ప్రొడక్షన్ హౌస్: శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్
నటీనటులు: విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, ఎస్. జె సూర్య
మ్యూజిక్ డైరెక్టర్: ఏ ఆర్ రెహ్మాన్
నిర్మాత: శరత్ మరార్ ( తమిళ్ ప్రొడ్యూసర్స్ ఎన్. రామస్వామి, హేమ రుక్మణీ, ఆర్. మహేంద్రన్, హెచ్. మురళి)
దర్శకుడు: అట్లీ కుమార్
విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'మెర్సల్' చిత్రం అక్కడ విజయ దుందుభి మోగించింది. ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం టాప్ లెవల్లో దూసుకుపోయింది. ఈ చిత్రాన్ని 'రాజు రాణి' ఫెమ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. తమిళనాట 'మెర్సల్' చిత్రం అనేక వివాదాలతో బిజెపి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. బిజెపి నేతలంతా 'మెర్సల్' సినిమాలోని కొన్ని డైలాగ్స్ తొలగించాలని పట్టుబట్టి మరి రచ్చ చేశారు. బిజెపి ప్రభుత్వం చేసిన ఈ రచ్చ తో 'మెర్సల్' కి ఇండియా వైజ్ గా ప్రీ పబ్లిసిటీ వచ్చేసి.... ఆప్రభావం సినిమా కలెక్షన్స్ మీద పడింది. దెబ్బకి కోలీవుడ్ బాక్సాఫీసుని చీల్చి చెండాడింది విజయ్ 'మెర్సల్'. మరి ఆ ప్రీ పబ్లిసిటీతో అనుకోని అద్భుతం జరిగి రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది 'మెర్సల్'. అయితే తమిళనాట విడుదలైన రోజే తెలుగులో 'అదిరింది'గా విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ ఈ రోజు అంటే నవంబర్ 9 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ మూడు పాత్రల్లో ఇరగదీసాడు. డాక్టర్ గా, యాక్టర్ గా, తండ్రిగా విజయ్ నటన 'అదిరింది'లో అదిరింది అనిపించే లేవల్లోనే ఉంటుంది. మరి 'మెర్సల్' లో వివాదానికి కారణమైన విద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపించే ఆ డైలాగ్స్ ఇప్పుడు ఈ తెలుగు వెర్షన్ 'అదిరింది'లో ఉంటాయా అనే క్యూరియాసిటీతో తెలుగు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక విజయ్ యాక్షన్, నటనతోపాటే.. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే మరో ప్రధానమైన ఎస్సెట్.... హీరోయిన్స్. తెలుగులో టాప్ రేంజ్ లో ఉన్న సమంత, కాజల్ అగర్వాల్ లతోపాటు నిత్యా మీనన్ ఈ సినిమాలో నటించడం. ఇకపోతే రెండు తెలుగు సినిమాలు, మరో తమిళ డబ్బింగ్ సినిమాతో పోటీపడుతూ ఒకరోజు ముందే విజయ్ 'అదిరింది థియేటర్స్ లోకొచ్చేసింది. మరి తమిళనాట విజయం అందుకున్న విజయ్ 'మెర్సల్' తెలుగు ప్రేక్షకులను 'అదిరింది' గా ఎలా ఆకట్టుకుందో... సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఈ చిత్రం మొత్తం మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ. ఈ చిత్రంలో విజయ్ మూడు పాత్రల్లో కనిపించాడు. ఒక పాత్ర డాక్టర్ పాత్ర కాగా రెండోది మెజీషియన్ పాత్ర. మూడోది డాక్టర్ కి మెజీషియన్ పాత్రలకు తండ్రి పాత్ర. ఇక కథలోకెళితే... ఒక మారుమూల గ్రామంలో విజయ్, భార్గవ్ (విజయ్) ల బాల్యంలో వారి తండ్రి దళపతి(విజయ్) హత్య చెయ్యబడతాడు. సిటీలో వరసగా ఒక హాస్పిటల్ చెయిన్ కు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ అవుతుంటారు. ఆ తర్వాత హత్యకు గురవుతారు. అయితే ఆ కిడ్నప్ లకు, హత్యలకు గల కారణం ఐదు రూపాయలకే సేవ చేస్తూ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న డాక్టర్ భార్గవ్(విజయ్) నే అందరూ అనుమానిస్తారు. తక్కువ డబ్బుకే మెరుగైన వైద్యం అందిస్తూ ఇలా కిడ్నప్ లు చేస్తూ హత్యలకు పాల్పడుతున్నాడనే అనుమానం అందరిలో బలపడుతుంది. మరోవైపు మేజిక్ షోలు చేస్తూ ఉండే విజయ్(విజయ్)పాత్ర ఎంటర్ అవుతుంది. స్టేజి మీద అందరు చూస్తుండగానే విజయ్ ఒక హత్య చేసి పారిపోతాడు. అసలు తండ్రి కొడుకుల జీవితాలతో ఒకే ఒక వ్యక్తి ఆడుకుంటాడు. అసలు డాక్టర్ భార్గవ్, మెజీషియన్ విజయ్ అన్నదమ్ములనే విషయం తెలుస్తుందా? ఆ మెడికల్ మాఫియాని భార్గవ్ ఎలా అంతమొందిస్తాడు? అసలు విజయ్ మ్యాజిక్ షోలో ఎందుకు హత్య చేస్తాడు? తండ్రి కొడుకుల జీవితాలతో ఆడుకున్న ఆ ఆవ్యక్తి ఎవరు? అనేది తెరమీద చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే.
నటీనటుల నటన:
అదిరింది సినిమా మొత్తం విజయ్ వన్ మ్యాన్ షో. మూడు పాత్రల్లో విజయ్ చెలరేగిపోయి నటించాడు. అయితే గెటప్స్ పరంగా పెద్దగా తేడా ఏమి లేనప్పటికీ.. నటనలో వేరియేషన్స్ చూపించి దాన్ని కవర్ చేసేసాడు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమా కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ఓకే. విజయ్ కున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాకి మంచి హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరొయిన్లు నటించారు. సమంత, కాజల్, నిత్య మీనన్ విజయ్ సరసన నటించారు. ఈ సినిమాలో సమంతకి కాజల్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు పడలేదు. ఏదో ఫస్ట్ హాఫ్ లో కథను సాగదీయడానికి.... బలవంతంగా పాటలు ఇరికించడానికి తప్ప ఈ సినిమాలో కాజల్, సమంత చేసింది ఏమి లేదు. కానీ ఉన్నంతలో నిత్య మీనన్ పాత్ర కాస్త నయం అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నిత్యా మీనన్ నటన ఆకట్టుకుంటుంది. ఇక పోలీస్ పాత్రలో సత్యరాజ్ పర్వాలేదనిపించారు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రధారి విలన్ గా చేసిన ఎస్ జె సూర్య. స్పైడర్ లో విలన్ పాత్రలో ఇరగదీసిన ఎస్ జె సూర్య నటన ఈసినిమాలో చూస్తుంటే ఫ్యూచర్లో అతనికి విలన్ గా మంచి డిమాండ్ ఏర్పడేలా కనబడుతుంది. వడివేలు పాత్ర అతి లేకుండా ఆకట్టుకుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు అట్లీ మాస్ ప్రేక్షకులను మైండ్ లో పెట్టుకుని ఈ సినిమా ని తెరకెక్కించాడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ కమర్షియల్ హీరోకున్న పరిధులు మరిచిపోకుండా రాసుకున్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్ ఈ అదిరింది సినిమా. కథ విషయంలో ఏమంత కొత్తగా అనిపించకపోయినా... దర్శకుడు అట్లీ తన టేకింగ్ స్టయిల్ తో మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలను అని నమ్మి ఈ సినిమాని తెరకెక్కించాడు. కాకపోతే ఇలాంటి రివెంజ్ డ్రామాని అట్లీ తన గత చిత్రం తేరి లోనే చూపించేసాడు. జిఎస్‌టిపై హీరో చెప్పే డైలాగ్స్‌కి తమిళంలో మంచి స్పందన వచ్చినా, ఇక్కడ మ్యూట్‌లో పెట్టడం జరిగింది. ఇదో రకంగా మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. సమంత, విజయ్, రాజేంద్రన్ మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అలాగే ఈ అదిరింది సినిమా చూస్తున్నంతసేపు .... తెలుగు ప్రేక్షకుడి మైండ్ లో గతంలో వెనకటేష్ నటించిన గణేష్ చిత్రం స్ఫురణకు వస్తుంది. గణేష్ సినిమాలో వెంకటేష్ ఈ మెడికల్ మాఫియా గురించి కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. అదిరింది కథ పాతదే అయినప్పటికీ దర్శకుడి మేకింగ్ స్టయిల్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రం హై స్టాండెడ్ లో నిలబెడుతుంది. అయితే ప్రముఖ కథా రచయితా విజయేంద్ర ప్రసాద్ కమర్షియల్ సూత్రాలకు లోబడి ఈ కథని ప్రిపేర్ చేసాడు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన అదిరింది పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. పాటలతో తీవ్రంగా నిరాశ పరిచిన ఎఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయే లెవల్లో అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ని రెహ్మాన్ ఇరగదీసాడు. ఇక ఎడిటింగ్ విషయంలోకొన్ని కత్తిరించాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. విష్ణు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధానమైన ఎస్సెట్. చాలా సీన్స్ ని చాలా రిచ్ గా చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఇక నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి. ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా సినిమాని నిర్మించారు.
ప్లస్ పాయింట్స్: విజయ్ మూడు పాత్రలు, మాస్ ఎలెమెంట్స్, అదిరిపోయే మేకింగ్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
నెగటివ్ పాయింట్స్: పాటలు, నిడివి ఎక్కువ కావడం, కథ కొత్తగా లేకపోవడం
రేటింగ్: 3.0/5