మెహబూబా మూవీ రివ్యూ

Update: 2018-05-11 07:41 GMT

బ్యానర్: పూరి కనెక్ట్స్

నటీనటులు: ఆకాష్ పూరి, నేహా శెట్టి, మురళి శర్మ, అమిత్ ఆనంద్ రౌత్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: సందీప్ చౌతా

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

ఎడిటర్: జునైద్ సిద్దిక్వి

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

డైరెక్టర్: పూరి జగన్నాధ్

ఒకప్పుడు పోకిరి తో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన పూరి జగన్నాధ్.. ప్రస్తుతం ఇజం, రోగ్, పైసా వసూల్ అంటూ వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతూ.. స్టార్ హీరోలెవరు అవకాశాలివ్వక.. తన కొడుకునే హీరోగా పెట్టి మెహబూబా అనే ప్రేమ కథను తెరకెక్కించాడు. టెంపర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టని పూరి ఈసారి కొడుకుని హీరోగా నిలబెట్టడమే కాదు.. తాను డైరెక్టర్ గా నిలదొక్కుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఛార్మి తో కలిసి ఈ సినిమాకి నిర్మాతగా కూడా పూరి జగన్నాద్ వ్యవహరించడం విశేషం. మరి ఆకాష్ పూరి హీరో గా ఇండో -పాక్ నేపథ్యంలో జరిగే యుద్ధంలో ఈ ప్రేమ కథ పుట్టడం.. అలాగే పునర్వజన్మల నేపథ్యంలో ఈ కథ ఉండడం వంటి అంశాలతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమా లో ఆకాష్ పూరి సైనికుడి స్టైల్, అలాగే.. ఆకాష్ డైలాగ్ డెలివరీ. కొత్త అమ్మాయి నేహా శెట్టి అందాలు ఇలా అన్ని విషయాల్లోనూ మెహబూబా అందరిలో అంచనాలు పెంచింది. మరి మెహబూబా సినిమాతో తన తండ్రిని ఆకాష్ పూరి డైరెక్టర్ గా రీ లాంచ్ చేస్తున్నట్లుగా కొన్ని ఇంటర్వూస్ లో చెప్పాడు. మరి ఆకాష్ చెప్పినట్లు పూరి జగన్నాధ్ మళ్ళీ డైరెక్టర్ గా ఈ మెహబూబా తో ప్రూవ్ చేసుకున్నాడా? అలాగే ఆకాష్ పూరి హీరోగా మెహబూబా తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

రోషన్( ఆకాష్ పూరి) కి చిన్నప్పటి నుండి సైనికుడిగా పని చెయ్యాలని కోరిక. అసలు చిన్నప్పటినుండి అంటే విద్యార్థి దశ నుండి చాలా పద్దతిగా... క్రమశిక్షణలో పెరుగుతాడు. తర్వాత సైనికుడిగా బోర్డర్ లో పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ సైనికుడిగా ఉన్న రోషన్, అఫ్రీన్ (నేహా శెట్టి) ని చూసి ఇష్టపడతాడు. అయితే ఆఫ్రీన్ పాకిస్తాన్ లాహోర్ నుండి చదువు కోసం ఇండియా కి వస్తుంది. పాకిస్తాన్ అమ్మాయిని రోషన్ ప్రేమించడం నేరంగా పరిగణిస్తారు. వారి ప్రేమకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు తోడు ఇండో - పాక్ మధ్యన యుద్దవాతావరణం ఏర్పడుతుంది,. ఆ యుద్ధం చేస్తూనే ఆఫ్రీన్ ప్రేమను రోషన్ ఎలా దక్కించుకున్నాడు? మరి ఈ కథలోకి పూర్వ జన్మల వృత్తాంతం ఎలా వచ్చింది? అసలు రోషన్, ఆఫ్రీన్ లు చనిపోయి మళ్ళీ పుడతారా? అనేది మెహబూబా మిగతా కథ.

నటీనటుల నటన:

ఆకాష్ చిన్నప్పటినుండి సినిమాల్లోనే పెరిగాడు. ఎందుకంటే పూరి జగన్నాధ్ డైరెక్టర్ గా ఆకాష్ చిన్నప్పటినుండి పని చేస్తున్నాడు. హీరోగా వెండితెరకు పరిచయం అయిన ఆకాష్ పూరి హీరోగా బాగానే మెప్పించాడు. మంచి డైలాగ్ డెలివరీతో ఆకాష్ ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ లో అస్సలు తడబడలేదు. రోషన్ గా, సైనికుడిగా ఆకాష్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లోను ఆకాష్ పూరి బాగానే పెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కొత్త హీరోయిన్ నేహా శెట్టి కూడా ఆఫ్రీన్ పాత్రలో బాగానే సెట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ లో ఆఫ్రీన్ నటన మెచ్చుకోదగినదానిలా ఉంది. ఆకాష్, నేహా శెట్టిల మధ్య కెమిస్ట్రీ కూడా సెట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ సందీప్ చౌతా మ్యూజిక్. సందీప్ చౌతా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టుగా అదిరిపోయింది. ఎమోషన్ సీన్స్ లోను, యుద్ధ సన్నివేశాల్లో సందీప్ బ్యాగ్రౌండ్ దంచికొట్టాడు. మ్యూజికల్ గా కూడా ఓకె. ఇక విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరో మేజర్ హైలెట్ అని చెప్పాలి. మెజారిటీ వార్ సీన్స్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేసినప్పటికీ విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. ఎడిటింగ్ విషయానికొస్తే.. ఫస్ట్ హాఫ్ లో ఎడిట్ చెయ్యాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎడిటింగ్ మీద మరికాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక పూరి ఓన్ ప్రొడక్షన్ కాబట్టి నిర్మాణ విలువలు వంక పెట్టడానికి లేవు.

విశ్లేషణ:

ఎప్పుడు మాఫియా బ్యాంకాక్ అంటూ రొటీన్ కథలతో విసిగించే పూరి జగన్నాధ్ ఈ సారి ప్రేమ కథను ఎంచుకోవడం పెద్ద రిలీఫ్. రెండు బ్యాక్ డ్రాప్స్ తీసుకున్న పూరి జగనాథ్ కొత్త కాన్సెప్ట్ కాకపోయినా ఇండో పాక్ అనే థ్రెడ్ దీన్ని విభిన్నంగా మార్చే ప్రయత్నం చేసాడు. ఎప్పుడు కనిపించే రెగ్యులర్ సినిమా పంధాలో కాకుండా దాయాది దేశం బ్యాక్ డ్రాప్ ని జోడించడం వల్ల ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే మెహబూబా కి లెంగ్త్ కొంత ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో పూరి ఆకాష్ ఇక్కడి విద్యార్థిగా కనిపిస్తే హీరొయిన్ నేహా శెట్టి పాకిస్తాన్ అమ్మాయిగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ కథ ఊహించని మలుపుతో సెకండ్ హాఫ్ లో వెనుక జన్మకు వెళ్తుంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలను ఎష్టాబ్లిష్ చేయడానికి టైం సరిపోతుంది. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం యుద్దానికి సంబందించిన సీన్స్ ని హైలెట్ చేస్తూ.. చూపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. అలాగే పూరి కామెడీ కి ఈ సినిమా లో చోటివ్వలేదు. ఇక రెండున్నర గంటలు ఒక కొత్త హీరోతో ఎంగేజ్ చేయించడం ఈజీ కాదు. స్క్రీన్ ప్లే పరంగా కూడా కొత్తగా ట్రై చేసాడు పూరి. భారీ తారాగణం లేకుండా హడావిడి చేయకుండా లీడ్ పెయిర్ మీదే దృష్టి పెట్టడంతో నిజమైన ప్రేమ కథ అనే ఫీలింగ్ కలిగింది.

ప్లస్ పాయింట్స్: సందీప్ చౌతా మ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, వార్ సీన్స్

మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, కామెడీ లేకపోవడం, గ్రాఫిక్స్, పాటలు

రేటింగ్: 2.5/5

Similar News