నోటా మూవీ రివ్యూ

Update: 2018-10-05 08:39 GMT

బ్యానర్: స్టూడియో గ్రీన్

నటీనటులు: విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్, నాజర్, సత్య రాజ్, యాషిక ఆనంద్, సంచనా నటరాజన్, ప్రియదర్శి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: శ్యామ్. సి.ఎస్

సినిమాటోగ్రఫీ: సంతాన కృష్ణన్ రవిచంద్రన్

ఎడిటింగ్: రేమండ్ డెర్రిక్ క్రాస్టా

నిర్మాత: జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం: ఆనంద్ శంకర్

చాలా తక్కువ సినిమాలతోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. విజయ్ ని అమాంతం స్టార్ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. అర్జున్ రెడ్డి లో మెచ్యూర్డ్ నటనతో ఇరగదీసాడు. ఆ దెబ్బకు యూత్ మొత్తం విజయ్ ముందు నిలబడ్డారు. ఇక తర్వాత మళ్ళీ విజయ్ ని అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది మాత్రం తాజాగా గీత ఆర్ట్స్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విజయ్ దేవరకొండకి పడిపోయారు. 'గీత గోవిందం' సినిమా షూటింగ్ అవుతున్నప్పుడే.. విజయ్ దేవరకొండ తమిళ డెబ్యూలో నటించడానికి సిద్దమయ్యాడు. 'నోటా' అనే పొలిటికల్ బ్యాగ్డ్రాప్ ఉన్న సినిమాలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో.. తమిళనాట పెద్ద బ్యానర్ అయిన స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మాతగా నోటా సినిమా చేసాడు. ఇప్పటివరకు అల్లరి చిల్లరి కుర్రాడిలా, ప్రేమికుడిలా, ఫ్యామిలీ మ్యాన్ లా కనబడిన విజయ్ దేవరకొండ ఎందటిసారిగా పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడు 'నోటా' సినిమాలో. మరి పొలిటికల్ లీడర్ గ మొదటిసారి డిఫ్రెంట్ రోల్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ 'నోటా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటిస్తున్న 'నోటా' సినిమా తెలుగు, తమిళంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలవుతుంది. కేవలం పది రోజుల ముందే 'నోటా' విడుదల తేదీతో వచ్చిన విజయ్ దేవరకొండ ఈ పది రోజుల్లోనే 'నోటా' సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. తెలుగు, తమిళంలో తనదైన శైలిలో 'నోటా' పబ్లిక్ మీట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ తో హోరెత్తించి సినిమా మీద అంచనాలు, ఆసక్తిని పెంచేసాడు. ఈ సినిమా విడుదలపై కొందరు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం... ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్లు కూడా చేశారు. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'నోటా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విభిన్నకథలో మొదటిసారి ప్రయత్నించిన విజయ్ దేవరకొండ తన విజయ పరంపర కొనసాగించాడా..? 'నోటా' సినిమాతో కూడా హిట్ అందుకున్నాడా..? హీరోయిన్ మెహ్రీన్ కి ఈ సినిమా ఎంతవరకు కలిసొచ్చింది..? 'నోటా' తెలుగు, తమిళంలో ఎలాంటి హిట్ సొంతం చేసుకుందో... సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సీఎం పెద్ద కొడుకుగా జీవితాన్ని ఎంజాయ్ చేసే వరుణ్ (విజయ్ దేవరకొండ)ని తన తండ్రి ముఖ్యమంత్రి వాసుదేవన్(నాజర్) అసలు రాజకీయాలంటే ఏమిటో తెలియని కొడుక్కి అప్పటికప్పుడు అంటే రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిని చేస్తాడు. ఒక కేసులో వివాదాలు చుట్టుముట్టడంతో.. వాసుదేవన్ తన కొడుకు వరుణ్ ని ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిస్తాడు. కోర్టు తీర్పు ఎలాగూ తనకే అనుకూలంగా వస్తుందని, రెండు వారాలు కొడుకును సీఎంగా ఉంచి ఆ తరవాత ఆ పీఠంపైకి మళ్లీ తాను ఎక్కొచ్చని వాసుదేవ్ భావిస్తాడు. అయితే వాసుదేవ్ అనుకున్నట్టు జరగదు. ఈ కేసులో వాసుదేవ్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తుంది. కోర్టులో పడిన శిక్షతో వాసుదేవన్ జైలుకెళ్ళడంతో.. వరుణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అంటిపెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఎప్పుడూ ఎంజాయ్మెంట్ అంటూ తిరిగే వరుణ్ కి ఒక్కసారిగా అర్ధం కానీ రాజకీయాల్లోకొస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ముఖ్యమంత్రిగా మారిన వరుణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? బెయిల్ మీదొచ్చినా వాసుదేవ్ పై బాంబు దడి చేసిందెవరు? ముఖ్యమంత్రిగా ఉన్న వరుణ్ కి తండ్రి వాసుదేవ్ గురించి తెలిసిన విషయాలేమిటి? వరుణ్ యువ ముఖ్యమంత్రిగా అసలు ఏమి చేసాడు? మరి ఇన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే నోటా సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన:

ఈ సినిమాలో రౌడీ సీఎం గా విజయ్ దేవరకొండ కంప్లీట్ గా కొత్త తరహా పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందంలతో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ దానికి తగ్గ పాత్రే అయినప్పటికీ అవి ఇచ్చినంత స్కోప్ నటనపరంగా నోటాలో వరుణ్ పాత్ర ఇవ్వలేదనే చెప్పాలి. అర్జున్ రెడ్డి పాత్రలో స్టూడెంట్ లుక్ లో, పాత్రలో, డాక్టర్ గా, లవ్ ఫెయిల్ అయినప్పుడు బాధపడే కుర్రాడిగా మెచ్యూర్డ్ నటనతో ఇరగదీసాడు. ఇక గీత గోవిందంలో మంచి లక్షణాలున్న అబ్బాయిగా అదరగొట్టాడు. అలాగే గీత గోవిందంలో విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ కూడా అదుర్స్. కానీ నోటాలో వరుణ్ పాత్రలో ఎక్కువ సీరియస్ నెస్ ఉండడంతో.. వరుణ్ పాత్రలో విజయ్ సూటయినా.. ఆయన అభిమానులకు మాత్రం అంతగా ఈ పాత్ర ఎక్కేలా లేదు. అయితే సినిమా మొత్తం తన ప్రెజెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం అయితే విజయ్ గట్టిగా చేసాడు. ఇక ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాగ్డ్రాప్ కాబట్టి... హీరోయిన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. ప్రాధాన్యత లేని జర్నలిస్ట్ పాత్ర మెహ్రీన్ ది. ఈ సినిమాలో విజయ్ సరసన చేసిన మెహ్రీన్ కౌర్ చేసింది పెద్దగా ఏమి లేదు. అసలు విజయ్ తో ఎలాంటి రొమాంటిక్ సీన్స్ లో మెహ్రీన్ ఉండదు. అలాగే విజయ్ దేవరకొండ, మెహ్రీన్ లు స్రీన్ మీద కలిసి కనిపించింది ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రమే. అసలు ఇలాంటి సినిమా మెహ్రీన్ ఎలా ఒప్పుకుంది అనిపిస్తుంది. సీఎంగా, కేసులు ఎదుర్కునే రాజకీయ నాయకుడిగా.. నాజర్ నటన అద్భుతమని చెప్పాలి, ఇక జర్నలిస్ట్ గా, ప్రతిపక్ష నాయకుడి పాత్రలో సత్య రాజ్... కుర్ర సీఎం విజయ్ వెన్నంటి ఉండే పాత్రలో బాగా సెట్ అయ్యాడు. ప్రియదర్శి.. హీరో ఫ్రెండ్ గా హీరోకి హెల్ప్ చేసే సపోర్టింగ్ రోల్ లో బాగా నటించాడు. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ:

దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఈ సినిమా మొత్తం పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామా. ప్రేమకు, ప్రేమగీతాలకు ఈ సినిమాలో స్థానం లేదు. ఉన్నవి రెండే పాటలు. అవి కూడా ఫస్టాఫ్‌లోనే అయిపోతాయి. సెకండాఫ్ మొత్తం పొలిటికల్ థ్రిల్లరే. అయితే సినిమాకు మైనస్ కూడా సెకండాఫే. ఫస్టాఫ్‌ను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ శంకర్.. సెకండాఫ్‌ను బాగా సాగదీశాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా ప్రెస్ మీట్ సీన్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ ప్రెస్‌ మీట్‌లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సూపర్. అసలు ఈ ప్రెస్ మీట్‌తోనే రౌడీ సీఎం అనే ముద్ర యంగ్ సీఎం అయిన విజయ్ మీద పడుతుంది. ఇంటర్వల్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. తరవాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది. అయితే ఇంటర్వల్ తర్వాత అందరికీ తెలిసిన కథనే దర్శకుడు చూపించాడు. రాజకీయ ఎత్తులు, పదవిని కాపాడుకోవడానికి సీఎంలు చేసే ప్రయత్నాలు ఇలా అన్నీ ఊహించినవే. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్లను రిసార్ట్‌ లకు పంపడం, డబ్బు ఆశచూపడం ఇప్పటికే బయట చాలా సినిమాల్తో పాటుగా.. నిజంజీవితంలోను చూశాం. అవే సన్నివేశాలను మళ్లీ తెరపై చూపించారు. ముఖ్యంగా తమిళనాడులో జరిగే పొలిటికల్ డ్రామాను దర్శకుడు ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా సెకండాఫ్‌లో వచ్చే మహేందర్ (సత్యరాజ్) లవ్ స్టోరీ కాస్త బోర్ కొట్టిస్తుంది. కానీ ఆ స్టోరీతో కథకు పెద్ద లింకే ఉంటుంది. ఇప్పుడున్న యువత రాజకీయాల గురించి అవగాహన తెచ్చుకోవాలని వారికి చేరే విధంగా దర్శకుడు ఆనంద్ శంకర్ కథను మలుచుకున్నా... సినిమాని తీర్చిదిద్దిన తీరు కొన్ని కొన్ని సన్నివేశాల వలన సినిమా పూర్తిగా దారి తప్పింది. మొదటి సగం సాగినంత ఉత్కంఠభరితంగా రెండో సగం సాగకపోవడంతో ఈ చిత్రానికి పెద్ద స్థాయిలో దెబ్బ తగిలిందనే చెప్పాలి. మరి అర్జున్ రెడ్డి, గీత గోవిందం తో సూపర్ హిట్స్ కొట్టిన విజయ్ కి నోటా దెబ్బేసిందనే చెప్పాలి.

సాంకేతిక వర్గం:

శ్యామ్. సి.ఎస్ అందించిన పాటలు నోటా కి మైనస్ గానే నిలిచాయి. అస్సలు ఆకట్టుకొని పాటలు.. సినిమా పూర్తయ్యేసరికి గుర్తు కూడా ఉండేవి. పాటల విషయంలో ఆకట్టుకోలేని శ్యామ్ నేపధ్య సంగీతంతో మాత్రం ఇరగదీసాడు. శ్యాం అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ గా మారింది. ఇక యస్.కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా మంచి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. జ్ఞానవేల్ రాజా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.

ప్లస్ పాయింట్స్ : కథనం, విజయ్ నటన, కొన్ని పొలిటికల్ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: కథ, తమిళ నేటివిటీ, సెకండ్ హాఫ్, మ్యూజిక్, మెహ్రీన్ పాత్ర, లాజిక్స్ మిస్ కావడం

రేటింగ్: 2.25/5

Similar News