ్యాల్సింది. ఇక ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ప్రధాన బలం. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్: అడివి శేష్ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, సుప్రియ నటన, ట్విస్ట్ లు
మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్, హీరో హీరోయిన్ మధ్య ట్రాక్, కామెడీ, క్లైమాక్స్
రేటింగ్:3 .0 /5