ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) మూవీ రివ్యూ

Update: 2018-03-23 10:55 GMT

బ్యానర్: బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్

నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, రవికిషన్, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మని శర్మ

సినిమాటోగ్రాఫర్: ప్రసాద్ మూరెళ్ళ

నిర్మాత: భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి

దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్

కళ్యాణ్ రామ్ కి అటు నిర్మాతగానూ ఇటు హీరోగానూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ ఎక్కడా నీరసించి పోకుండా తన ప్రయత్నం తానూ చేస్తూనే ఉన్నాడు. నిర్మాతగా ఎంతగా ఎదురుదెబ్బలు తిన్నా ఒక్క హిట్ పడగానే లేచి నిలబడే సత్తా ఉన్న కళ్యాణ్ రామ్ హీరోగా తన కెరీర్ లో అనేక ప్లాపులున్నా ఇప్పటికి కష్టపడుతూనే ఉన్నాడు. మధ్యలో పటాస్ వంటి హిట్స్ వున్నా తర్వాత వచ్చిన షేర్, ఇజం సినిమాల్తో మళ్ళీ దెబ్బతిన్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు పూర్తి కమర్షియల్ ఫార్మేట్ లో ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఎమ్యెల్యే సినిమా చేసాడు. ఎమ్యెల్యే అంటే మంచి లక్షణాలుం అబ్బాయిగా నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాపై మొదటినుండి మంచి అంచనాలే ఉన్నాయి. కారణం కళ్యాణ్ రామ్ న్యూ లుక్ తోపాటు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ కి జోడిగా గ్లామర్ డాల్ లా కనిపించడం దగ్గరనుండి... కళ్యాణ్ రామ్ డాన్స్ లు, ట్రైలర్ తో ఈ సినిమాపై కలిగిన ఆసక్తితో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ చెప్పిన కథకు కమిట్ అయ్యి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని చేసాడు. మరి ప్లాప్స్ తో కొట్టుకిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కి ఈ ఎమ్యెల్యే ఎలాంటి హిట్ అందించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

మిడిల్ క్లాస్ జీవితం అయినా.. జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా కళ్యాణ్(కళ్యాణ్ రామ్) తన జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తన చెల్లెలి లక్ష్మికి (లాస్య) పెళ్లి చేసిన కళ్యాణ్ తన చెల్లెలితో పాటు బెంగుళూరుకి వచ్చేస్తాడు. అయితే కళ్యాణ్ తన బావ ప్రసాద్ (వెన్నెల కిషోర్) పనిచేసే కంపెనీలో మేనేజర్ చంటి(పోసాని) ద్వారా జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కళ్యాణ్, ఇందు(కాజల్ అగర్వాల్) అనే అమ్మాయిని ఇష్టపడి ప్రేమించడం మొదలుపెడతాడు. ఇందు ప్రేమ కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఆ సమయంలోనే ఒక స్థలం వివాదంలో మార్థల్లి(అజయ్)తో గొడవ వల్ల అనుకోకుండా ఇందూకి బాగా దగ్గరవుతాడు. కానీ ఇందూకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కళ్యాణ్ ఇందు కోసం ఎమ్మెల్యే గాడప్ప(రవి కిషన్)కు వ్యతిరేఖంగా ఎమ్యెల్యే గా నామినేషన్ వేస్తాడు. మరి కళ్యాణ్ ఎమ్యెల్యేగా రవికిషన్ మీద నెగ్గుతాడా? అసలు ఇందు కున్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఇందుకు రవికిషన్ కి మధ్య ఉన్న సంబధం ఏమిటి? అసలు ఇందు తో కళ్యాణ్ పెళ్లి అవుతుందా? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

కళ్యాణ్ రామ్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా, మంచి లక్షణాలున్న అబ్బాయిగా, ఒక ప్రేమికుడిగా, డాన్సర్ గా, లుక్స్ పరంగా ను అన్ని విధాలా బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే పాత్రనే ఎంచుకున్నాడు. నటన నుండి డాన్స్ ల వరకు బాగానే ఆకట్టుకున్నాడు. మాస్ , క్లాస్, కామెడీ ఇలా అన్నిటిలోను కళ్యాణ్ రామ్ తన టాలెంట్ చూపించి ఆకట్టుకున్నాడు. కాకపోతే రెగ్యులర్ గా సినిమాల ద్వారా టచ్ లో లేకపోవడంతో స్క్రీన్ మీద కొత్త హీరోను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. తన లుక్ లో బాగా మార్పులు చేసుకున్న కళ్యాణ్ రామ్ ఇందులో తన వరకు ఏం చేయాలో అంత చేసాడు. హీరోయిన్ గా మంచి రేంజ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ తన గ్లామర్ షో తో బాగా ఆకట్టుకుంది. అలాగే తన పాత్ర కు తగ్గట్టుగా నటించి ఎప్పటిలాగే మంచి మార్కులు కొట్టేసింది. పాటల్లో కాజల్ గ్లామర్ షో ఆకట్టుకునేలా వుంది. ఇక విలన్ గా రవికిషన్ కూడా మంచి పెరఫార్మెన్స్ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ కామెడీ ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించింది. కమెడియన్ పృథ్వి హీరో పిఏగా ఒకే ఒకే గా ఉన్నాడు. ఇక మరో హీరోయిన్ రాథోడ్ గురించి చెప్పడానికి ఏమి లేదు. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కామెడీ అక్కడక్కడా పేలింది. మిగతా వారిలో పోసాని, జయప్రకాష్ రెడ్డి, అజయ్, రాజా రవీంద్ర, శివాజీ రాజా తమతమ పాత్రల పరిధిమేర నటించారు.

విశ్లేషణ:

దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఒక రెగ్యులర్ కథని తీసుకుని దానికి కమర్షిల్ ఎలిమెంట్స్ ని జోడించే ప్రయత్నం చేసాడు. కథలో గాని, కథనంలో గాని కొత్త దనం ఎక్కడా కనబడదు. పాత చింతకాయ పచ్చడిలా పాత కథనే సినిమాగా తీర్చిదిద్దాడు. ఒక మంచి లక్షణాలున్న అబ్బాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సామాజిక సమస్య కోసం ఎమ్యెల్యే తో పోరాడి అనుకోకుండా అతను కూడా రాజకీయాల్లోకి రావడం అనే పాయింట్ మీద స్క్రిప్ట్ ని రెడీ చేసినప్పటికీ సినిమా తెరమీదకి వచ్చేటప్పటికి రొటీన్ రూట్ లోకి వెళ్లిపోయిందని భావన సగం సినిమా పూర్తి కాకుండానే అర్థమవుతుంది. రచయితగా తనదైన ముద్ర వేసిన ఉపేంద్ర ఈ సినిమా విషయంలో అసలు కథనాన్ని మాత్రం కొత్తదనానికి దూరంగా తీసుకుపోయాడు. అక్కడక్కడా కళ్యాణ్ రామ్ చేత పొలిటికల్ డైలాగ్స్ ని బాగానే చెప్పించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త కామెడిగానే సాగుతుంది.. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లో అక్కడ విలన్ రవికిషన్ చేసే కామెడీ చిరాకు తెప్పిస్తుంది. మరి ఉపేద్ర మాధవ్ ఈ ఎమ్యెల్యే తో పూర్తిగా కాకపోయినా కాస్త నిరాశ పరిచాడనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి సంగీతం అందించిన మణిశర్మ మ్యూజిక్ రొటీన్ గానే అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి స్పెసిలిష్ట్ అయిన మణిశర్మ ప్రస్తుతం పాటలకు మ్యూజిక్ ఇచ్చే విషయంలో ఏనాడో తన పట్టు కోల్పోయాడు. ఇక ఈ సినిమాకి మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ కాస్త ఆకట్టుకునేలా వుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే... ప్రసాద్ మురెళ్ళ ఫోటోగ్రఫి సినిమాని రిచ్ లుక్ లో చూపించించింది. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ ని చాలా రిచ్ గా చూపెట్టడంలో ప్రసాద్ సక్సెస్ అయ్యాడు. బిక్కిన తమ్మిరాజు ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో కత్తెర పదునుగా ఉండకపోతే రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక నిర్మాతలు మాత్రం ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టిన విషయం ప్రతి ఫ్రెమ్ లోను తెలుస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కాజల్ అందాలు, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, స్లో నేరేషన్, ఎడిటింగ్

రేటింగ్: 2.5/5

Similar News