నా నువ్వే మూవీ రివ్యూ

Update: 2018-06-14 09:36 GMT

ప్రొడక్షన్ కంపెనీ: కూల్ బ్రయీజ్ సినిమాస్

నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సురేఖ వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: శరత్

సినిమాటోగ్రఫీ: పీ. సి. శ్రీరామ్

ప్రొడ్యూసర్స్: కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి

దర్శకత్వం: జయేంద్ర

నందమూరి వారసుల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ క్లిక్ అయినట్లుగా మరే హీరో కూడా క్లిక్ కాలేదు. కళ్యాణ్ రామ్, తారకరత్న ఇలా నందమూరి వారసులు హీరోలు గా గట్టెక్కలేకపోతున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ మొదట్లో సురేందర్ రెడ్డి ఇచ్చిన హిట్ కాకుండా మళ్ళీ పదేళ్లకు అనిల్ రావిపూడి ఇచ్చిన పటాస్ హిట్ మాత్రమే ఉన్నాయి. మరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అసలు ఈ రెండు సినిమాలే చెప్పుకునే హిట్స్ అన్నట్టుగా వున్నాయి. అలాగని కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాలు చెయ్యడం మాత్రం మానలేదు. హీరోగా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి మాస్ హీరోగా, ఒకసారి లవర్ బాయ్ లా, ఒకసారి ఫ్యామిలీ హీరోగా ఇలా అన్ని రకాలుగా ప్రయతించినా కళ్యాణ్ రామ్ సక్సెస్ కాలేకపోతున్నాడు. తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయినా తన ప్రయత్నాన్ని వదలకుండా వరసగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎమ్యెల్యే సినిమాలో టాప్ హీరోయిన్ కాజల్ తో కలిసి రొమాంటిక్ గా రెచ్చిపోయినా.. కళ్యాణ్ రామ్ ని విజయం వరించలేదు. ఈసారి ప్లాప్ దర్శకుడు జయేంద్ర తో కలిసి నా నువ్వే అంటూ మళ్ళీ రొమాంటిక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఈసారి కళ్యాణ్ రామ్ తమన్నాని నమ్ముకున్నాడు. మిల్కి బ్యూటీ తమన్నాతో కలిసి అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్ద కూడా గట్టిగా పోటీ లేకుండా ఈ రంజాన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. మరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో అయినా హీరోగా నిలదొక్కుకుంటాడా? తమన్నా అందాలు ఈ సినిమాని ఏ మాత్రం కాపాడాయి? దర్శకుడు జయేంద్ర నా నువ్వే తో ఏదైనా మ్యాజిక్ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

విధిని బలంగా నమ్మే మీరా(తమన్నా) ఒక బుక్ మీద వరుణ్(కళ్యాణ్ రామ్) ఫోటో చూసి తనకి లక్కు కలిసొచ్చింది అని బాగా నమ్ముతుంది. వరుణ్ ఫోటో చూడడం వల్లనే తనకి రేడియో జాకీగా జాబ్ వచ్చిందని మీరా ఆనంద పడుతుంది. కానీ మీరా ఆలోచనలకు విరుద్ధంగా ఆలోచించేవాడు వరుణ్. విధిని అసలు నమ్మనివాడు. అమెరికా వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. వీసా ప్రాబ్లెమ్ వలన అమెరికాకి వెళ్ళడానికి మూడుసార్లు మిస్ అవుతాడు. అయితే వరుణ్ ఫోటో చూసి లక్కు కలిసొచ్చింది అని నమ్మడమే కాదు.. మీరా, వరుణ్ ఫోటోని ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే అనుకోని కొన్ని సంఘటనల తర్వాత వరుణ్, మీరాను కలుస్తాడు. కానీ డెస్టినీ విషయం లో మీరాకి, వరుణ్ కి మధ్య అభిప్రాయభేదం వస్తుంది. దీనితో వరుణ్, మీరాతో ఒక బెట్ కడతాడు. మరీ ఆ బెట్ లో మీరా గెలుస్తుందా? డెష్టిని ని నమ్మని వరుణ్ మీరాకి ఎలా ఎట్రాక్ట్ అవుతాడు? అసలు వరుణ్ అమెరికా వెళ్లగలుగుతాడా? విధిని నమ్మే మీరా కి అస్సలు విధిని నమ్మని వరుణ్ కి ఎలా సెట్ అయ్యింది? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

కళ్యాణ్ రామ్ ఎక్స్ ప్రెషన్స్ లో స్టార్ హీరోలకు పోటీ ఇవ్వగలడు. కానీ కొత్తగా లవర్ బాయ్ లుక్ లో కళ్యాణ్ రామ్ అంతగా నప్పలేదనే చెప్పాలి. ఎప్పుడో చాలాకాలం క్రితం చెయ్యాల్సిన ఈ రోల్ ని కళ్యాణ్ రామ్ ఇప్పుడు చెయ్యడం ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ లుక్స్ లో బాగా ఎజ్డ్ పర్సన్ లా కనబడుతున్నాడు. నటన పరంగా ఒంక పెట్టడానికి లేదు కానీ... లుక్స్ లో మరీ కుర్రాడిగా ట్రై చేసి తేలిపోయాడు. అయితే కళ్యాణ్ రామ్ రఫ్ కేరెక్టర్స్ చేస్తే అతని లుక్స్ కానివ్వండి, ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కానివ్వండి అన్ని మాస్ లుక్స్ కి సరిగ్గా సరిపోతాయి. కానీ ఫ్యామిలీ హీరోగా కానీ, మరి లవర్ బాయ్ లుక్ ని ప్రస్తుతం నప్పే విధంగా కళ్యాణ్ రామ్ లేడు. అయినా కళ్యాణ్ రామ్ పదే పదే అదే తప్పు చేస్తున్నాడు. అంటే సరిగ్గా కళ్యాణ్ రామ్ కథలను వినడం లేదా... లేకుంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వలనో.. అస్సలు విజయాలను అందుకోలేక సతమతమవుతున్నాడు. ఇప్పటికైనా కళ్యాణ్ రామ్ వెనక్కి తిరిగి చూసుకుంటే బెటర్ అనేలా వుంది ఈ సినిమా కూడా. ఇక ఈ సినిమా కి మెయిన్ అండ్ ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ తమన్నా గ్లామర్. తమన్నా ఈ సినిమాని ఒడ్డున పడేసే ప్రయత్నం చేసింది. తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంది. మీరా కేరెక్టర్ కి తమన్నాని తీసుకుని దర్శకుడు మంచి పని చేసాడనిపిస్తుంది. అదే గనక మీరా పాత్రలో మరో హీరోయిన్ ని ఊహించుకుంటే సినిమా ఆ మాత్రం కూడా ఆడేది కాదు. రేడియో జాకీగా తమన్నా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. బుక్ మీద వరుణ్ ఫోటో చూసి తనకి ఆ ఫోటో చూడడం వల్లనే అన్ని కలిసొస్తున్నాయని.. ఆ ఫోటోని వ్యక్తిని ప్రేమించడం ఇలా అన్ని విషయాల్లోనూ తమన్నా బెటర్ పర్ ఫార్మెన్స్ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్‌ లో చాలా బాగా చేసింది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అంతంత మాత్రంగా వుంది. తనికెళ్ళ భరణి, సురేఖ వాణి , పోసాని కృష్ణ మురళి అంతంత మాత్రం గా ఆకట్టుకున్నారనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

శరత్ మ్యూజిక్ నా నువ్వే కి కాస్త ప్రాణం పోసింది. రెండు పాటలు బావున్నాయి. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమా కి మెయిన్ హైలెట్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. అందరిలా ఫారన్ లొకేషన్లకు వెళ్లకుండా ఇండోర్‌లోనే అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా తమన్నాను తెరపై చాలా అందంగా చూపించారు. కాకపోతే సబ్జెక్టు పరిధి తక్కువ కాబట్టి ఆయన నైపుణ్యాన్ని పూర్తిగా వాడుకోలేదు అనిపిస్తుంది. సతీష్ ఎడిటింగ్ గురించి కంప్లైంట్ లేదు. సినిమాను మరీ ఎక్కువగా సాగదీయకుండా రెండు గంటలకే కుదించిన ఎడిటర్‌ను మెచ్చుకోవాలి. సినిమా నిడివి పెరిగి ఉంటె... ప్రేక్షకుడు బాగా బోర్ ఫీల్ అవడమే కాదు... చికాకు పడేవాడు. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

విశ్లేషణ:

దర్శకుడు జయేంద్ర ప్రస్తుతం అవుట్ డేటెడ్ డైరెక్టర్. ఆయన గతంలో సిద్దార్ధ్ తో తీసిన 180 కాస్త పర్వాలేదనిపించినా.. ప్రస్తుతం జయేంద్ర అట్టర్ ప్లాప్ దర్శకుడు. మరి కళ్యాణ్ రామ్ ఆయన కథని నమ్మి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. అది కళ్యాణ్ రామ్ లోపమా.. ?లేదంటే జయేంద్ర అదృష్టమో నా నువ్వే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నా నువ్వే చాలా సింపుల్ సింగిల్ లైన్ స్టోరీ. డెస్టినీ అంటూ హీరోయిన్ తో పదే పదే చెప్పించి దాని పక్క నుంచి కథను ఆసక్తికరంగా మలుపు తిప్పే అవకాశాన్ని ఎక్కడా తీసుకోకపోవడం ఫస్ట్ హాఫ్ లోనే విసిగించడం మొదలుపెడుతుంది. ఈ సినిమాలో చికాకు తెప్పించే అంశం ఏమిటంటే అసలు కథ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకుడు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే మరోపక్క తాను చెబుతున్నది అసలు కథేగా అంటూ దర్శకుడు తనకు తోచింది అనిపించింది తీసుకుంటూ పోయాడు. ఈ రెండింటి మధ్య సింక్ కాలేక నా నువ్వే నలిగిపోయింది. విధి అనే పాయింట్ చుట్టూ హీరో హీరోయిన్ మధ్య ఆసక్తికరమైన డ్రామాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనుకున్న జయేంద్ర పేపర్ మీద రాసుకున్న పాయింట్ ని తెరమీద అంతే అందంగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రధానంగా కావాల్సింది ఎమోషన్. ఎలాంటి హంగులు లేకుండా నెమ్మదిగా సాగే కథనం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ కూడా అంతగా పండలేదు. స్లో నెరేషన్ నా నువ్వేకు పెద్ద మైనస్. అయితే ప్రేక్షకుడు రెండు గంటల పాటు కుర్చీలో కూర్చో గలిగాడు అంటే.... సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తెరపై తమన్నానే చూపించడం వల్లనే. సినిమాలో కళ్యాణ్ రామ్ కన్నా తమన్నా పాత్రకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. కథ మొత్తం వీళ్లిద్దరి పాత్రల చుట్టూనే తిరిగినా మీరా గా తమన్నా ఎమోషన్స్ బాగా చూపించారు. ఇక సున్నితమైన ప్రేమకథను ఎంచుకున్న దర్శకుడు జయేంద్ర కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ : తమన్నా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్, సింపుల్ స్టోరీ, కామెడీ లేకపోవడం, క్లైమాక్స్, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్

రేటింగ్: 2.0/5

Similar News