జాను మూవీ రివ్యూ

జాను మూవీ రివ్యూ బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, శరణ్య ప్రదీప్, రఘుబాబు, సాయి కిరణ్ కుమార్, [more]

Update: 2020-02-07 08:55 GMT

జాను మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, శరణ్య ప్రదీప్, రఘుబాబు, సాయి కిరణ్ కుమార్, గౌరీ జి కిషన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మహేందిరం జయరాజు
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సి. ప్రేమ్ కుమార్

దిల్ రాజు బ్యానర్ నుండి ఓ ఆసక్తికర అందులోను తమిళనాట అదిరిపోయే క్లాసిక్ బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా తెరకెక్కిన జాను సినిమా వస్తుంది అంటే.. ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి ఉంటుంది. దిల్ రాజు సినిమా కథలను ఎనాలసిస్ చేసే విధానం నచ్చి యంగ్ హీరోలు ఆయనతో సినిమాలు చెయ్యడానికి వెంటపడుతుంటే.. దిల్ రాజు మాత్రం రీమేక్ లను నమ్ముకుని హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అందుకే తమిళంలో 96 సినిమా ప్రివ్యూ చూసినప్పటినుండి.. తెలుగులో దాన్ని రీమేక్ చేసే వరకు నిద్ర పోలేదు. విజయ్ సేతుపతి – త్రిష హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన 96 సినిమాని దర్శకుడు ప్రేమ్ కుమార్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడు. ఆ సినిమా యూత్ నే కాదు.. సాధార ప్రేక్షకుడిని ఓ ఊపు ఊపేసింది. అలాంటి సినిమా తెలుగులో జానూ సినిమాగా దిల్ రాజు రీమేక్ చెయ్యడం, త్రిష కేరెక్టర్ లో సమంత ని ఒప్పించడానికి దిల్ రాజు పడిన కష్టాలు, సమంత సినిమా చెయ్యడానికి ఒప్పుకోగానే..సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అవడంతో.. జాను సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. జానూ టీజర్, ట్రైలర్ లోను సమంత నటన, శర్వానంద్ లుక్స్ అన్నిటికి ప్రేక్షకులు కనెక్ట్ అయినట్లుగానే కనబడింది. మరి ఎంతో నమ్మకంగా హిట్ కొడతానని చెబుతున్న దిల్ రాజు నమ్మకాన్ని జానూ ఎంతవరకు నిలబెట్టింది? రెండు ప్లాప్స్ తో ఉన్న శర్వాకి జానూ హిట్ ఇచ్చిందా? వరస విజయాలతో దూసుకుపోతున్న సమంత జానూ తో మరోసారి సూపర్ హిట్ కొట్టిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
కె. రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. అడవుల్లో, సముద్రాల్లో ఉన్న జంతువులను ఫొటోస్ తీస్తుండే రామ్ ఓసారి తాను చదివిన స్కూల్ మీదుగా వెళుతున్నప్పుడు.. ఆ స్కూల్ లో ఆగి.. అక్కడ తాను చదువుకున్న పాత రోజులను గుర్తు చేసుకుంటాడు. తాను 9 వతరగతి చదువుతున్నప్పుడు జానకి దేవి అలియాస్ జానూ( గౌరీ జి కిషన్) ని చూసి కళ్ళతోనే ప్రేమించడం, ఆ అమ్మాయితో పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న సమయంలో.. రామ్ కి జానకి కపించకుండా పోతుంది.. అలా చిన్ననాటి స్మృతులతో కాస్త ఫీల్ అవుతున్న రామ్ కి తన పాత ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టు గెదర్ ఏర్పాటు చెయ్యడంతో… రామ్ తో ఫ్రెండ్స్ అలాగే జానూ (సమంత) కూడా ఆ గెట్ టు గెదర్ కి హాజరవుతుంది. అక్కడ రామ్ ని చూసిన జానూ ఎమోషన్ అవుతుంది. అసలు రామ్ – జానూ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళ 9th క్లాస్ ప్రేమ ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది? ఇప్పటికి జానూ.. రామ్ ని ప్రేమిస్తుందా? రామ్ కూడా జానూ ని ప్రేమిస్తున్నాడా? గెట్ టు గెదర్ తర్వాత ఏం జరిగింది? అనేది జాను మిగతా కథ.

నటీనటుల నటన:
జానూ పాత్రకి సమంత ప్రాణం పోసింది. ఈమధ్యన గ్లామర్ గా అదరగొడుతున్న సమంత.. జానూ సినిమాలో చాలా సింపుల్ గా చుడీదార్స్ లోనే కనిపించింది. సింపుల్ లుక్ లోను సమంత అదరగొట్టింది. కళ్ళతోనే ప్రేమను పలికించడం, ఎమోషనల్ గా కట్టిపడెయ్యడంలో సమంత కి 100 మార్కులు వెయ్యాల్సిందే. నటనలో సమంత కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించింది. సమంత గా చిన్న జానూ గా చేసిన గౌరీ జి కిషన్ కూడా నటనతో అదరగొట్టేసింది. ఇక రామచంద్ర అలియాస్ రామ్ పాత్రలో శర్వా వదిగిపోయాడు. చాలా సింపుల్ గా రామ్ పాత్రలో శర్వా నటన ఆకట్టుకుంది. సమంత – శర్వా కెమిస్ట్రీ అదిరింది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. చిన్న శర్వా గా సాయి కిరణ్ కుమార్ నటనతో మెప్పించాడు. వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్ లు కామెడీగా ఆకట్టుకోగా..వర్ష బొల్లమ్మ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇక మిగతావారు పరిధిమేర నటించి మెప్పించారు.

విశ్లేషణ:
తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన 96 గురించి ఎంతగా మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ప్రేక్షకులను అంతలా ఆకట్టుకునేలా దర్శకుడు ప్రేమ్ కుమార్ 96 తో మ్యాజిక్ చేసాడు. మరి మాతృక డైరెక్టర్ తెలుగులోనూ రీమేక్ చేస్తే.. ఆ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో… జానూ సినిమా చూస్తే తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజుకి 96 లో అంతగా ఏం నచ్చిందో.. చూద్దామని తెలుగు ప్రేక్షకుడు జానూ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. దర్శకుడు ప్రేమ్ కుమార్ స్కూల్ లవ్ అందరికీ ప్రత్యేకమే అంటూ అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు. స్కూల్ డేస్ లో ప్రేమించుకున్న ప్రేమికులు వారు సడన్ గా విడిపోయి… మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో ఈ సినిమా సాగుతుంది. ఇదే కథతో చాలా సినిమాలే వచ్చాయి. స్కూల్ డేస్ గుర్తుచేస్తూ దర్శకుడు చేసిన స్క్రీన్ ప్లే మ్యూజిక్ బాగానే వర్కవుట్ అయినట్టు అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రియూనియన్ పార్టీ.. సమంత ఎంట్రీ.. స్కూల్ బ్యాక్ డ్రాప్ తో పర్లేదు అనిపిస్తుంది.. సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.. శర్వానంద్, సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది. వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకుంటుంది .అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ చాలా చక్కగా వచ్చాయి. అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా…. అది అలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నా కూడా.. స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్.. ఇలాంటి కథలు ఇలాగే ఉంటాయి అని సరిపెట్టుకోవాలేమో. దానివలన ప్రేక్షకుడు అక్కడక్కడా కాస్త బోర్ ఫీల్ అవుతాడు. ఇక ఓవరాల్ గా తమిళంలో 96 చూడని వాళ్లకు జాను పర్లేదు అనిపిస్తుంది. ఎమోషనల్ కథలకు కనెక్ట్ అయ్యే వాళ్లకు జాను మంచి ఛాయిస్.

సాంకేతికంగా..
సినిమాకి మ్యూజిక్ ప్రాణం పోసింది. గోవింద్ వసంత మ్యూజిక్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. రొమాంటిక్ సన్నివేశాల్లోను, స్కూల్ నేపథ్యంలోనూ, ఎమోషనల్ సీన్స్ లోను నేపధ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక సినిమాకి మహేందిరం జయరాజు సినిమాటోగ్రఫీ పెద్ద ప్లస్ పాయింట్. స్కూల్ వాతావరణం.. అని చక్కగా చూపించాడు. ఇక ఎడిటింగ్ విషయానొకేస్తే.. అక్కడక్కడా కొన్ని సీన్స్ కత్తెర వేస్తె బావుండు అనిపిస్తుంది.. కానీ సినిమా పరంగా అవి ఖచ్చితంగా ఉండాల్సినవి సీన్స్. నిర్మాణ విలువలు కథానుసారం ఆకట్టుకున్నాయి.

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News