నీవెవరో మూవీ రివ్యూ

Update: 2018-08-24 07:04 GMT

బ్యానర్: కోన ఫిలిం కార్పొరేషన్, ఎంవీవీ సినిమా

నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్, శివాజీ రాజా, తులసి, శ్రీనివాస్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: అచ్చు రాజమణి, ప్రసన్, గిబ్రాన్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

ప్రొడ్యూసర్: ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్

డైరెక్టర్: హరినాథ్

ఆది పినిశెట్టి తెలుగు, తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు విలన్ అవతారం కూడా ఎత్తుతున్నాడు. సరైనోడులో ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజం అద్భుతం. అలాగే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి కుమార్ బాబు గా సినిమాను టర్న్ తిప్పే పాత్రలో అదరగొట్టాడు. అలాగే గుండెల్లో గోదారి సినిమా తోనూ ఆదికి మంచి పేరొచ్చింది. ఎక్కువగా తమిళ సినిమాల్లో కనబడే ఆది అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. విలన్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా హీరోయిజం అయినా ఆది పినిశెట్టి తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ఒక ఛాలెంజింగ్ అంటే అంధుడి గెటప్ లో చేసిన నీవెవరో సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాప్సి, గురు ఫెమ్ రితిక సింగ్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ని హరినాధ్ అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. రచయిత కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన ఈ నీవెవరో సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పదేళ్ల వయసులోనే కంటి చూపుని కోల్పోయిన కళ్యాణ్ (ఆది పినిశెట్టి )... ఆత్మ విశ్వాసంతో ఎదిగి ఒక రెస్టారెంట్ కి ఓనర్ అవుతాడు. చెఫ్‌గా మారి, రెస్టారెంట్‌ని న‌డుపుతూ బాగా డ‌బ్బు సంపాదిస్తుంటాడు. కళ్యాణ్ కి చిన్ననాటి స్నేహితురాలైన అను(రితికా సింగ్) చేదోడు వాదోడుగా ఉంటుంది. అయితే కళ్యాణ్, అణుల స్నేహం చూసి ఇంట్లోవాళ్లు వారిద్దరికీ పెళ్లి చేయాల‌నుకుంటారు. వారిద్దరికీ పెళ్లి అనుకున్న టైంలో క‌ల్యాణ్‌కి వెన్నెల(తాప్సి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అయితే చిన్నప్పటి నుండి స్నేహితురాలైన అనుకి త‌న‌పై జాలి మాత్ర‌మే ఉంద‌ని....వెన్నెల అయితే త‌న‌ని తానుగానే చూస్తూ ఇష్ట‌ప‌డుతోందని తెలుసుకొని కళ్యాణ్ వెన్నెలని ప్రేమిస్తున్న‌ట్టు చెబుతాడు. కళ్యాణ్ ప్రేమను వెన్నెల కూడా అంగీక‌రిస్తుంది. ఇంత‌లో వెన్నెల అనుకోకుండా ఒక సమస్యలో పడుతుంది. ఆ సమస్య నుండి బయట పడాలంటే వెన్నెలకి 20 ల‌క్ష‌ల‌ అవసరం ఉంటుంది. అయితే ఆ 20 లక్షలను కళ్యాణ్ ఇస్తానని వెన్నెలకి చెబుతాడు. వెన్నెలకి డబ్బు సర్దుబాటు చేసే క్రమంలో కళ్యాణ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయపడి కోమాలోకి వెళ్తాడు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క‌ల్యాణ్‌కి ఓ స‌ర్జ‌రీ త‌ర్వాత కంటిచూపు తిరిగొస్తుంది. మరి కళ్లు వచ్చాక కళ్యాణ్ ని వెన్నెల కలిసిందా..? అసలు వెన్నెలకు ఆ 20 లక్షల డబ్బు ఎవరిచ్చారు..? వెన్నెల సమస్య పరిష్కారం అయ్యిందా..? కళ్యాణ్ తో పెళ్లి అనుకున్న అను పరిస్థితి ఏమిటి..? వంటి అనుమానాలకు క్లారిటీ రావాలంటే నీవెవరో సినిమా చూడాల్సిందే.

నటీనటులు నటన:

రంగస్థలం, సరైనోడు, నిన్ను కోరి లాంటి సినిమాల్లో ఆది పినిశెట్టి మంచి నటన కనబర్చాడు. ఆ సినిమాలన్నిటిలో దేనికవే సంబంధం లేని పాత్రల్లో ఆది పినిశెట్టి మెప్పించాడు. అయితే ఆ సినిమాల్లో ఆది పినిశెట్టి కేవలం సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసాడు. అందులో స్టార్ హీరోల సినిమాల్లో బలమైన సపోర్టింగ్ రోల్స్. అందుకే గుర్తింపు కూడా అదే స్థాయిలో వచ్చింది. అయితే ఇక్కడ నీవెవరో సినిమా విషయానికొచ్చేసరికి హీరోగా ఆది పినిశెట్టి మీద భారం మొత్తం పడడంతో.. సాధ్యమైనంత వరకు తన లోపం లేకుండా చూసుకున్నాడు... బ్లైండ్ క్యారెక్ట‌ర్‌లో ఆక‌ట్టుకుంటాడు. చాలా నేచుర‌ల్‌గా న‌టించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఆది అదరగొట్టాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మెయిన్ కీ రోల్ హీరోయిన్ తాప్సి చేసిన వెన్నెల పాత్ర. నెగెటివ్ షేడ్స్ ఉన్న వెన్నెల పాత్రలో తాప్సి అదరగొట్టింది. ఆమె పాత్ర ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. ఆది, తాప్సిల న‌ట‌నే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అనుగా రితిక సింగ్ కూడా మెప్పించింది కానీ గురులో అంత వోల్టేజ్ ఉన్న క్యారెక్టర్ లో చూసాక ఈమె తనేనా అని డౌట్ వస్తుంది. గ్లామర్ పరంగానూ రితిక మెప్పించింది. సెకండ్ హాఫ్ మొత్తం హీరోతో సమానంగా జర్నీ చేసిన చొక్కగా వెన్నెల కిషోర్ తన టైమింగ్ తో చేసుకుంటూ పోయాడు కానీ అతని ట్రాక్ లో బలమైన కామెడీ లేకపోవడంతో అంత కిక్ అనిపించదు. కానీ సీరియ‌స్‌గా సాగే ఈ త‌ర‌హా సినిమాల‌కి అలాంటి కామెడీ ఎందుకో అర్థం కాదు. ఇక స‌ప్త‌గిరి కామెడీ కూడా అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

నీవెవరో సినిమాని దర్శకుడు హరినాధ్ త‌మిళంలో విజ‌య‌వంత‌మైన అదే కంగ‌ల్‌కి అఫీషియ‌ల్ రీమేక్‌గా తెరకెక్కించాడు. మరి ఒక హిట్ సినిమా రీమేక్ అన్న‌ప్పుడు ఒరిజిన‌ల్ సినిమాలోని త‌ప్పొప్పుల్ని కూడా స‌రిచేసుకొనే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ నీవెవరో విషయంలో అది జరగలేదు. నీవెవరో సినిమాని హరినాధ్ థ్రిల్ కలిగిస్తూ నడిపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఎంతో గొప్పగా వుండే కోన వెంకట్ రచనలో తెరకెక్కిన ఈ సినిమాలో మెరుపులు మెరిపించే డైలాగ్స్ లేకపోయినా.. ఇది ఇంత పేలవంగా రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ని మంచి ఇంటెన్సిటీతో నడపాల్సింది పోయి వెన్నెల కిషోర్ పాత్ర మీద అవసరానికి మించి ఫోకస్ పెట్టడంతో అదంతా ప్రహసనంలా మారింది. మంచి అవకాశాన్ని దర్శకుడు చేతులారా వదులుకున్నాడు. ఇంకాస్త శ్రద్ధతో కనక స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ గా మిగిలేది. క‌ల్యాణ్ పాత్ర చేసే ఓ ఫైట్‌, తాప్సి ఎంట్రీ త‌ర్వాతే క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. స‌ప్త‌గిరి పాత్ర ప‌రిచ‌యం కావ‌డంతో క‌థలో అస‌లు ఇన్వెస్టిగేష‌న్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ తెలిసే కొన్ని నిజాలు కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నాన్నిస్తాయి. ఏది ఏమైనా ట్విస్ట్ లు వచ్చేటప్పటికే ప్రేక్షుకుడికి సినిమా మీదున్న ఇంట్రెస్ట్ తగ్గుతూ పోవడంతోనే సినిమాని పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేని పరిస్థితి. ఈ సినిమాని కరెక్ట్ కంటెంట్ తో కరెక్ట్ గా గనక తెరకెక్కించినట్లయితే సినిమా హిట్ అయ్యుండేది. కానీ ఇప్పుడు యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సాంకేతికవర్గం పనితీరు

ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గిబ్రాన్ నేపధ్య సంగీతతో సినిమాని చాలా వరకు కాపాడాడు. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. కానీ మ్యూజిక్ అంతగా ఎక్కెట్టుగా అనిపించలేదు. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాని ఎంతో కొంత నిలబెట్టింది అనే చెప్పాలి. ఎడిటింగ్ కూడా ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎక్కడిక్కడ అనవసర సన్నివేశాలు చాలా ఉన్నాయే అనే ఫీలింగ్ కలుగుతుంది. కోన, ఎంవీవీ నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కొన్ని ట్విస్ట్ లు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, తాప్సి రోల్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్, థ్రిల్ లేకపోవడం, స్లో నేరేషన్

రేటింగ్: 2.0/5

Similar News