'కణం' మూవీ రివ్యూ

Update: 2018-04-27 04:37 GMT

బ్యానర్: లైకా ప్రొడక్షన్ కంపెనీ

నటీనటులు: నాగ శౌర్య, సాయి పల్లవి, ఆర్ జె బాలాజీ, విరోనికా అరోరా, నిజలగల్ రవి, ప్రియదర్శి

మ్యూజిక్ డైరెక్టర్: సామ్ సీ.ఎస్

నిర్మాత: అల్లిరాజ సుభాస్కరన్

డైరెక్టర్: విజయ్

మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో ఒక్కసారిగా వెండితెర మీద దూసుకొచ్చిన హీరోయిన్ సాయి పల్లవి... తెలుగులో 'ఫిదా, ఎంసీఏ' సినిమాల్తో తనదైన ముద్ర వేసింది. నటనలోనూ, డాన్స్ లలోను సాయి పల్లవికి ఎవరు సాటిలేరు అనిపించేలా ఉంది అంటేనే సాయి పల్లవి క్రేజ్ ఎలా ఉందొ చెప్పొచ్చు. తన మొహంలోనూ భావాలను, నటనలో ఔన్నత్యాన్ని, స్ప్రింగ్ లాంటి బాడీతో సాయి పల్లవి చేసే మ్యాజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే. కేవలం ఒకే ఒక్క 'ఫిదా' సినిమాతో హీరో కన్నా ఎక్కువగా సాయి పల్లవి పేరు సంపాదించుకుంది. అలాగే 'ఎంసీఏ' సినిమా కూడా విడుదలై యావరేజ్ టాకొచ్చినా కూడా కేవలం ఆ సినిమా హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి వలెనే అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది ఆ సినిమా. తాను నటిస్తున్న సినిమాల్లో అందరి నటులను డామినేట్ చెయ్యగల సత్తా ఉన్న భామ సాయి పల్లవి. ఇప్పుడు కూడా తమిళ డైరెక్టర్ విజయ్, సాయి పల్లవి ని మెయిన్ లీడ్ గా తీసుకుని ఈ 'కణం' సినిమాని తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమా లో హీరో గా నాగ శౌర్య నటించాడు. నాగ శౌర్య కూడా ప్రస్తుతం 'ఛలో' సినిమా హిట్ తో జోరుమీదున్నాడు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి డామినేషన్ ఎక్కువగా ఉందని.. బహిరంగంగా ఆమెపై కోపాన్ని ప్రదర్శించాడు నాగ శౌర్య. మరి నాగ శౌర్య ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ప్రమోషన్స్ కి కూడా హాజరవలేదు. ఇక సాయి పల్లవి తనకి సర్ది చెబుదామన్న రెస్పాండ్ కాలేదనే రూమర్స్... అలాగే సాయి పల్లవి నటన, నాగ శౌర్య క్రేజ్ ఇలా సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశాయి. మరి 'ఫిదా, ఎంసీఏ' విజయాల జోరు సాయి పల్లవి 'కణం' సినిమా తో కొనసాగించిందా? 'ఛలో' తో హిట్ కొట్టిన నాగశౌర్య మళ్ళీ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సినిమా ఓపెనింగ్ షాటే.. హాస్పిటల్ లో మొదలవుతుంది. పెళ్లికాకముందే ప్రేమించుకున్న కృష్ణ(నాగ శౌర్య) తులసి (సాయి పల్లవి) చేసిన తప్పు వలన ప్రెగ్నెంట్ అవుతుంది.అయితే పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిన తులసిని ప్రెగ్నెంట్ తీయించేసుకోమని తులసి తల్లితండ్రులు, మావయ్య ఒత్తిడి చెయ్యడం దానికి కృష్ణ కూడా సరే అంటాడు. అలా తులసి అబార్షన్ చేయించుకుంటుంది. ఆ తర్వాత ఐదేళ్లకు పెళ్లి చేసుకున్న తులసి, కృష్ణ లు హానీమూన్ కి వెళ్లొచ్చి కొత్త ప్లాట్ లో కాపురం పెడతారు. అయితే కొత్త ఇంట్లో కాపురం పెట్టిన తులసి కి తన ఇంట్లో తనకి తెలియకుండా ఏదో జరుగుతుందనే అనుమానం మొదలవుతుంది. ఆ విషయం ఎవరికీ చెప్పిన వినిపించుకోకుండా తులసికి పిచ్చి పట్టిందని... పూజలు చేయించడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం చేస్తుంటారు. అయినా తులసి కి నయం కాదు. తులసి చెప్పినట్టే తులసి తల్లి, కృష్ణ తండ్రి, తులసికి అబార్షన్ చేసిన డాక్టర్ అనుకోకుండ చనిపోతారు. ఇక తన భర్త కృష్ణ కి కూడా ప్రమాదం ఉందని తులసి భర్తని వదలకుండా అంటిపెట్టుకునే తిరుగుతుంది. అసలు తులసి కి నిజంగానే పిచ్చా? లేదంటే తులసి ఏదన్నా ఆత్మ ని చూస్తుందా? అబార్షన్ చేయించుకోవడం వల్ల తమ జీవితాల్లో ఎమన్నా దారుణాలు జరిగాయా? అసలు తులసి తల్లి, కృష్ణ తండ్రి, డాక్టర్ ఎందుకు చనిపోతారు? తమ చుట్టూ ఉన్న విషమమైన సమస్యలనుండి తులసి, కృష్ణలు ఎలా బయటపడతారు? అనేదే కణం కథ.

నటీనటుల నటన:

ఎప్పటిలాగే తులసీగా సాయి పల్లవి అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పటివరకు చదువుకున్న అమ్మాయిలా, ప్రేమికురాలిగా మాత్రమే నటించింది. మొదటిసారి పెళ్ళైన గృహిణిలా నటించి అదరగొట్టేసింది. పెళ్లి తరవాత ఆమె ఎదుర్కున్న సమస్యలను సాయి పల్లవి పేస్ ఎక్సప్రెషన్స్ తో పడేసింది. అబార్షన్ చేయించుకున్న అమ్మాయిగా.. దానివల్ల మానసిక వేదనకు గురైన ఇల్లాలుగా, అమ్మగా ఇలా అన్ని వేరియేషన్స్ లోను సాయి పల్లవి అద్భుతమైన నటన ప్రదర్శించింది. కణం సినిమాకి మెయిన్ లీడ్ అండ్ మెయిన్ హైలెట్ కూడా సాయి పల్లవి అని ఢంకా పదంగా చెప్పొచ్చు. కణంలో తులసీగా సాయి పల్లవి ఛాలెంజింగ్ రోల్ లో నటించి మెప్పించింది. ఇలాంటి రోల్స్ చెయ్యడానికి టాప్ హీరోయిన్స్ పెద్దగా ఆసక్తి చూపెట్టరు. కానీ కెరీర్ ఆరంభంలోనే సాయి పల్లవి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ఒప్పుకుని అదుర్స్ అనిపించింది. ఇక కృష్ణ గా సాయి పల్లవి భర్తగా నాగ శౌర్య ఉన్నంతలో మెప్పించాడు. కానీ నాగ శౌర్య కి ఈ సినిమాలో ఎక్కువగా నటించే స్కోప్ లేకుండా పోయింది. సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టూనే తిరగడంతో.. నాగ శౌర్య కి నటించే అవకాశం కలగలేదు. కానీ భార్య మానసికంగా వేదనకు గురవుతుంటే... ఆమెని చూసి బాధపడే యువకుడిగా మెప్పించాడు. ఇక ఈ సినిమాలో మరో మెయిన్ హైలెట్ దియా పాత్రధారి బేబీ వెరోనికా. దియా పాత్రలో ఆత్మగా వెరోనికా అద్భుతంగా నటించింది. సాయి పల్లవి తర్వాత చెప్పుకోదగిన పాత్ర బేబీ వెరోనికదే. ఇక కామెడీ పరంగా పెళ్లి చూపులు ఫెమ్ ప్రియదర్శి పోలీస్ ఆఫీసర్ గా నవ్వించాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు విజయ్ ఒక మెస్సేజ్ ఒరింటెడ్ కథని తీసుకుని సినిమా గా మలిచాడు. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ చక్కని సందేశాన్ని ప్రేక్షకులకు అందించాడు. అయితే సినిమా కథ మొత్తం సాయి పల్లవి ని దృష్టిలో పెట్టుకుని రాసినట్టుగా ప్రతి ఫ్రెమ్ లోను అర్ధమవుతుంది. సినిమాలో సాయి పల్లవికి ఇచ్చిన ఇంపోర్టన్స్ మరే కేరెక్టర్ కి ఇవ్వలేదు. మిగతా పత్రాలపై కూడా దృష్టి పెట్టాల్సింది. ఇక సాయి పల్లవిని హైలెట్ చేసినప్పటికీ ఆమె నుండి అద్భుతమైన నటనను రాబట్టడంలో దర్శకుడు 100 కి 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఇక దర్శకుడు డైరెక్షన్ మీద పెట్టిన దృష్టి స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత దృష్టి, జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా సీన్స్ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. సినిమా స్టార్ట్ అయ్యిన కొద్దిసేపటివరకు చాల బావుంది అనిపిస్తుంది. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ సాగదీత అనిపిస్తుంది. అందుకే పెద్దగా ప్రేక్షకుడు ఆసక్తి కనబరచలేదు. పెద్దగా ట్విస్టులు లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్సే. కామెడీ విషయంలోనూ దర్శకుడు విజయ్ దృష్టి సారించినట్టుగా అనిపించలేదు. సినిమా మొత్తం హీరోయిన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీదనే నడిపించేసి ఒక చక్కని మెస్సేజ్ తో సినిమా కి క్లైమాక్స్ ఇచ్చేసాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

కణం సినిమా కి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. కథ తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. ఎమోషనల్ సీన్స్ లోను, థ్రిల్లింగ్ సీన్స్ లోను బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అనేలా వుంది. ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. ప్రతి సీన్ ని ఎంతో రిచ్ గా, క్లారిటీగా చూపించడంలో సినిమాటోగ్రఫీ చాలాబావుంది. అసలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేలా ఉందని అంటే అతిశయోక్తి కాదు. సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది మాత్రం ఎడిటింగ్, ఎడిటింగ్ లో చాల లోపాలున్నాయి. కొన్ని సీన్స్ ఎడిటింగ్ చెయ్యాల్సిన అవసరం చాలా వుంది. సినిమా లో లాగింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఇక దర్శకుడు స్క్రీన్ ప్లే ని గాలికొదిలేసాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకత్వం మీద ఉన్న ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లే మీద లేదనిపించింది కొన్ని సీన్స్ చూస్తే. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: సాయి పల్లవి నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, మెస్సేజ్, కొన్ని ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్: కథ, ఎడిటింగ్, కామెడీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్

రేటింగ్: 2.5/5

Similar News