నటీనటులు: అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి, తనికెళ్ళ భరణి, శ్యామల
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె.సి.నరసింహారావు
డైరెక్టర్: ఇంద్రగంటి మోహనకృష్ణ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంద్రగంటి మోహన కృష్ణ కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలన్నీ క్లాస్ కామెడీని పండించడంలో సక్సెస్ అయినవే. 'అష్టాచమ్మా' చిత్రం దగ్గర నుండి నిన్నమొన్నటి 'జంటిల్మన్' వరకు ఒక ప్రత్యేక స్టయిల్ తోనే సినిమాలను తెరకెక్కించాడు. 'అష్టాచమ్మా, అంతకుముందు ఆ తర్వాత, జంటిల్మన్' వంటి చిత్రాలను ఏదో ఒక నవల ఆధారంగానే తెరకెక్కించానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఇప్పుడు తాను డైరెక్ట్ చేసిన 'అమీ తుమీ' చిత్రాన్ని మాత్రం తన సొంత స్క్రిప్ట్ తోనే తెరకెక్కించానని చెప్పాడు. అవసరాల శ్రీనివాస్, అడవిశేష్, ఈషా, అదితి వంటి స్టార్స్ తో ఈ 'అమీ తుమీ'ని ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. అయితే ఈ 'అమీ తుమీ' ట్రైలర్స్ అవీ చూస్తుంటే మళ్ళీ 'అష్టాచమ్మా' వంటి కన్ఫ్యూషన్ కామెడీ గుర్తుకు వస్తుంది. శ్రీనివాస్ అవసరాల కూడా అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే అడవి శేష్ కూడా 'క్షణం' వంటి చిత్రానికి స్కిప్ట్ అందించాడు. ఇక నటుడిగా శేష్ నటన 'పంజా, క్షణం, దొంగాట, వంటి చిత్రాల్లో చూసాము. మరి ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ శ్రీనివాస్ అవసరాల, అడవిశేష్ లతో ఎలాంటి కామెడీని పండించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: కోట్లకి పడగెత్తిన జనార్దన్ (తనికెళ్ళ భరణి) కి ఇద్దరు పిల్లలు. వారు అబ్బాయి విజయ్ (అవసరాల శ్రీనివాస్), అమ్మాయి దీపిక (ఈషా). డబ్బు మీద వ్యామోహంతో జనార్దన్ తన పిల్లలకి తాను నిశ్చయించిన పెళ్లి సంబంధాలే చెయ్యాలనుకుంటున్నాడు. అయినా జనార్దన్ కొడుకు విజయ్, మాయ (అదితి మ్యాకల్) ను ప్రేమిస్తాడు. మరోపక్క దీపికా ఒక సేల్స్ మేనేజర్ అనంత్ (అడివి శేషు)ను ప్రేమిస్తుంది. దీపికా ప్రేమించిన అనంత్ కి డబ్బులేదని తెలిసిన జనార్దన్, కూతురి ని శ్రీ చిలిపి(వెన్నెల కిషోర్ ) కి ఇచ్చి పెళ్లి నిశ్చయం చేస్తాడు.మరోపక్క విజయ్ ప్రేమించిన మాయ అన్నా జనార్దన్ కి ఇష్టం ఉండదు. కారణం మాయ తండ్రి తో జనార్దన్ కి ఉన్న మనస్పర్థల కారణంగా విజయ్, మాయల పెళ్ళికి ఒప్పుకోడు. ఇక దీపికా తాను ప్రేమించిన అనంత్ ని పెళ్లి చేసుకోవడం కోసం పనిమనిషి (శ్యామల) తో కలిసి నాటకమాడుతుంది. అంతా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ కామెడీతో సాగే ఈచిత్రంలో విజయ్, మాయని పెళ్లి చేసుకుంటాడా..? అలాగే దీపికా తండ్రి ని ఎదురించి అనంత్ ని చేరుకోగలిగిందా..? అసలు మాయ తండ్రికి జనార్దన్ కి ఉన్న మనస్పర్థలు ఏమిటి? ఇంతకీ శ్రీ చిలిపి ఎవరిని చేసుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితం గా 'అమీ తుమీ' ని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా తెలుగువారే కావడం ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. కాకపోతే శ్రీనివాస్ అవసరాల కామెడీతో బాగా ఎంటర్టైన్ చేస్తాడనుకున్న వారికీ కాస్త నిరాశే మిగులుతుంది. ఇందులో శ్రీనివాస్ పాత్రకి బాగా నిడివి తక్కువ కావడం వలన శ్రీనివాస్ నటనను ప్రేక్షకుడు పెద్దగా ఎంజాయ్ చెయ్యలేరు. ఇక ఈ చిత్రానికి అతిపెద్ద బలం వెన్నెల కిషోర్ కామెడీ. శ్రీ చిలిపి పాత్రలో వెన్నెల కిషోర్ ఫన్ బాగా క్రియేట్ చేసాడు. పనిమనిషి శ్యామలతో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అక్కడక్కడా బాగానే నవ్వు తెప్పిస్తుంది. ఇక అడవి శేష్ అనంత్ పాత్రలో ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి ఈషా తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించింది. అదితి తన పాత్రమేర నటించింది. జనార్దన్ గా కోటీశ్వరుడుగా తనికెళ్ళ భరణి కొన్నిసార్లు మెప్పించినా... ఆయన నటన కొన్నికొన్నిసార్లు అతిగా అనిపించింది. మిగతానటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ జంటిల్మన్ తర్వాత తీస్తున్న అమితుమీ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. అయితే ఇంద్రగంటి ఈ చిత్రంలో కామెడీని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో కథని కథనాన్ని విస్మరించాడనే చెప్పాలి. ఈ చిత్రంలో అడివి శేషు, అవసరాల హీరోలుగా చేస్తున్నారంటే ఎంతో కొంత ఫ్రెష్‌నెస్‌ని, కొత్తదనాన్ని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ రొటీన్ కామెడీతో కొత్తదనం ఏమాత్రం కనబడదు. రెండు జంటలను ప్రధానంగా తీసుకున్నప్పుడు వారిమద్య రొమాంటిక్ సన్నివేశాల విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సింది దర్శకుడు. కానీ వారిమధ్యన అటువంటి రొమాంటిక్ యాంగిల్స్ అస్సలు ఉండవు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని చోట్ల బావున్నా మరికొన్ని చోట్ల బోర్ కొట్టించేస్తుంది. ఇక సినిమాకి మెయిన్ హైలెట్ పిజి విందా ఫోటోగ్రఫి. ప్రతి ఫ్రెమ్ ని చాలా సహజ సిద్ధంగా చిత్రీకరించాడు. ఇక సంగీతం విషయానికొస్తే సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన రెండు పాటలు పర్వాలేదనిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకె ఓకె. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక సినిమా నిర్మాతల విషయానికి వస్తే ఈ చిత్రానికి బాగా తక్కువ బడ్జెట్ పెట్టినా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: నటులు తెలుగువారు కావడం, నటీనటులు, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, రొమాంటిక్ టచ్ లేకపోవడం
రేటింగ్: 2 .0 /5