ఉంగరాల రాంబాబు మూవీ రివ్యూ

Update: 2017-09-15 09:21 GMT

నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్,పోసాని కృష్ణ మురళి

సంగీతం: గిబ్రాన్

నిర్మాత: పరుచూరి కిరీటి

దర్శకత్వం: క్రాంతి మాధవ్

సునీల్‌ కామెడీ సినిమాలు మానేసి కమర్షియల్‌ సినిమాలపై దృష్టి పెట్టాడనే విమర్శల నేపథ్యంలో అతను ఈసారి కామెడీ చేయడానికే ట్రై చేశాడు. టాలీవుడ్ కమెడియన్స్ లో సునీల్ ఒకడు. కామెడీ టైమింగ్ తో రెచ్చిపోతూ సొంతం, మనసంతా నువ్వే, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలలో తనదైన మార్క్ కామెడీని టాలీవుడ్ కి పరిచయం చేసాడు. బ్రహ్మనందానికి కామెడీలో పోటీ ఇచ్చిన హాస్య నటుడు.... అందంగా కామెడీ చేసుకోక ఎవరో పిలిచి హీరో వేషం ఇచ్చారని తనదైన కామెడీని వదిలేసి హీరోగా మారిపోయాడు. ఒక్క సినిమా హిట్ తోనే ఇక హీరోగానే ఫిక్స్ అవుతా.. కామెడీ వేషాలు వెయ్యానంటూ... హీరోగా సినిమాల మీద సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు. మొదట్లో సునీల్ కమెడియన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు అంటే హీరోగా ఎలా ఉంటాడో చూద్దామనుకుని అతన్ని ప్రేక్షకులు ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే... అలాగని అన్నివేళలా అతని ఫేస్ ని హీరోగా చూడాలంటె ఏం చూస్తారు. కామెడీ ఫేస్ పెట్టుకుని హీరోయిజం చేసేద్దామంటే కుదురుతుందా? మరి హీరోలా సీరియస్ గా ఫైట్స్ గట్రా చేసేసి ఎమోషనల్ గా ఫేస్ పేట్టి సినిమాని హిట్ చెయ్యమంటే ఎందుకు చేస్తారు. ఇక సినిమాల్లో సునీల్ హీరోగా హిట్ అయ్యింది కూడా కామెడీ వలెనే అన్న విషయం మరిచిపోయాడు. మర్యాదరామన్న వంటి చిత్రాలలో సునీల్ ని కామెడీ హీరోగానే చూపించాడు దర్శకుడు రాజమౌళి. మరి హీరోగా చింపేస్తాను ... ఇకమీదట కామెడీ చెయ్యను అని మడి కట్టుకుని కూర్చున్న సునీల్ కి వరుసగా ప్లాప్స్ పలకరిస్తున్నాయి. ఇక ఇప్పుడు సునీల్ క్రాంతి మాధవ్ దర్సకత్వంలో ఉంగరాల రాంబాబు అంటూ మరోసారి హీరోయిజాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. క్రియేటివిటీ టాలెంట్ ఉన్న దర్శకుడు క్రాంతి మాధవ్ తో సినిమా చేసిన సునీల్ కి ఇప్పటికైనా హిట్ పడి ఫెట్ మారుతుందో లేదో... మరి ఈ చిత్రంలో సునీల్ జ్యోతిష్యాన్ని నమ్ముకున్నాడు. ఈ సినిమా పూర్తయ్యి చాలా కాలం అయినప్పటికీ ఫైనాన్స్ ప్రాబ్లెమ్ వల్ల విడుదల తేదీలు మార్చుకుంటూ ఎట్టకేలకు దిల్ రాజు హ్యాండ్ తో సినిమా ఈ రోజు శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చింది. ఇక సునీల్ తో కృష్ణాష్టమి సినిమాని నిర్మించిన దిల్ రాజు, సునీల్ మీద అభిమానంతో ఈ సినిమాకి తన వాయిస్ ని అందించాడు. అయితే సునీల్ ఉంగరాల రాంబాబు ప్రమోషన్స్ లో భాగంగా ఇకమీదట కామెడీ పాత్రలకు కూడా సై అంటూనే హీరో పాత్రలను మాత్రం వదలనని చెప్పాడు. దీన్నిబట్టి మనం ఇకమీదట సునీల్ ని కమెడియన్ గా కూడా చూడబోతున్నాం ఇది ఫిక్స్. అయితే ఇప్పుడు ఉంగరాల రాంబాబు..... హీరోగా సునీల్ కి ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

చిన్నప్పటినుండి భయం భయంగా వుండే రాంబాబు(సునీల్) తన తాతగారి మాటలు విని ధైర్యవంతుడిగా మారతాడు. అయితే అనుకోకుండా వచ్చిన అదృష్టం, బాదాం బాబా(పోసాని కృష్ణ మురళి) ఆశీసుల వల్ల రాంబాబు ఒక ట్రావెల్ ఆఫీస్ రన్ చేస్తూ ఉంటాడు. అందులో చిన్నగా నష్టాలు మొదలు అవుతాయి. ఇక రాంబాబు తన జాతకానికి సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు మహర్దశ పడుతుందని నమ్మి ఆ అమ్మాయి కోసం వేట ప్రారంభిస్తాడు. అదే సమయంలో రాంబాబు ఆఫీస్ లో ఉద్యోగిగా చేరుతుంది సావిత్రి(మియా జార్జ్). వారిద్దరూ ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రేమలో పడతారు. ఈ క్రమంలో సావిత్రి తన తండ్రి రంగా(ప్రకాష్ రాజ్)ను రాంబాబుకు పరిచయం చేస్తుంది.ఆ క్రమంలోనే రాంబాబు ఒకసారి సావిత్రి వాళ్ల ఊరికి వెళతాడు. కానీ రంగాకి రాంబాబు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరో పక్క రంగా బాగా నమ్మిన వ్యక్తి రంగాని మోసం చేస్తాడు. మరి రంగా చివరికి రాంబాబు, సావిత్రిల ప్రేమను ఒప్పుకుంటాడా? రాంబాబుకి నిజంగానే జాతకాలంటే అంత పిచ్చా? రంగ ఇంట్లో రాంబాబు ఎలాంటి కష్టాలను ఎదుర్కున్నాడు? రంగాని మోసం చేసిన వ్యక్తిని రాంబాబు ఎలా పట్టుకుంటాడు? మరి రంగా మనసుని రాంబాబు గెలిచి సావిత్రిని పెళ్లాడాడా? అనేది తెలియాలంటే మాత్రం ఉంగరాల రాంబాబుని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటులు:

సునీల్ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా రొటీన్ గా కనబడ్డాడు. ఇందులో సునీల్ ప్రత్యేకంగా చేసింది కూడా ఏమి లేదు. తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం, కామెడీతో అన్ని సినిమాల్లో లాగే కనిపించిన సునీల్ ఈ సినిమాలో మాత్రం కొద్దిగా అతి తగ్గించడం మాత్రమే కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. అయితే హీరోలను ఇమిటేట్ చేస్తూ సునీల్ చేసిన కామెడీ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. మరి ఇప్పటికైనా తానూ హీరోగా పనికి రానానే విషయాన్నీ సునీల్ గుర్తిస్తే మాత్రం ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతారు. హీరొయిన్ మియా జార్జ్ పర్వాలేదనిపించింది. సావిత్రి పాత్రలో బాగానే మెప్పించింది. ఇక ప్రకాష్ రాజ్ నటన, ప్రకాష్ రాజ్ ని మోసం చేసే పాత్రలో రాజీవ్ కనకాల.... సునీల్ గురువుగా పోసాని కృష్ణ మురళి తమ పరిధిమేర నటించి మెప్పించారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు క్రాంతి మాధవ్ గురించి చెప్పాలి అంటే ఆయన గత చిత్రాలు 'ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు' చాలా వైవిధ్య భరితంగా వుండే మంచి కథ, కథనం ఉన్న సినిమాలు. ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ క్రాంతి మాధవ్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి దర్శకుడు ఇలా సునీల్ తో సినిమా చెయ్యడం మాత్రం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే. తన సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ పాత్రను పెట్టుకున్నాడు, కాని వాణిజ్య సూత్రాలకు లోబడి హీరోతో పాటలు, ఫైట్లు లాంటి రొటీన్ వ్యవహారానికి క్రాంతి మాధవ్ కూడా మారడం అనేది అర్ధం కాని విషయం. మరి సునీల్ ఎప్పటిలాగే రొటీన్ గా కనబడ్డాడు. కానీ క్రాంతి మాధవ్ అయినా ఎమన్నా ప్రత్యేకత ఈ సినిమాలో చూపించాడా అంటే అది లేదు. రొటీన్ కథనే ఎంచుకుని.... కథనాని పరిగెత్తించలేక... ప్రేక్షకులకు బోర్ కొట్టించేసాడు. ఇక ఉంగరాల రాంబాబు పాటల విషయానికి వస్తే... ఈ చిత్రానికి సంగీతం అందించిన గీబ్రాన్ ఎటువంటి కొత్తదనాన్ని కూడా చూపెట్టలేకపోయాడు. ఒక్క పాట కూడా మైండ్ లో రిజిస్టర్ కాదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదనిపించేలా వుంది. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. ఎక్కువ ఏజ్ ఉన్న సునీల్ ని వీలైనంత యంగ్ గా చూపించడానికి చాలా కష్టపడ్డాడు. ఎడిటింగ్ లో చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ చూపించాల్సింది. నిర్మాత పరుచూరి కిరీటి మాత్రం ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి పెట్టుబడి పెట్టాడు. నిర్మాణ విలువలల్లో మాత్రం ఎక్కడా లోపం కనబడదు.

విశ్లేషణ:

అసలు సునీల్‌ ఉంగరాల రాంబాబు కంటే ముందు చేసిన జక్కన్న, కృష్ణాష్టమి, ఈడు గోల్డెహే సినిమాలే కాస్త పర్వాలేదనిపిస్తాయి.అసలు సునీల్‌ కూడా తన గత చిత్రం బాగుందని మనచేతే అనిపించడానికి ఒక్కో సినిమాకీ ఇంకాస్త విసిగిస్తున్నాడేమో అని కూడా అనుమానమొస్తుంది ఈ సినిమా చూస్తుంటే. సునీల్‌ ముందుగా ఆత్మ పరిశీలన చేసుకుని తనేం కావాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి. సునీల్‌ ఈమధ్య చేస్తోన్న చిత్రాల్లో కామెడీ ఉండడం లేదనే మాట బాగా వినబడుతుంది. తానూ హీరోగా చేస్తున్న సినిమాల్లో కామెడీ చేస్తే తనని కమెడియన్ గానే చూస్తారు గాని హీరోగా జమకట్టారని భయపడుతున్నాడా ఏమో గాని.... సునీల్ సినిమాల్లో మాత్రం కామెడీకి తక్కువ స్కోప్ ఇచ్చి హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నారు సునీల్ తో చేసే దర్శకులు. మరి 'ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు' రెండు విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ కూడా రొటీన్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు కాని తన ఫార్ములాతో కొత్తగా ట్రై చెయ్యలేకపోయాడు. ఏది ఏమైనా సునీల్ ఈ సినిమాతో మరో ప్లాప్ ని అందుకున్నాడు. ఇక మీదట సునీల్ హీరోగానూ, కమెడియన్ గాను ఇరగదీస్తానంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడుగా చూద్దాం ఎంతవరకు మాటమీద నిలబడతాడో.

ప్లస్ పాయింట్స్: ప్రకాష్ రాజ్, సునీల్, కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, సెకండ్ హాఫ్, పాటలు, ఎడిటింగ్, క్లైమాక్స్

రేటింగ్: 2.0/5

Similar News