బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
నటీనటులు: నిత్య మీనన్, కాజల్ అగర్వాల్, రెజినా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ
వాయిస్ ఓవర్: నాని అండ్ రవితేజ
మ్యూజిక్ డైరెక్టర్: రాబిన్ మార్క్
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: గౌతమ్ నెరుసు
నిర్మాత: నాని
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
అ! అనే సినిమా తెరకెక్కుతుంది అనేది గత రెండు నెలల వరకు ఎవరికీ తెలియదు. నాని నిర్మాతగా అ! సినిమా భారీ కాస్టింగ్ తో కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. మంచి కాన్సెప్ట్ తో కొత్త కథను టాలీవుడ్ కి అందిస్తానని మొదటినుండి నాని చెబుతుండడం... అ! సినిమా ఒకటుంది అని అ!పోస్టర్ వదిలినప్పటినుండి సినిమాపై అందరిలో అమితాసక్తి ఏర్పడింది. అందులోను కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా వంటి స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో భాగం పంచుకోవడం... అలాగే వారి లుక్స్ కూడా చాలా కొత్తగా అంటే... వారిని ఇలాంటి కేరెక్టర్స్ లో ప్రేక్షకులు ఎప్పుడు చూడని విధంగా... ఉండడం.. అలాగే శ్రీనివాస్ అవసరాల, మురళి శర్మ, ప్రియదర్శిలా గెటప్స్ కూడా కొత్తగా ఉండడంతో సినిమాలో ఏదో విషయం ఉందనే భావన కలిగింది. అలాగే ఒక సక్సెస్ ఫుల్ హీరో దర్శకుడు చెప్పిన అ! కథ నచ్చి ఆ సినిమాని నిర్మిస్తానని చెప్పి ఆ కొత్త దర్శకుడుని నమ్మడం వంటి విషయాలు కూడా సినిమాపై క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే... నిర్మాత నాని ఒక చేపకు తన వాయిస్ ని ఇవ్వడం... అలాగే మరో హీరో రవితేజ కూడా ఒక చెట్టుకి వాయిస్ ఓవర్ ఇవ్వడం... వంటి అంశాలు కూడా అ!సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. సక్సెస్ ఫుల్ గా హిట్స్ మీద హిట్స్ కొడుతున్న నాని ఇప్పుడు అ! సినిమా విషయంలో ట్రైలర్ లో కథను రివీల్ చెయ్యకుండా కేవలం కేరెక్టర్స్ ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీని అయితే పెంచగలిగాడు. మరి హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్న నాని నిర్మాతగా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకునందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఇది నిజంగానే సరికొత్త కథ. ఈ చిత్రం మొత్తం ఒక రెస్టారెంట్ చుట్టూనే తిరుగుతుంది. వివిధ నేపద్యాలు కలిగిన వారు ఆ రెస్టారెంట్ లో ఉంటారు. వారిలో ఏ ఒక్కరితో ఏ ఒక్కరికి అస్సలు సంబంధమే ఉండదు. కానీ వారి కథలు నిజ జీవితంలో ఎక్కడో కలుస్తూనే ఉంటాయి. ఇక కథలోకి వెళితే... స్వంతంగా బ్రతకడం చేతకాక ఇంకొకరి మీద ఆధారపడి మోసం చేసి ఉద్యోగం చేయాలనుకున్న ఒక చెఫ్(ప్రియదర్శి), మగాళ్ళ వల్ల రక్షణ లేదు కాబట్టి మరో అమ్మాయినే (నిత్య మీనన్) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఒక టీనేజ్ గర్ల్(ఈశా రెబ్బ), డ్రగ్స్ కు అలవాటు పడి డబ్బు కోసం ఏమైనా చేసే ఒక బార్ టెండర్(రెజినా), ఈగోతో రగిలిపోయే మెజీషియన్(మురళి శర్మ)... ఆ పాత్రలకి ఆర్గాన్ డొనేషన్ చేసి చచ్చిపోవాలి అనుకున్న ఒక యువతికి(కాజల్)కి కనెక్షన్ ఉంటుంది. అసలు వారంతా అక్కడ ఫుడ్ కోర్టులో ఏం చేస్తారు.? నిజ జీవితంలో వారు ఒకరికి వొకరు ఎలా కలుస్తారు? ఆ రెస్టారెంట్ లో ఉన్న వారికీ... ఆర్గాన్ డొనేషన్ చేసే యువతి(కాజల్) కి ఉన్న సంబంధం ఏమిటి? అనే కన్ఫ్యూషన్ విషయాలన్నీ తెలియాలి అంటే... అ! సినిమాని చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమాలో భారీ తారాగణం ఎంతున్నా... అందులో ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం కాజల్ అగర్వాల్. కాజల్ పాత్ర నిడివి తక్కువ అయినా... ఉన్నంతలో కాజల్ అగర్వాల్ తన పాత్రని పండించడంలో 100 శాతం సక్సెస్ అయ్యింది. కాజల్ పలికించిన హావ భావాలూ, ఎక్సప్రెషన్స్ తో మాత్రమే కాకూండా బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంది. అలాగే తన పాత్రకు తగ్గ న్యాయం చేసిన వారిలో నిత్యా మీనన్ ఒకరు. నిత్యా మీనన్ నటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు. ఎందుకంటే నిత్యా మీనన్ తన నటనతో ఎప్పుడో ఆకర్షించింది. అ! సినిమాలో నిత్యా నటన అదిరింది. కాకపోతే... నిత్యా మీనన్ పాత్ర నిడివి మరికాస్త ఉంటె బావుండేది అనిపించింది. ఇక రెజినా మొదటిసారి డిఫ్రెంట్ గెటప్ తో బాగానే ఆకట్టుకుంది. అందరి లోకి ఆశ్చర్య పరిచే పాత్ర రెజినాది. నెగటివ్ షేడ్స్ తో ఈ మధ్యకాలంలో ఏ కథానాయిక చేయని సాహసమే తను చేసింది. పూర్తిగా మేకోవర్ చేసుకుని మెప్పించిన తీరు నిజంగా అభినందనీయం. కాని మరీ ఎక్కువ స్కోప్ దొరకకపోవడం వల్ల ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం దక్కలేదు. ఈశా రెబ్బతోనే సినిమా ఓపెన్ అయినప్పటికీ తనది మాత్రం స్కోప్ ఉన్న పాత్ర కాదు. కానీ క్యూట్ లుక్స్ తో చక్కని నటనతో మేపించింది. ఇక వంటరాని వంటవాడిగా ప్రియదర్శి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. మంచి టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. సైంటిస్ట్ గా అవసరాల శ్రీనివాస్ కొత్త ఆహార్యంతో మెప్పించాడు. పోలీస్ గా, హీరొయిన్ తండ్రిగా ఈ మధ్య రొటీన్ గా మారిపోయిన మురళి శర్మ ఇందులో రిలీఫ్ అనిపించే పాత్రను దక్కించుకున్నాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
రాబిన్ మార్క్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. రాబిన్ మార్క్ మ్యూజిక్ సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది అనడంలో సందేహం లేదు. రాబిన్ సంగీతం అందించిన ఒక పాట కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్... కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ. కొన్ని విజువల్ ఎఫెక్ట్ సీన్స్ లో సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించేలా వుంది. లిమిటెడ్ బడ్జెట్ లో పరిమితుల మధ్య తీసిన సినిమాను చాలా రిచ్ గా అనిపించే అవుట్ పుట్ ఇవ్వడంతో కార్తీక్ మరోసారి తన టాలెంట్ చూపించుకున్నాడు. క్లోజ్ యాంగిల్స్ లో యాక్టర్స్ ఎక్స్ ప్రెషన్స్ ని పట్టుకున్న తీరు బాగా వర్క్ అవుట్ అయ్యింది. గౌతం నీరసు ఎడిటింగ్ షార్ప్ గా, అర్థవంతంగా రెండు గంటల సినిమాకు ఎంత కావాలో అంతే ఉండేలా తన డ్యూటీ తాను చేసింది. ఇక నాని వాల్ పోస్టర్ బ్యానర్ మీద అ!సినిమాని రిచ్ గానే లో బడ్జెట్ లో నిర్మించాడు. నిర్మాణ విలువలను క్వాలిటీగానే మైంటైన్ చేసి అదరహో అనిపించాడు.
విశ్లేషణ:
దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్తగా దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ... అతని దర్శకత్వంలో పెద్దగా లోపాలు లేవు. కొత్త కథని తీసుకుని కొత్తగానే ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడని చెప్పాలి. లైంగిక వేధింపులు, వ్యసనాలు అనే కాన్సెప్ట్ ని చాలా స్టైలిష్ గా చూపించే క్రమంలో తడబడినా ఓ కొత్త ఫీలింగ్ కలిగించాడు. క్రిస్పీగా, పాటల గోల లేకుండా స్ట్రెయిట్ గా చెప్పాలనుకున్న పాయింట్ ని ఎటువంటి సుత్తి లేకుండా చూపించే ప్రయత్నం చేసిన ప్రశాంత్ వర్మ గొప్పదనం మొత్తం స్క్రీన్ ప్లే లోనే కనబడుతుంది. అందుకే నాని ప్రశాంత్ ని నమ్మి ఈ సినిమాని పెట్టుబడి పెట్టాడు. నాని నమ్మకాన్ని ప్రశాంత్ వర్మ నిలబెట్టుకునే ప్రయత్నం చేసాడు. ఎక్కడ ప్రయత్న లోపం కనిపించదు. పలు కథలను ఒక పాయింట్ తో జత చేసి దర్శకుడు కథను నడిపిన తీరు అభినందనీయం. అయితే అ! సినిమా చూస్తున్నంత సేపు గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ కథలు సినిమాని గుర్తుకు తెస్తుంది. చందమామ కథలలో కూడా నలుగురి జీవితాలని ముడిపెట్టి జత చేసాడు దర్శకుడు. ఇక్కడ అ! సినిమా లో అదే జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమేట్స్ కాస్త తగ్గాయి. అలాగే సినిమాలోని పాత్రలు గజిబిజిగా వచ్చి పోతూ ఉండటంతో అసలు ఎం జరుగుతోందో ఎందుకు జరుగుతోందో ఒక పట్టాన అర్థం కాదు. ఇక ఈ సినిమాలో గ్లామర్ ఫీల్డ్ లో ఓ రేంజ్ లో ఉన్న కాజల్, నిత్య, రెజినా వంటి వారు భాగం కావడం ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్. అలాగే వారు పోషించిన పాత్రలు కూడా సినిమాకి హైలెట్ గానే నిలుస్తాయి.
ఇక అ! సినిమా ని మరో రేంజ్ లో నిలబెట్టింది మాత్రం హీరో నాని వాయిస్ ఓవర్ మరియు రవితేజాల వాయిస్ ఓవర్ లే. వీరిద్దరూ వాయిస్ ఓవర్స్ సినిమా స్థాయిని పెంచేయిగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: కాజల్, నిత్యా మీనన్, ఇషా రెబ్బ, రెజినా, బ్యాగ్రౌండ్ స్కోర్, నాని మరియు రవితేజ ల వాయిస్ ఓవర్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్: కమర్షియల్ అంశాలకు చోటు లేదు, కామెడీ లేకపోవడం, పాత్రల మధ్యన కన్ఫ్యూషన్, బిసి సెంటర్స్ కి ఎక్కకపోవడం
రేటింగ్: 3.0/5