బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో ఇండియన్ స్టార్ అయిన అనుష్క సౌత్‌లో టాప్ హీరోలకు ధీటుగా దూసుకుపోతోంది. బాహుబలి - ది కన్‌క్లూజన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా భాగమతి. పిల్ల జమిందార్ ఫేం జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క సోలో హీరోయిన్‌గా నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పలుసార్లు వాయిదాలు పడుతూ సంవత్సర కాలంగా ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేలకు రిపబ్లిక్ డే కానుకగా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం.
టీజర్, ట్రైలర్ల తర్వాత ఇది మరో అరుంధతి అన్న అభిప్రాయం జనాల్లో కలిగింది. ఇక భాగమతిలో అనుష్క చెంచల, భాగమతిగా రెండు పాత్రల్లో కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనుష్క, ఉన్ని ముకుందన్ ప్రేమ సన్నివేశాలు, బంగ్లాలో సీన్లు, సీబీఐ అధికారుల ఇన్వెస్ట్‌గేషన్ సీన్లతో సినిమా ఆసక్తిగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్రైలర్‌లో చూసినట్టుగానే ఇది భాగమతి అడ్డారా ? అని డైలాగ్ చెపుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.
ఫస్టాఫ్ మొత్తం డీసెంట్‌గానే నడుస్తుంది. ఫస్టాఫ్‌లో అనుష్క చెంచలగా కనిపిస్తుంది. భాగమతిగా అనుష్క ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి భాగమతిగా అనుష్క అద్భుతంగా నటించింది. ఎలాంటి పాత్రలో అయినా తాను ఒదిగిపోతానని అనుష్క మరో మారు నిరూపించింది. సెకండాఫ్‌లో మెయిన్ కథలోకి సినిమా వెళుతుందని ఆశించిన ప్రేక్షకుడి కి నిరాశ కలుగుతుంది.
ఇన్వెస్ట్‌గేషన్ సన్నివేశాలు పదే పదే సాగదీశాక కాని సెకండాఫ్‌లో మెయిన్ స్టోరీలోకి వెళ్లదు. అప్పటికే చాలా టైం అయిపోతుంది. దీంతో క్లైమాక్స్‌కు ముందు పార్టు పూర్తిగా తేలిపోయింది. కథ పరంగా ఆలోచిస్తే చిత్రం ప్రేక్షుకులు ఆశించిన స్థాయిలో లేదు. అనుష్క నటన, బ్యాక్ గ్రౌండ్ సంగీతం మెస్మరైజ్ చేస్తాయి. భాగమతి బంగ్లా సెట్, మిగిలిన ఆర్ట్ వర్క్ బావున్నాయి. ఇక బాహుబలి 2 తర్వాత అనుష్క నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలు అందుకోలేదన్న టాక్ ప్రీమియర్ల తర్వాత వినిపిస్తోంది. మరి పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్