ప్రొడక్షన్ హౌస్: శ్రీ సాయిరామ్ క్రియేషన్స్
నటీనటులు: గోపీచంద్, అను ఇమ్మాన్యుయేల్, రాశి ఖన్నా, జగపతిబాబు, శామ్, అశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్: యువన్ శంకర్ రాజా
నిర్మాత: ఐశ్వర్య.ఎస్
దర్శకత్వం: ఎ.ఎం. జ్యోతిక్రిష్ణ
శౌర్యం, లౌక్యం, జిల్, గౌతమ్ నందా అంటూ వరసబెట్టి సినిమాలు చేసిన గోపీచంద్ కి కాలం కలిసిరాక వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. కేవలం పరాజయాలు మాత్రమే కాకూండా తన సినిమాల షూటింగ్ పూర్తి చేసినప్పటికీ.. సరైన టైం లో సినిమాలు విడుదల చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటికి మొన్న ఆరడుగుల బుల్లెట్ విషయంలో జరిగిందే ఇపుడు గోపీచంద్ తాజా చిత్రం ఆక్సిజన్ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా 2015 లోనే మొదలైంది. షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం వాయిదాలమీద వాయిదాలు తీసుకుంటూ ఎట్టకేలకు ఈ గురువారం ప్రేక్షకులముందుకు వచ్చింది. జ్యోతిక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యువల్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే గోపీచంద్ కెరీర్ మొదట్లో లక్ష్యం సినిమాలో జగపతి బాబుకి తమ్ముడిగా నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు జగపతి బాబు తో కలిసి గోపీచంద్ ఈ సినిమాలో నటించాడు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతిక్రిష్ణ, హీరో గోపీచంద్ లు గట్టిగానే ప్రమోట్ చేసి అంచనాలు పెంచగలిగారు. ఓ.. అన్నంత అంచనాలేమి పెట్టుకోకుండానే సైలెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఆక్సిజెన్ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
రఘుపతి(జగపతి బాబు) రాజమండ్రిలోని తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తుంటాడు. కృష్ణప్రసాద్(గోపిచంద్) రఘుపతి కూతురు శృతి(రాశిఖన్నా)ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి వస్తాడు. రఘుపతి కుటుంబానికి గుర్తు తెలియని శత్రువుల నుంచి ముప్పు ఉంటుంది. ఆ శత్రువుల భయంతో కూతురికి త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని రఘుపతి నిర్ణయించుకుంటాడు. దేశ యువతను నాశనం చేస్తున్న డ్రగ్ సిగరెట్లు వలన ఆర్మీ కమాండర్ సంజీవ్(గోపిచంద్)తమ్ముడు కాన్సర్ తో చనిపోతాడు. దీంతో ఆ రాకెట్ పని పట్టే ఆక్సిజన్ అనే ఆపరేషన్ మొదలుపెడతాడు సంజీవ్. అయితే అనుకోకుండా కృష్ణప్రసాద్‌ను, శృతిని.. రఘుపతి శత్రువులు కిడ్నాప్ చేస్తారు. అసలు మిలిటరీ ఆఫీసర్ అయిన సంజీవ్, కృష్ణ ప్రసాద్ లు ఒక్కరేనా? అసలు రఘుపతి కుటుంబాన్ని చంపాలనుకుంటున్నది ఎవరు..? కిడ్నాప్ చేసిన కృష్ణప్రసాద్, శృతిలను విడిచిపెట్టారా..? చివరికి సంజీవ్ ఆక్సిజన్ ఆపరేషన్ ని ఎలా ముగిస్తాడు.? అనే విషయాలు తెరమీద సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన:
గోపిచంద్ నటనలో ప్రత్యేకంగా ఎత్తిచూపడానికి ఏమి లేదు. తనకు అలవాటైన ధోరణిలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వేరియేషన్స్ బాగా చూపించాడు. కాకపోతే గోపిచంద్ ఈ సినిమాలో చేసిన కృష్ణ ప్రసాద్ లాంటి పాత్రలను ఇదివరలో చాలానే చేసాడు. మల్టీ టాలెంట్స్ ఉన్న గోపిచంద్ ఇందులో కూడా సగటు మాస్ సినిమాలో హీరోలా తప్ప కొత్తగా ఏమి కనిపించడు. ఫస్ట్ హాఫ్ లో డీసెంట్ గా ఉండే బుద్ధిమంతుడిలా హ్యాండ్ సమ్ గా బాగానే ఉన్నాడు. ఇక యాక్షన్ మోడ్ లోకి వచ్చాక గతంలో గోపీచంద్ సినిమాల్లో ఎలా వున్నదో అచ్చం అలాగే కనబడ్డాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్స్ ఉన్న సీన్స్ లో తన టాలెంట్ చూపించాడు. హీరోయిన్స్ విషయానికొస్తే రాశి ఖన్నా పాత్ర ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర కాదు. అసలు సరైన పాత్రే లేదంటే.. ఇక రాశి ఖన్నా పెరఫార్మెన్స్ ఏముంటుంది. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యుయేల్ పాటల్లో గ్లామర్ డోస్ కాస్త పెంచింది. శ్యామ్ పాత్ర కి అస్సలు ప్రాధాన్యతే లేదు. గోపిచంద్ తమ్ముడి బ్యాచ్ బాగానే కుదిరింది. జగపతిబాబు, షియాజి షిండే, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, సితార, ఆలీ, వెన్నెల కిషోర్, కాలకేయ ప్రభాకర్, సుధ, చంద్రమోహన్, తాగుబోతు రమేష్, ఆశిష్ విద్యార్థి ఇలా నటీనటుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ... వారిని కరెక్ట్ గా వాడుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.
దర్శకుడు:
దర్శకుడు జ్యోతిక్రిష్ణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న ఒక కీలక సమస్యని నేపథ్యంగా తీసుకున్నాడు కానీ కమర్షియల్ గా మెప్పించాలనే తాపత్రయంలో పూర్తిగా బాలన్స్ తప్పాడు. టైటిల్ తో ఇదేదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తియ్యబోతున్నాడా అనే ఫీలింగ్ కలిగించాడు. పరమ చెత్త కథని పట్టుకొచ్చి సినిమాని తయారు చేసేసాడు. అసలు సినిమా ఫస్ట్ హాఫ్ ముగియగానే ఇంత రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా రాసుకుని మోసం చేసాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా ఎందుకనిపిస్తుంది అంటే కథా నేపథ్యం ఇదే అని ముందుగా ప్రిపేర్ చేయకపోవడం. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసిన దర్శకుడు ఇంటర్వెల్ లో గొప్ప ట్విస్ట్ ఇవ్వడం నిజానికి నెగటివ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక సోషల్ మెసేజ్ తో కమర్షియల్ సినిమా ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్స్ మధ్యమధ్యలో ఇస్తూ ఉండాలి. కానీ దర్శకుడు ఆ విషయాలను నెగ్లెక్ట్ చెయ్యడంతో సినిమాకి రొటీన్ ఫార్ములా ముద్ర పడిపోయింది. సెకండ్ హాఫ్ మీద దర్శకుడు పెట్టిన ఎఫర్ట్ ఫస్ట్ హాఫ్ మీద కూడా పెడితే సినిమా చేసిన ఫలితం దక్కేది. సావిత్రి పాత్రతో ఆలీ చేసిన కామెడీ ఆకట్టుకున్నా.. రొటీన్ గానే అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు:
ఆక్సిజన్ కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా వరస్ట్ ఆల్బమ్స్ లో ఈ ఆక్సిజెన్ పాటలకు టాప్ ప్లేస్ ఇవ్వొచ్చు. కానీ చిన్నా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను చాలా మటుకు కాపాడింది. చోటా కె నాయుడు కెమెరా పనితనం స్క్రీన్ మీద గొప్ప క్వాలిటీ ఇచ్చింది. అందుకే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్. కానీ ఈ సినిమాకి ఎడిటింగ్ పెద్ద మైనస్. పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగా వచ్చాయి. ప్రొడక్షన్ మాత్రం చాలా రిచ్ గా ఉంది. ఎఎం రత్నం నిర్మాణం మాత్రం చాలా రిచ్ గా ఉండటం రెండున్నర గంటలు కూర్చునేలా చేసింది.
ప్లస్ పాయింట్స్: గోపీచంద్, మెసేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రొటీన్ స్టోరీ, ఎడిటింగ్, సెంటిమెంట్ సీన్స్, సంగీతం
రేటింగ్: 2.0 /5