ప్రొడక్షన్ హౌస్: లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్మెంట్స్
నటీనటులు: అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, శీరత్ కపూర్, కాశీ విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్, ప్రవీణ్, సత్య మొదలగు వారు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: చక్రి చిగురుపాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మరో మెగా హీరో సినిమాల్లోకి వచ్చాడని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ గౌరవం సినిమా తర్వాత డిఫ్రెంట్ కథలను ఎంచుకుంటూ కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలు చేసాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమా టైం కి అల్లు శిరీష్ నటన లో చాలా ఇంఫ్రూమెంట్ చూపించాడు. బాడీ లాంగ్వేజ్ లోను, డైలాగ్ డెలివరీలోను ఇలా అన్ని విషయాలలో అల్లు శిరీష్ మంచి నైపుణ్యం సంపాదించాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమాలో ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి.. ఒక కోటీశ్వరుడి కొడుకై ఉండి కూడా సాధారణ యువకుడిలా మారి.. ఒక మధ్యతరగతి తండ్రి మనసు గెలిచి ఆ అమ్మాయిని దక్కించుకున్న పాత్రలో శిరీష్ ఆకట్టుకున్నాడు. ఇక శ్రీరస్తు శుభమస్తు తర్వాత హడావిడిగా ఏదో ఒక కమర్షియల్ సినిమా చెయ్యకుండా ఒక డిఫ్రెంట్ సబ్జెక్టు తో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం సినిమా చేసాడు. వి.ఐ.ఆనంద్ కూడా నిఖిల్ తో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా వంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అల్లు శిరీష్ తో ప్యారలల్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ ఒక్క క్షణం సినిమాని తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమాలో హాట్ హీరోయిన్స్ సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించడం, అవసరాల శ్రీనివాస్ ఒక కీ రోల్ ప్లే చెయ్యడం వంటి విషయాలతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరనుండి... ట్రైలర్ వరకు అందరిని ఆకట్టుకుని సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాతో మెగా హీరో అల్లు శిరీష్ ఎటువంటి విజయాన్ని అంటే హిట్టా? లేక సూపర్ హిట్టా? లేదంటే బ్లాక్ బస్టర్ హిట్టా? లేదా ఫట్టా? దేనిని సొంతం చేసుకున్నాడో అనే విషయాన్నీ సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
జీవా(అల్లు శిరీష్) చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. చిన్నప్పటినుండి జీవా ప్రతి విషయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటాడు. ఒకరోజు షాపింగ్ మాల్ లో జ్యోత్స్న(సురభి)ను చూసి మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. జ్యోత్స్న కూడా జీవాను ప్రేమిస్తుంది. అయితే జీవా, జ్యోత్స్న జీవితాల్లో జరిగే సంఘటనలన్నీ వారి ఎదురు ప్లాట్ లో ఉండే శ్రీనివాస్(అవసరాల శ్రీనివాస్), స్వాతి(సీరత్ కపూర్)ల జీవితాల్లో కూడా జరుగుతుంది. అంటే శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ప్రస్తుతం జరిగే సంఘటనలన్నీ... జీవా, జ్యోత్స్న ల విషయంలో భవిష్యత్తు లో జరుగుతుంటాయి. ఈ విషయం కనిపెట్టిన జ్యోత్స్నలో టెన్షన్ మొదలవుతుంది. ఈ లోపు ఊహించని విధంగా స్వాతి హత్యకు గురవుతుంది. ఆ హత్య చేసింది నేనేనని శ్రీనివాస్ చెప్పడంతో అతడిని అరెస్ట్ చేస్తారు. దీంతో జ్యోత్స్న తన జీవితంలో కూడా ఇలానే జరుగుతుందని.. జీవా తనని చంపేస్తాడని... భయపడి జీవాకు దూరంగా వెళ్లిపోవాలనుకుంటుంది. మరి స్వాతి ఎలా చనిపోతుంది? స్వాతిని నిజంగా శ్రీనివాస్ చంపాడా? అసలు జీవా, జ్యోత్స్నలు పెళ్లాడతారా? శ్రీనివాస్, స్వాతిల జీవితంలో జరిగిన ఘటనలే జ్యోత్స్న, జీవా జీవితాల్లో జరగడానికి కారణం ఏమిటి? మరి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. కచ్చితంగా ఒక్క క్షణం సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమాలో జీవాగా అల్లు శిరీష్ నటన బావుంది. అతని గత చిత్రాలతో పోలిస్తే మాత్రం నటనలో, డాన్స్ విషయంలో ఎంతో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. హీరోయిన్ సురభి కి ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఆమె గ్లామర్ కన్నా నటనకే ఎక్కువ ప్రాధాన్యం వుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి అదనపు ఆకర్షణ. సురభి ఎమోషన్స్ లోను మంచి వేరియేషన్స్ చూపించింది. సీరత్ కపూర్ కూడా పర్వాలేదనిపించుకొంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూయిసైడ్ చేసుకునే పాత్రలో సీరత్ నటన అద్భుతమని చెప్పాలి. అవసరాల శ్రీనివాస్ పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంతలో మెప్పించాడు. నటుడిగా తన పాత్రతో కథలో మంచి ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు. అల్లు శిరీష్ కి తల్లి తండ్రులుగా రోహిణి, కాశీ విశ్వనాథ్ బాగా ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
దర్శకుడు:
వి.ఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి థ్రిల్లర్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమా వలె ఈ ఒక్క క్షణం సినిమాని ఒక మంచి కాన్సెప్టుతో తెరకెక్కించాడు. ప్యారలల్ లైఫ్ అనే ఒక విభిన్న కథతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. అయితే కథ కొత్తగా ఉన్నప్పటికీ కథనంలో క్లారిటీ లేకపోవడం ఈ సినేమాకి అతి పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ ని ఎంతో ఆసక్తిగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆసక్తికర ట్విస్టులతో ప్రేక్షకులని కట్టిపడెయ్యలేకపోయాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీని పెంచిన దర్శకుడు.. అదే క్యూరియాసిటీని చివరిదాకా మైంటైన్ చెయ్యలేకపోయాడు. ప్యారలల్ స్క్రీన్ ప్లే అనే అంశం కొత్తది, పరిచయం లేని ఇద్దరి జంట జీవితాలు ఒకే విధంగా ప్రయాణించడం.... ఒక జంటకి జరిగినదే మరో జంటకీ జరగడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. కానీ కథలో కనిపించినంత కొత్తదనం కథనంలో ఏ మాత్రం కనిపించదు. అసలు సీరత్ కపూర్ మరణానికి కానీ.. ఆ విషయం వెనుకదాగిన సీక్రెట్ సురభికి తెలియడానికి లాజిక్ ఉన్నా ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల ప్రేక్షకుడు సినిమాలో లీనమవ్వలేడు. అయితే అతి తక్కువ క్యారెక్టర్లతో దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. నలుగురి జీవితాలను, ఒక యాక్సిడెంట్‌కు ముడిపెట్టిన తీరు అభినందనీయం.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్ ఎస్సెట్. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశంలోని ఎమోషన్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో 100 % సక్సెస్ అయ్యాడు. కానీ మణిశర్మ అందించిన సంగీతం మాత్రం ఆకట్టుకునేలా లేదు. పాటల విషయానికి వచ్చేసరికి మణిశర్మ సంగీతం తేలిపోయింది. శ్యామ్ కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించేలా వుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, బ్యాగ్రౌండ్ స్కోర్, కథ, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్: సంగీతం, కథనం, దర్శకుడు, సెకండ్ హాఫ్, క్లైమాక్స్
రేటింగ్: 2.5/5