నటీనటులు: కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్,మహేష్ ఆచంట, మురళి శర్మ, కిరీటి, ప్రగతి, రాజీవ్ కనకాల, సత్యం రాజేష్, పృద్వి రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: హర్ష వర్ధన్
సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్: సాయి కొర్రపాటి
డైరెక్టర్: రాకెష్ శశి
మెగా ఫ్యామిలీ ఆశీస్సులతో హీరో అవతారమెత్తిన మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన మావయ్య హిట్ చిత్రం టైటిల్ ని పెట్టుకుని మెగా అభిమానులతో పాటుగా మిగతా ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి 'విజేత'గా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మెగాస్టార్ చిరు చిన్న కూతురు శ్రీజని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్. అయితే నటన ఫ్యామిలీలోకి అల్లుడుగా అడుగుపెట్టాక ఆయనకు హీరో అవ్వాలనే కోరిక పుట్టడమే పాపం.... మెగా ఫ్యామిలీ మొత్తం కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది. ఇక కళ్యణ్ నటనలోనూ శిక్షణ తీసుకుని.. వారాహి చలనచిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మాతగా... రాకేష్ శశి దర్శకత్వంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా ఈ 'విజేత' సినిమా చేశాడు. మరి మెగా హీరోలకు ఫ్యామిలీ అండ ఉన్నట్లుగానే కళ్యాణ్ దేవ్ కి అడుగడుగునా మెగా ఫ్యామిలీ అందండలు ఉన్నాయి. తన మావయ్య చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం.. ఒకేసారి స్టార్ హీరో అవ్వాలనే ఆలోచన చెయ్యకుండా కళ్యాణ్ దేవ్ ముందుగా ఒక మీడియం మిడిల్ క్లాస్ కథను ఎంచుకుని చెయ్యడం.. వంటి ఆసక్తికర విషయాలతో కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలికి సినిమాటోగ్రఫీ చేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చెయ్యడం... మధ్యతరగతి జీవన స్థితిగతులను ఈ సినిమాలో చూపించడం వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలైంది. మరి కళ్యాణ్ దేవ్ ని హీరోగా ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కుటుంబం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి శ్రీనివాసరావు(మురళీ శర్మ). కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్) కోసం తన జీవితాశయాన్నే వదిలేసుకుంటాడు శ్రీనివాస రావు. కేవలం కుటుంబం కోసమే తనకెంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని వదిలిపెట్టి... నెలకింత సాలరీ వచ్చే ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరతాడు. కానీ తండ్రి కష్టన్ని ఏమాత్రం గుర్తించని రామ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి కూడా ఉద్యోగ సంప్రదించకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతూ... ఎదురింటి చైత్ర (మాళవికా నాయర్)ను ప్రేమిస్తూ.. ఆమెని ప్రేమలోకి దింపే పనిలో ఉంటాడు. కొడుకు ఏ పని చేయకుండా ఖాళీగా ఆవారాగా తిరుగుతూ జీవితం, కుటుంబంపై బాధ్యతలేని కొడుకుని చూసి శ్రీనివాసరావు కుమిలిపోతాడు. అయితే ఉద్యోగం మనకెందుకులే అనుకున్న రామ్ తన మిత్రులతో కలసి సొంతంగా సర్‌ప్రైజ్ ఈవెంట్ అనే బిజినెస్‌ను ప్రారంభిస్తాడు. అది కాస్త బెడిసికొడుతుంది. తన స్నేహితుల పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండడం... కొడుక్కి ఉద్యోగం లేక... బిజినెస్ క్లిక్ అవని కొడుకుని చూసిన శ్రీనివాస రావు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి తండ్రి బాధను చూసి రామ్ ఉద్యోగం కోసం గట్టిగా ట్రై చేస్తాడా? అసలు రామ్ కి తన తండ్రి కుటుంబం కోసం చేసిన త్యాగం ఎలాంటిదో తెలుస్తుందా? తన తండి కోసం రామ్ మారతాడా? తండ్రి కోసం రామ్ ఏం చేసాడు? కుటుంబ పరిస్థితులకు రామ్ తలొగ్గుతాడా? అనే అనుమానాలు తీరాలంటే విజేతని వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
కళ్యాణ్ దేవ్ హీరోగా పర్వాలేదనిపించారు. నటనలో గాని, లుక్స్ లో గాని కళ్యాణ్ దేవ్ ఓకె ఓకె పెరఫార్మెన్స్ చేసాడు. వెండితెర మీద మొదటిసారి కనబడడం.. అయినా కొత్తవాడు అనే ఫీలింగ్ పెద్దగా అనిపించదు. కాకపోతే మొదటి సినిమా అంటే ఓకె గాని.. ఇకముందు కళ్యాణ్ దేవ్ తన ఫిటెనెస్ విషయంలో గాని... నటనలో గాని ఇంకా మెరుగైన పెరఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మెగా హీరో మెగా హీరో అనేకంటే... కళ్యాణ్ ని కొత్త హీరో అనడమే బెటర్. ఎందుకంటే కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అయినా.. అతని బ్లడ్ లో నటన లేదు కాబట్టి... నటనలో ఈ విజేత సినిమాతో ఓనమాలు నేర్చుకున్నట్టే. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ చాలా న్యాచురల్ గా ఉంది. గ్లామర్ షో చేసే అవకాశం ఇచ్చే సబ్జెక్టు కాదు కనక మసాలా సాంగ్స్ లేకుండా బండి సాఫీగా నడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కళ్యాణ్ దేవ్ తో తన కెమిస్ట్రీ బాగానే పండింది. ఇక వీళ్ళ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసేది మాత్రం మురళి శర్మ. కొడుకు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి పాత్రలో బెస్ట్ ఇచ్చాడు. ఈ మధ్య ఒకే తరహా పాత్రలతో రొటీన్ అవుతున్న మురళి శర్మ ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ దొరకటాన్ని పూర్తిగా వాడుకున్నాడు. ఇంటర్వెల్ మొదలుకుని క్లైమాక్స్ దాకా హీరోతో సమానంగా జర్నీ చేసే పాత్రలో మురళి పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించాడు. అసలు ఈ సినిమాకి హీరో కళ్యాణ్ దేవ్ అని చెప్పడం కన్నా మురళీ శర్మ అని చెప్పడం సమంజసం. సినిమా మొత్తాన్ని ఆయన తన భుజస్కందాలపై నడిపించారు. ఓ మధ్యతరగతి కుటుంబ యజమానిగా అద్భుత నటనను కనబరిచారు. ఇది ఆయన కెరీర్‌లోనే ఓ మంచి పాత్ర అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఓ కొత్త మురళీ శర్మను చూస్తారు. సీనియర్ నటులు నాజర్, తనికెళ్ళ భరణి తమకు ఇచ్చిన దానికి పూర్తి న్యాయం చేసారు. సత్యం రాజేష్, పృద్వి కామెడీ ట్రాక్ అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు. రాజీవ్ కనకాల మిగతా ఆర్టిస్టులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు రాకేష్ శశి రొటీన్ కథనే కొత్తగా విజేత సినిమాగా మలిచాడు. మరి విజేత కథలాంటి కథలతో గతంలో ఏమిటి ఇప్పటికి అలాంటి కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చేసాయి.. వస్తున్నాయి కూడా. ఇక కథే రొటీన్ కాదు.. కథనం కూడా చెప్పగానే అనిపిస్తుంది. అయితే సాధారణ కథే అయినా ఇందులో ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్యన కాస్త సెంటిమెంట్ బాగా పండింది. మొదట ఏ బాదరబందీ లేకుండా, కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరిగిన కుర్రాడిగాను, ఆ తరువాత మారిన మనిషి గాను.. కళ్యాణ్ దేవ్ నటన ఫరవాలేదనిపించేలా ఉంది. నిజానికి ఎమోషనల్ గా ఇందులో అద్భుతమైన డ్రామా పండించే అవకాశం ఉంది. అయితే దర్శకుడు తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలు మాత్రం చాలా బాగా చూపించారు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. ఇది తప్ప సినిమాలో కొత్తదనం ఏమీలేదు. సినిమా నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ తెలిసిన కథే కావడం, తరవాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించడం పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ స్టోరీలో ఎక్కువ స్కోప్ లేకపోవడంతో కాస్త డ్రాగ్ చేసిన రాకేష్ శశి తనలో విషయముందని మాత్రం రుజువు చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో జయప్రకాశ్ బర్త్ డే ఎపిసోడ్ ని బాగా రాసుకున్న రాకేష్ అలాంటివి ఇంకో రెండు ఫస్ట్ హాఫ్ లో కూడా రాసుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ గా రాకేష్ శశి నిరాశపరచలేదు అని చెప్పొచ్చు. ఇక కిరిటీ, మహేష్ విట్ట, నోయల్, భద్రం, సత్యం రాజేష్ కామెడీ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇక కళ్యాణ్ దేవ్ కి మొదటి సినిమా కాబట్టి సర్దుకుపోవచ్చు.
సాంకేతిక వర్గం పనితీరు:
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం పర్వాలేదనిపించేలా ఉంది. పాటలన్నిటిలో మూడు పాటలు బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం కన్నా నేపధ్య సంగీతంతో బాగా మెప్పించాడు. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సెంథిల్ సినిమాటోగ్రఫీ. ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలకు కెమెరా వర్క్ అందించిన సెంథిల్ ఈ సినిమాకి కూడా ప్రాణం పెట్టాడు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా కనిపించింది. ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ను కూడా చాలా అందంగా చూపించారు. హీరో కళ్యాణ్ దేవ్‌ను వీలైనంత బాగా చూపించడానికి సెంథిల్ ప్రయత్నించారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. చాల ఎడిట్ చెయ్యాల్సిన సీన్స్ ఉన్నాయి. అక్కడక్కడా డ్రాగ్ అయిన ఫీల్ తెస్తుంది. ఇక సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వాల్యూస్ చాల రిచ్ గా బాగున్నాయి. ఎక్కడా నిర్మాణ విలువల్లో రాజి పడకుండా ఖర్చు పెట్టాడనే విషయం ప్రతి ఫ్రెమ్ లోను తెలుస్తుంది.
ప్లస్ పాయింట్స్: మురళి శర్మ నటన, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, తండ్రి కొడుకుల ఎమోషన్స్, సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, కథనం, ఎడిటింగ్, కామెడీ, స్లో నేరేషన్, హీరోయిన్ కి తగిన ప్రాధాన్యత లేకపోవడం
రేటింగ్: 2 .5 /5