'మహానటి' మూవీ రివ్యూ

Update: 2018-05-09 08:39 GMT

బ్యానర్: వైజయంతో మూవీస్

నటీనటులు: కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, కాజల్, షాలిని పాండే, క్రిష్, ప్రకాష్ రాజ్ తదితరులు

సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్

కథ: సాయి మాధవ్ బుర్ర

స్క్రీన్ ప్లే: సిద్ధార్థ్ శివస్వామి

సినిమాటోగ్రఫీ: దాని శాంచెజ్- లోపెజ్

ప్రొడ్యూసర్స్: ప్రియా దత్, స్వప్న దత్

దర్శకుడు: నాగ్ అశ్విన్

వెండితెర మీద సినిమాలు మొదలైనప్పుడు... అవి కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండేవి. అయినా కథానుసారంగా కాస్ట్లీ ఇల్లు, భారీ ధరల కార్లు, నగలు, కాస్ట్యూమ్స్ ఇలా అన్ని భారీ తనాన్ని సంతరించుకునేవి. కేవలం బొమ్మ బ్లాక్ అండ్ వైట్ అనే కానీ.. మిగతావన్నీ చాలా రిచ్ నెస్ తో కొడుకున్నవే ఉండేవి. అయితే అప్పట్లో బ్లాక్ వైట్ సినిమాలను ఇప్పుడు ప్రసారం చెయ్యడానికి... అవి ప్రేక్షకులను మనసులను హత్తుకునేలా... టివి ఛానల్స్ ఎప్పుడూ పోటీ పడుతుంటాయి .అలా బ్లాక్ వైట్ సినిమాలు ఇప్పుడు ఈ తరం ప్రేక్షకుడికి కొత్త కాకపోయినా.. అలనాటి నటుల నట జీవితం, నిజ జీవితాల గురించిన విశేషాలు పెద్దగా సామాన్య ప్రేక్షకుడికి తెలియవు. అయితే నటులలో మేటి నటులైన ఎన్టీఆర్ జీవితం అంటే తెలిరిచిన పుస్తకం. ఇక ఏఎన్నార్ జీవితం కూడా అంతే. కానీ అప్పట్లో ఒక పేదింటి, చదువు కూడా రాని ఒక సామాన్యమైన అమ్మాయి సినిమాల్లో టాప్ పొజిషన్ లో హీరోయిన్ గా రాజ్యమేలింది. ఆమె ఎవరో కాదు అందరూ దేవతగా పూజించే సావిత్రి. సావిత్రి అంటే కేవలం సినిమాల్లో మకుటం లేని మహారాణి. ఆమె కట్టు, బొట్టు, నగలు ఇలా మాత్రమే సావిత్రిని ఊహించుకునే వారు చాలామందే ఉన్నారు. అందంలో, అభినయంలో ఆమెకి మరెవరు సాటి లేరంటే అతిశయోక్తి లేదు. కానీ సావిత్రి ఆ ఆనందం వెనుక విషాదం కూడా దాగుంది. సినిమాల్లో మహారాణిగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి అవసాన దశలో ఎంతో కష్టపడింది. ప్రేమ, పెళ్లి విషయాల్లో మోసపోయింది. అలాంటి సావిత్రి జీవిత కథను 'ఎవడె సుబ్రహ్మణ్యం' ఫెమ్ నాగ్ అశ్విన్ 'మహానటి' గా వెండి తెర మీద ఆవిష్కరించాడు. ట్రెడిషనల్ హీరోయిన్ కీర్తి సురేష్ ని సావిత్రి పాత్రకి ఎంపిక చేయడంతోనే నాగ్ అశ్విన్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు. అలాగే మహానటి ప్రమోషన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగార్జున, నాని వంటి స్టార్స్ ని వాడుకోవడం కూడా సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు. ఇక సమంత, విజయ్ దేవరకొండ లను కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్న అశ్విన్ మరింతమంది స్టార్స్ ని మహానటి గెస్ట్ రోల్స్ గా భాగస్వామ్యులను చేసాడు. మరి సావిత్రి బయో పిక్ తో సాహసం చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమా తో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో.... భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న మహానటి మూవీపై ప్రేక్షకుల తీర్పు ఏమిటనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ అంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. ఎందుకంటే.. మొదటి నుండి చెప్పుకున్నట్టుగా సావిత్రి చిన్ననాటి స్మృతులు, సినిమాల్లోకి ఎలా వచ్చింది. అలాగే సినిమాల్లో పైకి రావడడానికి ఎలా కష్టపడింది. జెమిని గణేశన్ తో ప్రేమ, పెళ్లి, విడిపోవడం, జీవితంలోని ఒడి దుడుకులను ఉన్నది ఉన్నట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెర మీద ప్రెజెంట్ చేసాడు. సావిత్రి హోటల్ గది నుంచి ఆసుపత్రికి చేరటంతో మొదలైన కథ... జర్నలిస్ట్ మధురవాణి (సమంత) ఫోటో గ్రాఫేర్ విజయ్ అంథోని(విజయ్ దేవరకొండ) లు కలిసి సావిత్రి జీవితంలో ఏం జరిగింది అని ప్రేక్షకులకు వివరించడంతో సినిమా మొదలవుతుంది. సావిత్రి (కీర్తి సురేష్) నటిగా జెమిని గణేశన్ (దుల్కర్ సల్మాన్) సహాయంతో ఒక్కో మెట్టు ఎక్కుతుంది. మేటి నటులు ఏఎన్నార్ (నాగ చైతన్య) ఎన్టీఆర్ లతో కలిసి నటించిన సినిమాల్తో పాటు... జెమినీగణేశన్ తో కలిసి నటించిన సినిమాల్తోనూ సావిత్రి హీరోయిన్ గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంటుంది. జెమిని తో మొదటి సినిమా చేస్తున్నప్పుడే అతనితో ప్రేమలో పడిన సావిత్రి కొన్నాళ్ళకు సీక్రెట్ గా వివాహం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత అందరికి ఆ పెళ్లి బహిర్గతమవుతుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా పెళ్లి చేసుకున్న సావిత్రికి - జెమిని గణేష్ కి మధ్యన విభేదాలు రావడం... ఆ క్రమంలోనే సావిత్రి మద్యానికి బానిస అవడం.... అవసాన దశలో ఆమె చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం వంటి వాటితో సినిమా ముగుస్తుంది. ఇక ఈ సినిమాలో ట్విస్ట్ లు అంటూ ఏం లేకపోయినా... సావిత్రి కథను మాత్రం నాగ్ అశ్విన్ ఉన్నది ఉన్నట్టుగానే ప్రెజెంట్ చేసాడు.

నటీనటుల నటన:

దర్శకుడు నాగ్ అశ్విన్ తన సినిమాలోకి నటీనటులను భారీగా తీసుకున్నప్పటికీ... వారి పాత్రల తీరు తెన్నులను... గెటప్స్ ని యాజిటీజ్ గా దింపేసాడు. ఇక కీర్తి సురేష్ మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చేసింది. అసలు కీర్తి సురేష్ కి మహానటి సావిత్రి పాత్ర కన్నా గొప్ప పాత్ర భవిష్యత్తులో వస్తుంది అంటే నమ్మడం కూడా కష్టమే. అంతలా సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించింది. కాదు జీవించింది అని చెప్పడం కరెక్ట్. కట్టు, బొట్టు, నడకలో స్టయిల్, నగలు ఇలా అన్నిటిలో సావిత్రిని మించిపోయేలా కీర్తి అదరగొట్టేసింది. కట్టు, బొట్టు, అందం, అభినయంలో సావిత్రి పాత్రకు ఏ మాత్రం తీసిపోనట్టుగా అలనాటి అందాల తార మళ్లీ దిగి వచ్చిందా అన్నట్టుగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలోకి తోసేసింది కీర్తి సురేష్. సినిమా మొత్తం చాలా పాత్రలే ఉన్నప్పటికీ ఆసాంతం ప్రయాణం చేసేది మాత్రం కీర్తి సురేష్ సావిత్రి పాత్రే. నటిగా, ప్రేమికురాలిగా, మోసపోయిన అమ్మాయిలా సావిత్రి పాత్రలో కీర్తి నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక కీర్తి సురేష్ తో పాటుగా మరో మెయిన్ కేరెక్టర్ కూడా సినిమా ఆసాంతం ప్రయాణం చేస్తుంది. అది సావిత్రి లవర్, హీరో జెమిని గణేషన్ పాత్ర. జెమిని గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ కూడా మంచి నటనను కనబర్చాడు. ప్రేమికుడిగా, నటుడిగా, తాగుబోతుగా జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్ అదరగొట్టేసాడు. ఇక జర్నలిస్ట్ మధురవాణిగా సమంత కూడా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. సమంత కట్టు, బొట్టు జర్నలిస్ట్ స్టయిల్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలనాటి జర్నలిస్ట్ ల స్టయిల్లో సమంత అద్భుతంగా నటించింది. ఇక విజయ్ ఆంథోనిగా, ఫోటో జర్నలిస్ట్ గా కెమెరా మెళ్ళో వేసుకుని మధురవాణి వెన్నంటే ఉండే పాత్రలో విజయ్ దేవరకొండ కూడా మంచి నటన కనబర్చాడు. ఇక ఎస్వీ రంగారావు పాత్రధారి మోహన్ బాబు ని చూస్తుంటే అచ్చం ఎస్వీ రంగారావు ని చూసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాగే సావిత్రి ఫ్రెండ్ గా షాలిని పాండే, సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్ర ప్రసాద్, సావిత్రి గురించి వివరించే పాత్రలో నరేష్. దర్శకులు క్రిష్, సందీప్ రెడ్డి ఇలా ఎవరికీ వారే తమకిచ్చిన చిన్నపాటి కేరెక్టర్స్ లో అద్భుతంగా నటించి మెప్పించారు. అసలు వారి కేరెక్టర్స్ కి సంబందించిన లుక్స్ సినిమాకే హైలెట్ అనేలా వున్నాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

మహానటి కి మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ మహానటి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు. ఎమోషనల్ సీన్స్ లో, రొమాంటిక్ సన్నివేశాల్లోను మిక్కీ జే మేయర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసింది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కాస్త డల్ అనిపిస్తుంది. అప్పట్లో సినిమాల్లోని సెట్స్ ని ఎంత చక్కగా వేసినా వాటిని అత్యంత అద్భుతంగా చూపించడంలో సినిమాటోగ్రఫీనే హైలెట్. కానీ శాంచెజ్- లోపెజ్ అలనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా తెర మీద ప్రెజెంట్ చెయ్యడంలో తడబడినట్లుగా అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే మాత్రం... సెకండ్ హాఫ్ లెంగ్తి సీన్స్ కి కత్తెర వెయ్యాల్సింది. కానీ దర్శకుడు ఎలా చెబితే ఎడిటర్ అలా చెయ్యడం వలన... చాలా సీన్స్ సినిమాకి భారంగా మరాయి. తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి బయోపిక్ మూవీగా వచ్చిన మహానటిలాంటి క్రిటికల్ ప్రాజెక్ట్‌ను డీల్ చేయాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. అయితే రిస్క్ ఎంత ఉన్నా మహానటి చిత్రాన్ని డీల్ చేస్తూ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్‌లు. ఈ హిస్టారికల్ క్లాసికల్ మూవీని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు.

విశ్లేషణ:

దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయో పిక్ మహానటి సినిమాని కమర్షియల్ విలువల కోసం తియ్యలేదు. కమర్షియల్ సూత్రాలను పూర్తిగా పక్కన పెట్టేసి ఒక స్వచ్చమైన అనుభూతి కోసం చేసిన ప్రయత్నం ఈ మహానటి. అంత పెద్ద నటి జీవితాన్ని సినిమాగా మలచడం అంటే... అది చాలా కష్టమైన పనే. కానీ నాగ్ అశ్విన్ సావిత్రి బయో పిక్ మహానటిని నెత్తిన వేసుకుని పెద్ద సాహసమే చేసాడు. అసలు ఈ సినిమాలో చాలా పాత్రలే ఉన్నప్పటికీ ఆసాంతం ప్రయాణం చేసేది మాత్రం కీర్తి సురేష్, జెమిని గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్. ఫస్ట్ హాఫ్ మొత్తం సావిత్రి గారి సినిమా ప్రయాణం మీద ఫోకస్ పెట్టిన నాగ అశ్విన్ సెకండ్ హాఫ్ లో తన వ్యక్తిగత జీవితంలో విషాదం ఎందుకు ప్రవేశించింది అనే పాయింట్ మీద కథను రాసుకున్నాడు. సో రెండు కోణాల్లో సావిత్రి గారిని చూపించడం ఇందులో ప్రత్యేకత. కాకపోతే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా హెవీ కంటెంట్ ఉండటంతో స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప ప్రేక్షకులు ఎక్కడా డిస్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు నాగ అశ్విన్. పూర్తిగా ఎంగేజ్ చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో మధురవాణి పాత్ర ద్వారా సావిత్రి గారి పాత్రకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కంటతడి పెట్టిస్తుంది. అంచనాలకు తగ్గట్టే మహానటిని తీర్చిదిద్దిన నాగ అశ్విన్ ఇంటర్వెల్ ముందు జెమినీ గణేషన్‌- సావిత్రి మ్యారేజ్‌ సీన్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా.... ఫస్టాఫ్ అంచనాలను మించినట్టుగా తెరకేకించిన సెకండాఫ్‌ లో మాయాబజార్ ఎపిసోడ్స్, గ్లామర్ ఇండస్ర్టీలో స్టార్ అయిన తర్వాత సావిత్రి ఒక్కసారిగా జెమిని గణేశన్ తో విభేదాలు, ముందుకు బానిస అవడం వంటి విషయాలతో బాగా ఎమోషనల్ గా చూపించాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం లెంత్ ఎక్కువైనట్లుగా సాగదీతగా అనిపించడం మాత్రం మహానటి మైనస్ అనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన సీన్స్ కూడా పెద్దగా లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి. వాస్తవికత, కల్పితానికి మధ్యలో సావిత్రి సినిమా నాగ్ అశ్విన్ మహానటి సినిమాని తెరకెక్కించినప్పటికీ... కథలోనూ అతిధిపాత్రలు అలా వచ్చి వెళ్లిపోవడం, కొన్ని పాత్రల పేర్లు సామాన్యమైన ప్రేక్షకుడి కి అర్ధమయ్యేలా వుండవు. నాగ్ అశ్విన్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ... కొన్ని చోట్ల కల్పితాలు తావివ్వడం అనేది ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్: కీర్తి సురేష్ నటన, దుల్కర్ సల్మాన్ నటన, సమంత, విజయ్ దేవరకొండ, గెస్ట్ పాత్రలు చేసిన నటులు, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: సమంత - విజయ్ దేవరకొండ సీన్స్, ఎన్టీఆర్ పాత్ర పెద్దగా లేకపోవడం, గెస్ట్ అలా ఇలా వెళ్లిపోవడం, కొన్ని చోట్ల కల్పితాలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

రేటింగ్: 3.0 /5

Similar News