బ్యానర్: SRT ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు, సంపత్, పోసాని కృష్ణ మురళి, అలీ, ప్రియా, సత్య కృష్ణ, బ్రహ్మజీ, సురేఖ వాణి, శివాజీ రాజా తదితరులు
కథ, మాటలు: కళ్యాణ్ కృష్ణ కురసాల
స్క్రీన్ ప్లే: సత్యానంద్
మ్యూజిక్: శక్తి కాంత్ కార్తిక్
సినిమాటోగ్రఫీ: ముకేష్. జి
ఎడిటర్: చోట కే. ప్రసాద్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
ఈ ఏడాది 'రాజా ది గ్రేట్' తో హిట్ అందుకున్న రవితేజ 'టచ్ చేసి చూడు'తో సూపర్ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. గత రెండేళ్లుగా సినిమాలు చేయకుండా భారీ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ ఏడాది మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ తో కలిసి 'నేల టిక్కెట్టు' సినిమా చేసాడు. కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ తెరకెక్కించిన 'సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం' రెండూ మంచి విజయాన్ని సాధించాయి. ఇక రవితేజ కున్న సూపర్ ఎనర్జీతో సినిమాని ఒక మెట్టు ఎక్కించగలిగిన సత్తా ఉన్న హీరో. కాకపోతే 'కిక్ 2' సినిమా దగ్గర నుండి రవితేజ ఫేస్ లో మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. 'కిక్ 2' కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసి మొహంలో కళను పోగొట్టుకున్న రవితేజ గత మూడు చిత్రాల్లోనూ లుక్ పరంగా వీక్ గా కనబడ్డాడు. కానీ ఇప్పుడు మాస్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో మాత్రం రవితేజ ఫేస్ లో మర్పు కనబడుతుంది. రవితేజ మోహంలో కళ కనబడుతుంది. ఇదే విషయం ట్రైలర్ అండ్ ప్రోమోస్ లోనూ స్పష్టమైంది. మరి లుక్స్ పరంగా మెరుగ్గా ఉన్న రవితేజ తన ఎనర్జీతో.. మాస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాడు? ఎప్పుడూ కుటుంబ కథలకు ప్రాధాన్యతనిచ్చే కళ్యాణ్ కృష్ణ మొదటిసారి మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా తెరకెక్కించాడు. మరి మాస్ ప్రేక్షకులను కళ్యాణ్ కృష్ణ తన మ్యాజిక్ తో ఎలా పడగొట్టాడు? ఇక కొత్త పిల్ల మాళవిక అందాలు ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయ్యాయి అనే విషయం సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
అనాధగా పెరిగిన రవితేజ.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటాడు. అయితే వైజాగ్ లో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ అందరికి సహాయపడుతూ ఉండే రవితేజ... హైదరాబాద్ రాగానే ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటాడు. అయితే ఆదిత్య భూపతి (జగపతి బాబు) హోమ్ మినిష్టర్ గా ఉంటూ సీఎం కావాలని ఎన్నో కుట్రలు చేస్తుంటాడు. అవినీతి చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించే క్రమంలో తన సొంత తండ్రినే చంపేస్తాడు. ఆ కుట్రలు బయటపెట్టే తరుణంలో అనేకమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. అయితే అందరికీ సహాయపడే రవితేజ, ఆదిత్య భూపతిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆదిత్య భూపతి చేసే అరాచకాలు రవితేజకి ఎలా తెలుస్తాయి? అంగ బలం, డబ్బు బలం ఉన్నఆదిత్య భూపతిని రవితేజ ఎలా మట్టుబెట్టాడు? విలన్ ఆదిత్య భూపతిపై రవితేజ ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? అసలు హీరోయిన్ మాళవిక పాత్ర ఇందులో ఎంత ఉంది? మాళవిక కి రవితేజకి అసలు పరిచయం ఎలా జరుగుతుంది? ఇన్ని విషయాలు తెలియాలంటే నేలటిక్కెట్ట సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
ఎప్పటిలాగే రవితేజ తన ఎనర్జీ పెరఫార్మెన్స్ తో రెచ్చిపోయాడు. సినిమా మొత్తాన్ని తన ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో మోసేసాడనే చెప్పాలి. కాకపోతే ఏజ్ తోపాటొచ్చే ముడతలు రవితేజ మోహంలో అస్పష్టంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అయితే రవితేజ మార్క్ డైలాగ్ డెలివరీతో అందరిని ఇంప్రెస్స్ చేసేసాడు. రవితేజ ఈ కేరెక్టర్ ని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసేసాడా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో రవితేజ మెరుపులు మెరిపించాడు. లో క్లాస్, మాస్ పాత్రలో రవితేజ ఎప్పటిలాగే దూసుకుపోయాడు. కాకపోతే రవితేజ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పూర్ గా ఉంది. ఇక హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన మాళవిక శర్మ.. పాత్రకి ఈ సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ లేకపోయినా.. ఉన్నంతలో బాగానే మెప్పించింది. అలాగే పాటల్లో మాత్రం తన అందచందాలతో, గ్లామర్ షోతో ప్రేక్షకులను కట్టిపడే ప్రయత్నమైతే చేసింది. అయితే ఆమె అందాలు ప్లస్ అయినా.. రవితేజ పక్కన మాళవిక మరి చిన్న పిల్ల మాదిరి కనబడింది. ఇక మొదటిసారి రవితేజ - జగపతి బాబుల కాంబినేషన్ మాత్రం బాగా సెట్ అయ్యింది. జగపతి బాబు ఎప్పటిలాగే తనదైన విలన్ స్టయిల్లో తన పాత్రని అలవోకగా నటించి మెప్పించాడు. శరత్ బాబు, పోసాని కృష్ణ మూర్తిలు, బ్రహ్మజీ, ప్రియా, సురేఖావాణి, అలీ ఇలా అందరూ తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
కళ్యాణ్ కృష్ణ దర్శత్వం వహించిన రెండు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం రెండు సినిమా ల్లోను కామెడీకి, కుటుంబానికి పెద్ద పీట వేసిన కళ్యాణ్ కృష్ణ తన మొదటి రెండు సినిమాలకు భిన్నంగా కమర్షియల్ మసాలా ను కలగలిపిన నేలటిక్కెట్టు సినిమాని ఎంచుకున్నాడు. ఇది అవుట్ అండ్ అవుట్ రవితేజ మార్క్ సినిమా. అసలు క్లుప్తంగా చెప్పాలంటే... చుట్టూ జనం ఉండాలి అని కోరుకునే ఒక అనాధకు నిలువెల్లా స్వార్థం నిండిన ఓక మినిస్టర్ కు మధ్య జరిగే యుద్ధమే ఈ నేల టిక్కెట్టు. ఇక సినిమాలో సెంటిమెంట్ ని, ఎమోషన్ ని కామెడీ తో బాలన్స్ చేసే ప్రయత్నం చేసిన కళ్యాణ కృష్ణ పూర్తిగా కాదు కానీ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించాడు. ఈ సినిమాలో ఆకట్టుకునే డైలాగ్స్ ఉన్నాయంటే.... ఫస్ట్ టైం లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఓ కొత్త రిలేషన్ కనిపిస్తుందిరా.., ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడ్రా.. కాని సాయం చేసేవాడు ఒక్కడు లేడు. ముసలితనం అంటే చేతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం....లాంటి డైలాగ్స్ మాత్రం బావున్నాయి. అయితే కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు కథ వీక్ గా వుంది అనుకోలేదేమో.. అందుకే కామెడీని నెగ్లెట్ చేసాడు. కథ వీక్ గా వున్నప్పుడు కామెడీ డోస్ పెంచాలి... లేదంటే రెండు మూడు బలమైన ఎమోషనల్ సీన్స్ ని పెట్టాలి. ఇక పెట్టిన కామెడీ కూడా సినిమాలో అక్కడక్కడా కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది. అలాగే మాళవిక శర్మ - రవితేజ ల రొమాంటిక్ సీన్స్ కూడా తేలిపోవడం సినిమా కి మెయిన్ మైనస్. పాటలు కూడా అంతే.. అర్ధం పర్ధం లేకుండా కథలో అక్కడక్కడా.. స్పీడు బ్రేకర్స్ మాదిరి ఇరికించేశారు. కళ్యాణ్ కృష్ణ సినిమా క్లైమాక్స్ ని కూడా పరమ రొటీన్ గా దించేసాడు. మరి నాగ్ కి, కొడుకు నాగ చైతన్య కి మాంచి హిట్స్ అందించిన కళ్యాణ్ కృష్ణ రవితేజ కి మాత్రం ప్లాప్ అందించాడని చెప్పాలి.
సాంకేతిక వర్గం పనితీరు:
శక్తి కాంత్ కార్తిక్ మ్యూజిక్ నేల టికెట్ లో ఎలాంటి మ్యాజిక్ చెయ్యలేదు. పాటలు వినడానికి పర్వాలేదనిపించినా... చూడడానికి మాత్రం బోర్ కొట్టించేస్తాయి. విజువల్ గా పాటలు అసలు ఆకట్టుకోలేదు. ఫిదా సినిమాకి మంచి లవ్ అండ్ ఎమోషనల్ మ్యూజిక్ ఇచ్చిన శక్తి కాంత్ కార్తిక్... నేల టికెట్ సినిమాకి మాస్ మ్యూజిక్ ఇవ్వలేక తత్తర పడ్డాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లోను శక్తి కాంత్ కార్తిక్ పనితనం ఎక్కడా అబ్బో అనిపించేలా లేదు. ఇక నేల టికెట్ కున్న ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే.. అది సినెమాటోగ్రఫీనే. ముకేష్ కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ ని చాలా కలర్ ఫుల్ గానే కాకుండా గ్రాండ్ గా ప్రెజెంట్ చెయ్యడంలో ముకేష్ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ లో ఎడిట్ చెయ్యాల్సిన సీన్స్ బోలెడన్ని ఉన్నాయి. అసలు ఎడిటింగ్ చూస్తుంటే... దర్శకనిర్మాతలు ఎడిటింగ్ మీద శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా రిచ్ గానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: రవితేజ, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ చేంజ్, స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్: కథ, కథన, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, కామెడీ లేకపోవడం
రేటింగ్: 2.25/5