నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అలీ,శివ బాలాజీ, మానస హిమవర్ష, అజయ్,రావు రమేష్, చేయితన్య కృష్ణ, కమల్ కామరాజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
నిర్మాత: శరత్ మరార్
డైరెక్టర్: డాలి ( కిషోర్ కుమార్ పార్ధసారధి)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. పవన్ పేరులోనే ఒక ప్రభంజనం వుంది. రాజకీయాల్లో బిజీగా వున్నా పవన్ కొత్త ప్రయోగాలు చెయ్యకుండా హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి హిట్స్ కొట్టాలని భావించి వరుసగా సినిమాలు మొదలుపెట్టేస్తున్నాడు. అసలు పవన్ రీమేక్ చేసిన సినిమాలు చాలానే సూపర్ హిట్టయ్యాయి. కెరీర్ తొలినాళ్లలో 'తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, సుస్వాగతం' సినిమాలతో సూపర్ ఫామ్ లో కొచ్చిన పవన్ ఆ తర్వాత 'జానీ, గుడుంబా శంకర్, పులి, పంజా' వంటి చిత్రాలతో ప్లాప్ ట్రాక్ లో పడ్డాడు. ఎన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ అతనికున్న అభిమానులు అంతకంతకు పెరుగుతున్నారు తప్ప తరగలేదు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని మళ్ళీ బాలీవుడ్ 'దబాంగ్' చిత్రాన్ని తెలుగులో 'గబ్బర్ సింగ్' గా రీమేక్ చేసి హిట్ కొట్టి నెంబర్ 1 హీరో పొజిషన్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం పవన్ ని టాలీవుడ్ లో అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది. అతని నటన, ఫాలోయింగ్, క్రేజ్ వంటివి పవన్ ని ఇండస్ట్రీలో టాప్ ప్లేసులో నిలబడేలా చేశాయి. అయితే 'అత్తారింటికి దారేది' తర్వాత పవన్ చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' అట్టర్ ప్లాప్ అవడం... ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల పాలవడంతో వారిని సేవ్ చేద్దామని తమిళ 'వీరం' చిత్రాన్ని తెలుగులో 'కాటమరాయుడు' గా రీమేక్ చేసాడు. ఈ చిత్రాన్ని డాలీ డైరెక్షన్ లో చేసిన పవన్ ఇంతకుముందే ఆ డైరెక్టర్ తో 'గోపాలా గోపాలా' చిత్రం చేసాడు. ఆ చిత్రం కూడా బాలీవుడ్ హిట్ చిత్రానికి రీమేక్. మరి మళ్ళీ ఇప్పుడు పవన్ తమిళ 'వీరం' చిత్రాన్ని తెలుగులో 'కాటంరాయుడు'గా తెరకెక్కించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తనకి రీమేక్స్ బాగా కలిసొస్తాయనే విషయాన్ని మరోసారి రుజువు చెయ్యాలని తన లక్కీ హీరోయిన్ అయిన శృతి హాసన్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'కాటమరాయుడు'లో పవన్ కి జోడిగా చేస్తున్న శృతి హాసన్ పవన్ తో ఇంతకుముందే 'గబ్బర్ సింగ్' లో నటించింది. ఆ చిత్రం సూపర్ హిట్. అలాగే 'కాటమరాయుడు' చిత్రానికి సంగీతం అందిస్తున్న అనూప్ రూబెన్స్ సంగీతం కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సెన్సేషన్ కి శ్రీకారం చుట్టిన 'కాటమరాయుడు' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజునే సినిమా కథని అందరికి చెప్పేసిన పవన్ కళ్యాణ్ ఇందులో మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ ఉంటుందని చెప్పి ఉత్కంఠకు తెర లేపాడు. అలాగే తమిళ వీరం ను సేమ్ టు సేమ్ దించకుండా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించినట్టు హీరోయిన్ శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇక రీమేక్స్ తో హిట్స్ కొడుతూ తిరుగులేదని నిరూపించిన పవన్ కి ఈ కాటమరాయుడు చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో తెలియాలంటే సమీక్షలోకి దూకాల్సిందే.
కథ: ఒక గ్రామంలో చిన్న రైతుగా జీవించే రాయుడు( పవన్ కళ్యాణ్) వ్యవసాయంతో పాటే వ్యాపారరంగంలో కూడా రాణిస్తుంటాడు. ఎవరన్నా తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు రాయుడిది. వారిని పట్టుకుని తన స్టయిల్లో శిక్ష వేస్తుంటాడు. రాయుడికి నలుగురు తమ్ముళ్లు ఉంటారు. వారు నలుగురూ నలుగురూ అమ్మాయిలతో ప్రేమలో పడతారు. కానీ రాయుడికి ప్రేమ అంటే పడదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అలాగే తమ్ముళ్ళకి పెళ్లి చేసే ఉద్దేశ్యం కూడా రాయుడికి ఉండదు. అసలు ఆడవాళ్ళ వాసనే రాయుడికి గిట్టదు. అలాంటి అన్నయ్యని మార్చి తమ ప్రేమ విషయం తెలిపి పెళ్లి ఎలా చేసుకోవాలో అర్ధం కాక తికమకలు పడుతుంటారు రాయుడు తమ్ముళ్లు. అయితే తాము పెళ్లిళ్లు చేసుకోవాలంటే తన అన్నయ్యని ఎలాగైనా ప్రేమలో దించాలని వారు ప్లాన్ చేస్తారు. అలా వారి ప్లాన్ లో భాగంగా అవంతిక (శృతి హాసన్) ని తమ ఆటలో పావులా వాడుకుంటారు వారు. ఇక రాయుడు కూడా క్రమేణా అవంతిక వైపు ఆకర్షితుడవుతాడు. కానీ అవంతిక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లో కొంతమంది రౌడీల వల్ల అవంతిక ఫ్యామిలీ మెంబెర్స్ భయపడుతుంటారు. అసలు అవంతిక ఫ్యామిలీకి వచ్చిన భయం ఏమిటి? అవంతిక ఫ్యామిలీని రాయుడు కాపాడగలడా? అసలు అవంతికతో రాయుడు నిజంగానే ప్రేమలో పడతాడా? తమ్ముళ్ల ప్రేమని రాయుడు ఒప్పుకుని వారికీ పెళ్లిళ్లు చేస్తాడా? అనేవి తెలియాలంటే ఖచ్చితంగా కాటమరాయుడు చిత్రాన్ని వెండితెర మీద వీక్షించాలసిందే.
నటీనటుల పనితీరు: సినిమా అంతా పవన్ తన భుజాలమీద మోశాడు అని అనడానికి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ పంచె కట్టు, లుక్, ఎంట్రీ, అభినయం ఒక్కటేమిటి కాటమరాయుడు ఆధ్యంతం పవన్ పెరఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ పవర్ ప్యాకెడ్ ఎనెర్జీ ఎంత చూసినా తక్కువే అనిపించేలా వుంది. ఇక శృతి హాసన్ సినిమా మొత్తం లంగా ఓణీ, చీరలతో సప్రాయపద్ధతిలో కనిపించి అలరించింది. కానీ సాంగ్స్ లో మాత్రం బాగానే అందాలు ఆరబోసింది. తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ లు ఇరగదీశారనే చెప్పాలి. అలీ కామెడీ అక్కడక్కడా బోర్ కొట్టిన పర్వాలేదనిపించింది. రావు రమేష్ , నాజర్ లు తమ పరిధిలో నటించారు. మానస హిమవర్ష నటన కూడా పర్వాలేదనిపించింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు డాలి విషయానికి వస్తే ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన చిత్రాన్ని తెలుగులో మళ్ళీ రీమేక్ చెయ్యడం అనేది కొంచెం సాహసోపేత నిర్ణయంగానే చెప్పాలి. తమిళ వీరం ని యాజిటీజ్ గా తెలుగులో దించేసాడనే చెప్పాలి. పెద్దగా మార్పులు చేర్పులు ఏమి చెయ్యకుండానే ఎలా ఉందొ అలానే తీసి కొద్దిగా నిరాశపరిచాడు. అయితే కొన్ని సీన్స్ మినహా దర్శకుడు డాలి కొత్తగా ప్రయత్నించిందేమీలేదనే విషయం తెలుస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే అనూప్ రూబెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని బాగా అందించాడు. కానీ పాటల విషయానికొచ్చేసరికి కొంచెం నిరాశపరిచాడనే చెప్పాలి. ఒక్క కాటమరాయుడు టైటిల్ సాంగ్ కి వున్న పవర్ ఫుల్ మ్యూజిక్ మారే ఇతర పాటకి లేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కాటంరాయుడుకి పెద్ద హైలెట్. డైలాగ్స్ పరంగా కాటమరాయుడు పర్వాలేదనిపించాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా వున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ లో ఉన్న కామెడీ, స్పీడ్ సెకండ్ ఆఫ్ లో తగ్గడం సెకండ్ అఫ్ లెంత్ కొద్దిగా ఎక్కువడం సినిమాకి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయి.
విశ్లేషణ: తమిళ వీరం కి రీమేక్ ఈకాటమరాయుడు చిత్రం. కథలో కొత్తదనం ఏమాత్రం లేదు. తమిళ వీరం ని తెలుగులో వీరుడొక్కడే గా డబ్ చేసి ఎప్పుడో వదిలేశారు. ఆ వీరుడొక్కడే చిత్రాన్ని చాలామందే వీక్షించారు గనక... ఇప్పుడు కేవలం కాటమరాయుడు చిత్రాన్ని చూడాలనుకునే వారు కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఈ చిత్రాన్ని చూడాలి.మరి పవన్ కళ్యాణ్ యాక్షన్, కామెడీ, హీరోయిజం వంటి అంశాలతో కాటమరాయుడు బాగానే ఉందనిపిస్తుంది. కేవలం పవన్ పెరఫామెన్స్ మీదే ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగాలి. ఇప్పటికే విపరీతమైన పబ్లిసిటీ వచ్చి ఈచిత్రం భారీ లెవల్లో అమ్ముడైపోయింది. మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఈ చిత్రాన్నిఎంతవరకు నిలబెడుతుందో తెలియాలంటే ఒక వారం ఓపిక పట్టాలి. మరి క్లాస్ మాస్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన ఈ కాటమరాయుడు చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు బ్రహ్మ రధం పడతారో కూడా ఒక వారంలో తెలిసిపోతుంది. ఇప్పటికే పవన్ కాటమరాయుడు మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ని తిరగరాస్తుందని అంటున్నారు. ఇకపోతే తెలుగులో వీరుడొక్కడే చిత్రాన్ని చూడని వారికీ ఓవరాల్ గా ఈ కాటమరాయుడు మంచి మసాలా విందు అనేది మాత్రం నిజం.
ప్లస్ పాయింట్స్: పవన్ కళ్యాణ్, పవన్ నటన, పవన్ లుక్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్, శృతి హాసన్
మైనస్ పాయింట్స్: కథ, రీమేక్, సెకండ్ ఆఫ్, క్లైమాక్స్
రేటింగ్: 3 / 5