నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్,రాజేంద్ర ప్రసాద్, ఆశిష్ విద్యార్ధి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య,పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు
బ్యానర్: ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్
ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం
మ్యూజిక్: శేఖర్ చంద్ర
డైరెక్టర్: వెలిగొండ శ్రీనివాస్
షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా టాలీవుడ్ లో వెలుగొందుదామని వచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా ఉయ్యాలా జంపాల తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుసబెట్టి హిట్స్ అవడంతో రాజ్ తరుణ్ కి మరోసారి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా సెటిల్ అయ్యాడు. గత చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కుక్కలని కిడ్నాప్ చేసి కామెడీ చేసి సూపర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ ఇప్పుడు అంధగాడితో అలరించడానికి వచ్చేస్తున్నాడు. కుమారి 21 ఎఫ్, ఆడో రకం ఈడో రకం చిత్రాల హిట్ తో హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ - రాజ్ తరుణ్ మరోసారి జోడికట్టిన చిత్రం అంధగాడు. ఇక హెబ్బా పటేల్ అందాల విందు ఉండనే వుంది. అయితే ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాల పాటు రాజ్ తరుణ్ అంధగాడు (గుడ్డివానిగా) కనబడాతాడని చిత్ర యూనిట్ చెబుతుంది. మరి అంధగాడుగా రాజ్ తరుణ్ ఎలాంటి కామెడీని ఈ చిత్రంలో పండించబోతున్నాడో చూద్దాం.
కథ: గౌతమ్ (రాజ్ తరుణ్) కి పుట్టుకతోనే కంటి చూపు ఉండదు. కంటి చూపులేకపోయినా గౌతమ్ రేడియా జాకీగా ఉద్యోగం చేస్తుంటాడు. రేడియో జాకీగా చేస్తూనే కళ్ళు దానం చేసే వారికోసం ఎదురు చూస్తుంటాడు గౌతమ్. అదేటైంలో తాను గుడ్డివాడు అన్న సంగతి తెలియకుండా అందరి దగ్గరా జాగ్రత్త పడతాడు. గుడ్డివానిగా వున్నప్పుడే గౌతమ్ డాక్టర్ నేత్ర (హెబ్బా పటేల్) ప్రేమలో పడతాడు. తాను గుడ్డివాడిని అన్న సంగతి నేత్రకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. కానీ విషయం నేత్రకి తెలిసిపోయి గౌతమ్ ప్రేమను తిరస్కరిస్తుంది. అయినా గౌతమ్ కి కళ్ళు తెప్పించేందుకు హెల్ప్ చేస్తుంటుంది. ఇక కళ్ళు లేనప్పుడు ఎంతో సంతోషంగా వున్న గౌతమ్ చూపు రాగానే తన సంతోషాల్ని కోల్పోతాడు. అసలు కళ్ళు వచ్చాక గౌతమ్ కోల్పోయే సంతోషాలు ఏమిటి? బాబ్జిగా రాజారవీంద్ర చేసే విలనిజం ఏమిటి? చూపు వచ్చేందుకు సహకరించిన నేత్ర, గౌతమ్ నుండి నిజంగానే విడిపోతుందా? ఇవన్నీ తెలియాలంటే మీరు వెండితెర మీద అంధగాడుని వీక్షించాల్సిందే.
నటీనటుల పాత్ర: తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రాజ్ తరుణ్ మరోమారు పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నటనలో చాలా ఎత్తుకు ఎదిగాడు. గుడ్డివానిగా ఒక ఛాలెంజింగ్ రోల్ లో రాజ్ తరుణ్ చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. గౌతమ్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు రాజ్ తరుణ్. కొన్ని సీన్స్ లో రాజ్ తరుణ్ నటన అద్భుతం. గుడ్డివానిగా, లవర్ బాయ్ గా బాగా ఆకట్టుకున్నాడు. కళ్ళు లేకపోయినా కళ్లజోడుతో మేనేజ్ చేస్తూ పేస్ లోని ఎక్సప్రెషన్స్ తో కవర్ చేస్తూ అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక హెబ్బా పటేల్ కూడా గ్లామర్ డాల్ గా బాగానే ఆకట్టుకుంది. డాక్టర్ గా హెబ్బా పర్వాలేదనిపించింది. కానీ ఆమె నటనకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇకపోతే పాటల్లో హెబ్బా అందాల విందుతో మరోసారి రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక విలన్ గా రాజ్ రవీంద్ర నటన సూపర్బ్ అనిపించేలా లేకపోయినా పర్వాలేదనిపించేలా వుంది. రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే ఎమోషన్స్ తో చితక్కొట్టేశాడు. ఇక ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ స్వతహాగా రచయిత కావడం వలన ఒక మంచి కథతోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస్ స్క్రీన్ ప్లే విషయంలో ఘోరమైన దెబ్బతిన్నాడు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అతిపెద్ద మైనస్. స్క్రీన్ ప్లే ని ఆకట్టుకునేలా చేస్తే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్ రాజ్ తరుణ్ కామెడీ, అల్లరితో బాగానే సాగింది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి సినిమా అంతా గందరగోళంగా తయారైంది. దర్శకుడిగా పరిచయం అయిన శ్రీనివాస్, స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్హ పెట్టాల్సింది. శేఖర్ చంద్ర ,మాస్, రొమాంటిక్ బీట్స్ మంచి మ్యూజిక్ తో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ సినిమాలో పాటలకు సరైన ప్లేసెమెంట్ లేకపోవడంతో ఈ చిత్రానికి పాటలు మైనస్ అనే చెప్పొచ్చు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుండేదనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా వున్నాయనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్: రాజ్ తరుణ్ , కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: ఎడిటింగ్, సెకండ్ హాఫ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, క్లైమాక్స్
రేటింగ్: 2 .25 /5