ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ

Update: 2018-02-09 08:51 GMT

బ్యానర్: సి.కె ఎంటర్టైన్మెంట్స్

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, షియాజీ షిండే, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: ఎస్. ఎస్. థమన్

సినిమాటోగ్రాఫర్: ఎస్.వి. విశ్వేశ్వర్

ఎడిటింగ్: గౌత రాజు

కథ: ఆకుల శివ

నిర్మాత: సి. కళ్యాణ్

డైరెక్టర్: వి వి వినాయక్

మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మేనమామల నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాదు... పెద్ద మేనమామ చిరంజీవి వేసే డాన్స్ లకు పోటీగా డాన్స్ చేస్తూ... చిరు, పవన్ లను ఇమిటేట్ చేస్తూ మీడియం రేంజ్ హీరోగా మారాడు సాయి ధరమ్ తేజ్. మొదటినుండి మాస్‌ మసాలా సినిమాలకి కట్టుబడ్డ సాయిధరమ్‌ తేజ్‌ ఈసారి కూడా వి వి వినాయక్ దర్శకత్వంలో అలాంటి మాస్ సినిమాలోనే ఇంటిలిజెంట్ అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడూ పొందికగా, లక్షణమైన పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో అందాల ఆరబోతకు అడ్డే లేదని..... ఇష్టం వచ్చినట్టుగా గ్లామర్ షో చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ డాన్స్ లు, యాక్టింగ్ స్కిల్స్ తో పాటే.... వినాయక్ వంటి మాస్ మసాలా దర్శకుడు కూడా తోడవడంతో ఈ సినిమాపై ఎనలేని క్రేజ్ అలాగే అంచనాలు వచ్చేసాయి. మరి వరుస పరాజయాలతో విసిగిపోయిన తనకి అర్జెంట్ గా అదిరిపోయే హిట్ వచ్చేయాలని చూస్తున్న సాయి ధరమ్ కి.... స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యలేక ఇలా మెగా ఫ్యామిలీకి ఇచ్చినమాటకు కట్టుబడి మెగా మేనల్లుడు అయిన సాయి ని డైరెక్ట్ చేసిన వినాయక్ కలిసి ఈ ఇంటిలిజెంట్ తో ఏ రేంజ్ హిట్ సొంతం చేసుకున్నారో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఒక సాఫ్ట్ వేర్ కంపనీను నడుపుతూ ప్రజలకు తనవంతు సహాయం చేయాలని ఒక ట్రస్ట్ ను నడుపుతుంటాడు నందకిషోర్(నాజర్). అతడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెరిగిన తేజు(సాయి ధరం తేజ్) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అతడి కంపనీలోనే పని చేస్తుంటాడు. తేజుకి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు. అయితే తేజు ఉద్యోగం చేసే కంపనీ ఎండి నందకిషోర్ కూతురు సంధ్య(లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు తేజు. ముందు తేజుని కాదన్నా.. తర్వాత తేజు చేసే మంచి పనులకు ఫిదా అయ్యి తేజుని ప్రేమిస్తుంది సంధ్య. ఇలాంటి సమయంలోనే నందకిషోర్ ఆఫీస్ ను తన సొంతం చేసుకోవడానికి మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) ప్రయత్నిస్తుంటాడు. నందకిషోర్ కంపెనీని తన పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు విక్కీభాయ్. అలాంటి సమయంలోనే నందకిషోర్ ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంటాడు. నంద కిషోర్ ఆస్తి కాస్తా విక్కీ భాయ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. విక్కీ భాయ్ కి రాజకీయపలుకుబడి ఉండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతారు. అసలు నంద కిషోర్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? నిజంగానే నంద కిషోర్ ఆత్మహత్య చేసుకుంటాడా.. లేదా అతనిది హత్య? నంద కిషోర్ చనిపోయాక అతని ఆస్తి కూతురు సంధ్యకి రావాలి గాని విలన్ విక్కీ భాయ్ చేతికి ఎలా వెళుతుంది? సంధ్య తేజు ల ప్రేమ పెళ్లి పీటలెక్కుతుందా? తన గురువు మరణానికి కారణమైన వారిని తేజు ఎలా మట్టుబెడతాడు? అసలు తేజు ధర్మ భాయ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇన్ని డౌట్స్ కేవలం ఇంటిలిజెంట్ సినిమా చూస్తేనే తీరుతాయి.

నటీనటుల నటన:

సాయి ధరమ్ తేజ్ ఎప్పటిలాగే... ఎనర్జిటిక్ గా నటించి మెప్పించాడు. సాయి ధరమ్‌ తేజ్‌ పర్‌ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. ఎక్కడా ఎలాంటి లోపం లేని నటనతో సాయి పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా డాన్స్ ల విషయంలో చిరు కి పోటీనా అన్నట్టుగా అద్భుతమైన స్టెప్స్ తో అలరించాడు. అందులోను చిరంజీవి సాంగ్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన చమకు చమకు సాంగ్ లో సాయి ధరమ్ స్టెప్స్ సూపర్ అనిపించేలా ఉన్నాయి. కానీ యాక్షన్ సీన్స్ లో సాయి అంతగా కనబడలేదు. తేలిపోయినట్లుగా అనిపించాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. సినిమాలో హీరోయిన్ అనే కేరెక్టర్ ఉండాలి గనక ఆమెను తీసుకున్నాం.. అన్నట్టుగా డిజైన్ చేసారు లావణ్య పాత్రని. వినాయక్ కేవలం లావణ్య ని అందాల బొమ్మగానే చూపించాడు గాని ఎక్కడ నటనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ లావణ్య దొరికిందే సందు అన్నట్టుగా పాటల్లోనూ, కొన్ని సీన్స్ లోను హాట్ షో చేసింది. ఇక ఈ సినిమా తో లావణ్య కెరీర్ దాదాపుగా ముగిసినట్టే. ఇకపోతే విలన్స్ గా నటించిన రాహుల్ దేవ్‌, దేవ్ గిల్‌, వినీత్‌కుమార్‌ పర్వాలేదనిపించారు. అలాగే సాయి ధరమ్ ఫ్రెండ్ గా చేసిన రాహుల్ రామ‌కృష్ణ‌, స‌ప్త‌గిరి, న‌ల్ల‌వేణు ఓకె ఓకె పెరఫార్మెన్సు చేశారు. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు లేని బ్రహ్మ్మనందం కామెడీ ట్రాక్ ఈ సినిమా లో పరమ చెత్తగా వుంది. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ వారం విడుదల కానున్న మూడు సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. మరి ఒకేసారి మూడు సినిమాలకు మ్యూజిక్ అందించడం వల్లనేమో... థమన్ ఇంటిలిజెంట్ సినిమా మ్యూజిక్ విషయంలో ఎలాంటి కొత్తదనం చూపించలేదు. ఈ సినిమా పాటలకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద మైనస్. ఏదో బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించిన సినిమాలో విషయం లేకపోయేసరికి... అది కూడా వినసొంపుగా వినబడలేదు. ఇక ఈ సినిమాకి మెయిన్ బలం మాత్రమే కాదు.. ఇదొక్కటే సినిమాకి ఉన్న ఏకైక స్కోప్ కూడా... సినిమాటోగ్రఫీ. ఎస్ .వి. విశ్వేశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాని రిచ్ గా చూపించింది. కొన్ని సీన్స్ ని ఎలివేట్ చెయ్యడంలో సినిమాటోగ్రాఫర్ కృషి బావుంది. ప్రతి సీన్ ని రిచ్ గా చూపెట్టడంలో 100% సక్సెస్ అయ్యాడు ఎస్ .వి. విశ్వేశ్వర్. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన లోపం ఎడిటింగ్ అనిపించేలా లాగింగ్ సీన్స్ ఉన్నాయి. కత్తెర వేయాల్సిన చోట కత్తెర వెయ్యకుండా ప్రేక్షకుల సహనానికి పరీక్షా పెట్టాడు ఎడిటర్. ఇక ఇంటిలిజెంట్ నిర్మాత సి కళ్యాణ్ సినిమాకి ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలు అదే రేంజ్ లో సూపర్ అన్నట్టుగా ఉంది ఇంటిలిజెంట్ సినిమా.

దర్శకత్వం:

అసలు ఈ సినిమాని వినాయక్ యేనా తెరకెక్కించింది అనే డౌట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో మెదులుతుంది . సినిమా చూస్తున్నంత సేపు వినాయక్ డైరెక్షన్ ఎక్కడ ఫీల్ అయ్యేలా కనబడం లేదు. ఓక్ రొటీన్ కథని తీసుకుని... దానిని కొత్తగా హ్యాండిల్ చెయ్యలేక దర్శకుడు వినాయక్ నానా ఇబ్బందులు పడ్డాడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో ఫ్రెండ్స్ తో కాస్త కామెడీ ని నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ నెస్, ప్రతీకారాలు, యాక్షన్ సీన్స్ అంటూ ప్రేక్షకులను అసహనానికి గురి చేసాడు. ఇక సాయి ధరమ్ నటన కన్నా డాన్స్ ల విషయంలోనే బెటర్ అనిపించాడు. ఎన్నో గొప్ప మాస్ సినిమాలను టాలీవుడ్ కి అందించిన వినాయక్ డైరెక్షన్ లో ఈ ఇంటిలిజెంట్ అనే సినిమా తెరెక్కింది అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రేక్షకులు. అలా తలా తోక లేకుండా సినిమాని నడిపించాడు. స్క్రీన్ ప్లే మీద కూడా అస్సలు శ్రద్ద పెట్టలేదు. వినాయక్ గతంలో ఎన్టీఆర్ తో తెరకేకించిన అదుర్స్ లో కథ లేకపోయినా కామెడీతో హిట్ కొట్టేసాడు. అలాగే ఖైదీ నెంబర్ 150 కూడా అంటే,. ఎంత యాక్షన్ కి ప్రాధాన్యత ఇచ్చినా... కామెడీని లైట్ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఇంటిలిజెంట్ విషయానికొస్తే అస్సలు కామెడీ ని సీరియస్ గా తీసుకోలేదనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి కథ ఉన్న సినిమాలను మనం చాలానే చూసేసామే.. అన్న ఫీలింగ్...తప్ప మరేది రాదు. మరి మీడియం హీరో అని వినాయక్ దర్శకత్వాన్ని అంతగాపట్టించుకోలేదా... లేదంటే వినాయక్ డైరెక్షన్ లో పస తగ్గిందో తెలియదు గాని సాయి ధరమ్ కి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్లాప్ ని ప్రెజెంట్ చేసాడు వినాయక్.

ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ డాన్స్, సినిమాటోగ్ర‌ఫీ

మైనస్ పాయింట్స్: క‌థ‌, క‌థ‌నం, దర్శకత్వం, కామెడీ, మ్యూజిక్, బ్యగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్

రేటింగ్: 2.0/5

Similar News