శ్రీనివాస కళ్యాణం మూవీ రివ్యూ

Update: 2018-08-09 08:56 GMT

నటీనటులు: నితిన్, రాశి ఖన్నా, నందిత శ్వేతా, ప్రకాష్ రాజ్, జయసుధ, అన్నపూర్ణ, రజిత, రాజేంద్ర ప్రసాద్,అజయ్, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ.జె.మేయర్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటింగ్:మధు

ప్రొడ్యూసర్: దిల్ రాజు

డైరెక్టర్: సతీష్ వేగేశ్న

దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా కుటుంబ కథా చిత్రం శతమానం భవతిని డైరెక్ట్ చేసిన సతీష్ వేగేశ్న. మొదటి చిత్రంతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. మరి దిల్ రాజు అలాంటి దర్శకుడిని ఊరికే వదిలెయ్యడు. అందుకే ఈసారి... లై, ఛల్ మోహన రంగ చిత్రాల ఫ్లాప్ లో ఉన్న నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో మళ్ళీ ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం శ్రీనివాస కళ్యాణం సినిమాని నిర్మించాడు. నితిన్ - రాశీ ఖన్నా జోడిగా ఈ సినిమా పెళ్లికి ఉన్న విలువలు, సంప్రదాయాలను తెలియజేస్తూ... భారీ తారాగణంతో తెరకెక్కించారు. మరి భారీ అంచనాల నడుమ శ్రీనివాస కళ్యాణం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస కళ్యాణం అనే ఒక చక్కని ఇంట్రెస్టింగ్ టైటిల్ మాత్రమే కాకుండా ట్రైలర్, ప్రమోషన్స్, సాంగ్స్ తో ఈ సినిమా మీద భారీ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఎంతో హైప్ మధ్య.. వెరైటీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

శ్రీనివాస్ (నితిన్‌). ఉద్యోగరీత్యా తల్లితండ్రులకు దూరంగా చండీగఢ్‌లో ఉంటాడు. శ్రీనివాస్ ది చాలా పెద్ద కుటుంబం. శ్రీనివాస్ ఫ్యామిలి మొత్తం సఖినేటిపల్లిలో ఉంటారు. చిన్నతనంలోనే పెళ్ళి గురించి శ్రీనివాస్ బామ్మ(జయసుధ) చెప్పిన మాటలు వాసు మనసులో బలంగా నాటుకున్నాయి. అయితే చండీగఢ్‌లోనే ఉంటున్న హైదరాబాద్‌ అమ్మాయి శ్రీదేవి(రాశీ ఖన్నా) కాఫీ షాప్ లో పని చేస్తుంటుంది. శ్రీనివాస్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు శ్రీదేవి శ్రీనివాస్ కి పరిచయం వుంటుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలంటే గౌరవం ఉన్న శ్రీనివాస్ తమ పెళ్ళి విషయాన్ని డబ్బంటే పడిచచ్చే శ్రీదేవి తండ్రి(ప్రకాష్‌రాజ్‌)తో చెప్తాడు. ఇక శ్రీనివాస్ కూడా తన ప్రేమ విషయం తన తల్లిదండ్రులతో (రాజేంద్రప్రసాద్) చెప్తాడు. ఇరు కుటుంబాల వారు శ్రీనివాస్, శ్రీదేవి పెళ్లిని ఒక వేడుకలా చేయాలనుకుంటారు. అయితే శ్రీనివాస్ కుటుంబం పెళ్లిలో గ్రాండ్ గా అందరి బంధువులను పిలిచి ఒక వేడుకలా చెయ్యాలనుకుంటే.. శ్రీదేవి తండ్రి మాత్రం ఆ పెళ్లిని ఒక ఈవెంట్ లా భావిస్తాడు. అసలు డబ్బంటే పడి చచ్చిపోయే... శ్రీదేవి తండ్రి శ్రీనివాస్ తో తన కూతురు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు? శ్రీదేవి తండ్రికి శ్రీనివాస్ కి పెళ్లి విషయంలో జరిగిన అగ్రిమెంట్ ఏమిటి? అసలీ శ్రీనివాస్, శ్రీదేవి పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందా? ఇవన్నీ తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం తెర మీద వీక్షించాల్సిందే.

నటీనటులు నటన:

శ్రీనివాస్ గా నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగానే ఉంది. అయితే గతంలో నితిన్‌ చేసిన చాలా సినిమాల్లోని క్యారెక్టర్‌లాగే ఈ సినిమాలోనూ అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆ మధ్య వచ్చిన అ...ఆ సినిమా గుర్తొస్తుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కి స్కోప్‌ లేకపోవడం వల్ల సినిమాలో డాన్సులకు గానీ, ఫైట్స్‌ కి గానీ ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నితిన్‌ డైలాగ్స్‌ కి, అతని లిప్‌ మూమెంట్స్‌ కి ఎక్కడా మ్యాచ్‌ అవ్వదు. అలాగే క్లోజప్ షాట్స్ లో నితిన్ కాస్త ఏజ్డ్ గా కనిపించాడు. శ్రీదేవిగా నటించిన రాశీ ఖన్నా క్యూట్‌గా చాలా బాగుంది. అయితే ఆమె క్యారెక్టర్‌ కేవలం పెళ్ళికూతురు వరకే పరిమితమైంది తప్ప ఆమెకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. పైగా ఆమె ప్రతి డైలాగ్‌ చాలా లోవాయిస్‌లో రహస్యం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడుగా ప్రకాష్‌రాజ్‌ తనకు కొట్టిన పిండైన క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. వాసు మరదలు పద్మావతిగా హీరోయిన్ నందిత శ్వేతగా నటన బాగుంది. ఇక మిగతా క్యారెక్టర్స్‌ లో రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, జయసుధ, ఆమని, సితార తదితరులు ఫ్యామిలీ మెంబర్స్‌ గా ఫర్వాలేదు అనిపించారు. ఇక సినిమాలో అక్కడక్కడ కామెడీ చేసేందుకు హీరో ఫ్రెండ్స్‌ గా సత్యం రాజేష్‌, ప్రవీణ్‌, విద్యులేఖా రామన్‌ ప్రయత్నించారు.

విశ్లేషణ:

దర్శకుడు సతీష్ వేగేశ్న కు కుటుంబ కథ చిత్రాలు దర్శకుడిగా ఒకే ఒక్క సినిమాతో మంచి పేరొచ్చింది. శతమానంభవతి సినిమా లో కుటుంబ విలువలు, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధ బాంధవ్యాలను ఎంతో చక్కగా చూపించిన సతీష్ వేగేశ్న.. తన తదుపరి చిత్రాన్ని కూడా కుటుంబ కథా చిత్రంగా మలిచాడు. యంగ్ హీరో నితిన్ - క్యూట్ లుక్స్ రాశి ఖన్నా జంటగా శ్రీనివాస కళ్యాణం అనే చక్కటి టైటిల్ తో భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కించాడు. పెళ్లిపై యువతకు ఉన్న అభిప్రాయాలూ, పెద్దల మాటకు కట్టుబడి జంటగా జీవించాలనుకునే యూత్ కి పెళ్లి విలువలు.. పెళ్లిలో ఔన్నత్యాన్ని తెలియజెప్పే విధంగా శ్రీనివాస కళ్యాణం కథను రాసుకున్నాడు సతీష్ వేగేశ్న. కథ పాతదే.. అయినప్పటికీ.. ఇందులో ఇద్ద‌రు మ‌నుషుల‌ను, రెండు కుటుంబాల‌ను ఒక్క‌టి చేసే పెళ్లి గురించి ఏదో చెప్పాల‌ని చెప్పేయ‌కుండా.. ఎలా జ‌రిపిస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలి.. పెళ్లికొడుకు కుటుంబ స‌భ్యులు ఏం చేస్తారు.... ఇలా అన్ని విష‌యాల‌ను చ‌క్క‌గా వివ‌రించే ప్రయత్నం చేసాడు. సంప్రదాయబద్ధంగా పెళ్లి ఎలా చెయ్యాలి అనే ఒక్క లైన్‌తో కథ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడి కూతురు, లక్షాధికారి కొడుకు పెళ్లి చెయ్యాలంటే సహజంగానే రిచ్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సినిమాలో రిచ్‌ మ్యారేజ్‌ ఎలా చెయ్యాలనేది చూపించాడు. పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేని హీరోయిన్‌ తండ్రిని మార్చడమే హీరో ధ్యేయంగా కనిపించింది తప్ప గుండెలు బరువెక్కే విషయం ఏముంది అనిపిస్తుంది. కథలో బలమైన ఎలిమెంట్‌ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలగదు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా ఫ్యామిలీ వాతావరణంలో జరిగే కొన్ని సీన్స్‌, హీరో ఫ్రెండ్స్‌ తో కొన్ని సీన్స్‌, హీరో, హీరోయిన్‌ మధ్య కొన్ని సీన్స్‌ తో కాలక్షేపం చేసిన తర్వాత సెకండాఫ్‌లో పెళ్ళి పనులతో అసలు కథ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్‌ లో నితిన్‌ చెప్పిన పెళ్ళి మంత్రాలు, వాటి అర్థాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాష్‌రాజ్‌ రియలైజ్‌ అవుతూ చెప్పే డైలాగ్స్‌ మరింత నీరసం తెప్పిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సంప్రదాయబద్దమైన వివాహం గురించి అందరికీ చెప్పే ప్రయత్నంలో ఓ సినిమాలా కాకుండా టీవీ సీరియల్‌గా సినిమాని నడిపించేశారు. ఏ దశలోనూ మనకు సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలగదు. ఫస్ట్‌ హాఫ్‌ కాస్తో కూస్తో ఫన్నీ సీన్స్‌ తో సినిమాని నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పెళ్ళి పనుల్లో నిమగ్నమైపోయి సగటు ప్రేక్షకుడిని పట్టించుకోలేదు. ఇక నితిన్‌, రాశీ ఖ‌న్నా పాత్ర‌లు జ‌స్ట్ ఓకే అన్నట్టుగా ఉన్నాయి. లుక్ ప‌రంగా ఇద్ద‌రి జంట తెర‌పై చూడ‌టానికి చ‌క్క‌గా ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరిగే ఒక రిచ్ పెళ్లిని కుటుంబ విలువలతో ఒక సినిమాగా మనకి చూపించేశారనే ఫిలింగ్ మాత్రం వచ్చేసింది.

సాంకేతిక వర్గం పనితీరు:

మిక్కీ జె మేయర్ మ్యూజిక్ లో ఒకే ఒక్క పాట బాగుంది. మ్యూజిక్ అంతా చప్పగా అనిపిస్తుంది. ఇక మిక్కీ అందించిన నేపధ్య సంగీతం కూడా సో సో గానే ఉంది. కుటుంబ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బలంగా ఉంటేనే ఆ సన్నివేశం ప్రేక్షకుడి మనసుని తాకుతుంది. కానీ అంత బలంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కడా కనిపించదు. ఇక ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ. సమీర్ ప్రతి ఫ్రెమ్ ని చాలా రిచ్ గా అందంగా చూపించాడు. పల్లెటూరి పిల్ల పాటను, పల్లెటూరి వాతావరణాన్ని.. పెళ్లి సన్నివేశాలను ఇలా అన్నిటిని తన కెమరాతో అందంగా తీర్చిదిద్దాడు. ఇక మధు ఎడిటింగ్ చికాకు తెప్పిస్తుంది. చాలా సీన్స్ డ్రాగ్ చేసినట్లుగా నీరసం తెప్పించాయి. చాలా సీన్స్ ని ఎడిటింగ్ లో లేపెయ్యల్సింది. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ ఆర్ట్ వర్క్. పెళ్లి సెట్ ని చాలా అందంగా వేశారు. ఇక చివరిగా దిల్ రాజు ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టాడు. సినిమా కథను, దర్శకుడిని నమ్మి సినిమాకి మీడియం బడ్జెట్ పెట్టినా.. ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు పిచ్చెక్కించాడు. ఓవరాల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: నితిన్ - రాశి రొమాంటిక్ లుక్స్, పెళ్లి వాతావరణం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్, భారీ తారాగణం

మైనస్ పాయింట్స్: మ్యూజిక్, స్టోరీ లైన్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, సెకండ్ హాఫ్, రిపీటెడ్ సీన్స్

రేటింగ్: 2.5/5

Similar News