కిరాక్ పార్టీ మూవీ రివ్యూ

Update: 2018-03-16 09:55 GMT

బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్

నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, సిమ్రాన్, సంయుక్త హెగ్డే, వైవ రాఘవ్, రాకేండు మౌళి తదితరులు

సంగీతం: బి. అజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటింగ్: ఎం. ఆర్. వర్మ

నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

మార్చ్ నెల మొదలైంది థియేటర్స్ లో దాదాపు ఒక వారం వరకు బొమ్మ పడలేదు. ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమా చూడాలని తపన పడుతున్నారు. ఇక ఈ నెల తొమ్మిదిన మళ్ళీ థియేటర్స్ తెరుచుకున్నాయి కానీ... సరైన సినిమా మాత్రం పడలేదు. ఏదో విజయ దేవరకొండ ఫామ్ లో లేనప్పుడు నటించిన ఏమంత్రం వేసావే సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం ఒక మంచి సినిమా కోసం మొహం వాచిపోయారు. ఒకపక్క పరీక్షలు ఒక కొలిక్కి వచ్చేస్తున్నాయి.... మరోపక్క హైదరాబాద్ స్కూల్స్ కి సెలవలు. థియేటర్స్ లో చూస్తే సినిమా లేదు. సరిగ్గా ఇలాంటి టైం లోనే నిఖిల్ తన కిరాక్ పార్టీతో థియేటర్స్ లోకి దిగాడు. కన్నడ లో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో హీరో నిఖిల్ సిద్దార్ధ్ తెలుగులో రీమేక్ చేసాడు. మరి టీజర్, ట్రైలర్ తో మళ్ళీ హ్యాపీ డేస్ ని గుర్తు చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నిఖిల్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ అనే సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఆ సినిమా మొత్తం కాలేజ్ బ్యాగ్ద్రోప్ లోనే నడుస్తుంది. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు నిఖిల్ చేసిన కిరాక్ పార్టీ సినిమా చాలావరకు కాలేజీ బ్యాగ్ద్రోప్ లోనే కొనసాగుతుంది. మరి ఈ కాలంలో కాలేజ్ కుర్రోళ్లంటే పార్టీలు, పబ్బులు అంటూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాలేజీ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కిన ఈసినిమా కి కిరాక్ పార్టీ అని పేరు పెట్టారు అంటే... ఈ సినిమాలో కిర్రెక్కించే పార్టీ ఉంటుందన్నమాట. నిఖిల్ ఈమధ్యన కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు కన్నడ సూపర్ హాట్ సినిమాని రీమేక్ చేసి ఎలాంటి హిట్ కొట్టాడో... థియేటర్స్ లో సరైన సినిమా కోసం మొహం వాచిపోయిన ప్రేక్షకులకు ఈ కిరాక్ పార్టీ కిర్రెక్కించిందో... లేదా పార్టీ మూడ్ తెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కృష్ణ (నిఖిల్) అనే ఇక ఇంజినీరింగ్ స్టూడెంట్ కాలేజ్ లో జాయిన్ అయ్యాక తన సీనియర్స్ నుండి ఎటువంటి సమస్యలను ఎదుర్కున్నాడు అనే ఒక సింపుల్ లైన్ తో సినిమాని నడిపించాడు దర్శకుడు. కృష్ణ ఎప్పుడూ జూనియర్ల తరఫున నిలబడి సీనియర్ల ర్యాగింగ్ కి అడ్డుగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.కృష్ణకి ఆరుగురు స్నేహితుల బ్యాచ్ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్(సిజ్జు) కూతురు సీనియర్ స్టూడెంట్ మీరా(సిమ్రన్)తో కృష్ణకు పరిచయం మొదలవుతుంది. అయితే మీరా సెక్స్ వర్కర్ లైఫ్ గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉంటుంది. ఒక రాత్రి అనుకోకుండా ఫ్రెండ్స్ తో చేసుకున్న పార్టీలో మీరా ప్రమాదానికి గురై చనిపోతుంది. బాగా డిస్టర్బ్ అయిన కృష్ణ అప్పటి నుంచి మొరటుగా మారిపోతాడు. చివరి సంవత్సరంలో ఉన్న కృష్ణను తన జూనియర్ సత్య(సంయుక్త హెగ్డే) ఇష్టపడుతుంది. కాలేజీ ఎలక్షన్స్ లో కృష్ణ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతాడు. మరి మీరాని మర్చిపోయి కృష్ణ సత్యాన్ని ఇష్టపడతాడా? అసలు మీరా ఎలా చనిపోతుంది? కాలేజ్ తర్వాత కృష్ణ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ

యూత్ ని కాలేజ్ కుర్రోళ్లని టార్గెట్ చేసుకుని తెరక్కేకించిన సినిమా ఈ కిరాక్ పార్టీ. నిఖిల్ ఎప్పుడూ తనదైన స్టైలిష్ కామెడీతో... సీరియస్ లుక్ తో తనకు సరిపోయే కథలను మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా ఒక కాలేజ్ కుర్రాడిలా నిఖిల్ నటించాడు. తర్వాత తాను సీనియర్ స్టూడెంట్ అయ్యాక జూనియర్స్ తో అతని ప్రవర్తన ఎలావుంటుంది. అలాగే కృష్ణ జీవితంలోకొచ్చిన ఇద్దరు హీరోయిన్స్ ని కృష్ణ ఎలా హ్యాండిల్ చేసాడు. ర్యాగింగ్, ఎగ్జామ్స్, స్టూడెంట్ రాజకీయాలు ఇలా కిరాక్ పార్టీ సినిమా కథ సాగుతుంది.

నటీనటుల నటన:

నిఖిల్ కృష్ణగా స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళు అదే టైం లో బాధ్యతలను కూడా క్యారీ చేసే కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారో.. అచ్చం అలానే నటించి మెప్పించాడు. కిరాక్ పార్టీ సినిమా మొత్తం నిఖిల్ కేరెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ కాలేజ్ యూత్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. నిఖిల్ కేరెక్టర్ లో కాలేజ్ స్టూడెంట్స్ తమని తాము చూసుకుంటారు. ఫస్ట్ హాఫ్ లో చాక్లెట్ బాయ్ లా... సెకండ్ హాఫ్ లో రెబల్ లా నిఖిల్ నటన సూపర్బ్. ఒక స్టూడెంట్ గా, ప్రేమికుడిగా, స్టూడెంట్స్ నాయకుడిగా నిఖిల్ నటన బావుంది. ఇక హీరోయిన్స్ గా నటించిన సిమ్రాన్, సంయుక్తాలు ఉంన్నంతలో మెప్పించారు. కాకపొతే వీరి కేరెక్టర్స్ ని దర్శకుడు రెగ్యులర్ హీరోయిన్స్ పాత్రలకు భిన్నంగా ఉండేలా డిజైన్ చేసాడు. ఈ సినిమాకి బ్రహ్మాజీ లాంటి సీనియర్లు బాగానే హెల్ప్ అయ్యారు. సిజ్జు, షియాజి షిండే మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు శరన్ కొప్పిశెట్టి కేవలం యూత్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. అయితే దర్శకుడు టేకింగ్ ను పూర్తిగా జడ్జ్ చేసే అవకాశం ఈ సినిమాలో ఎక్కడా కనబడదు. కన్నడ సినిమాని తెలుగులో రీమేక్ చేసాడు కాబట్టి ఎక్కడా మార్పులు చేయకుండా కొద్దిగా ట్రిమ్ చేసి మక్కికి మక్కి దించేసినట్లు ప్రతి సీన్ లో కనబడుతుంది కాకపోతే శరణ్ ఈ సబ్జెక్టు టార్గెట్ చేసిన యూత్ ని కన్విన్స్ చేయటంలో మాత్రం ఓ మాదిరిగా సక్సెస్ అయ్యాడు కాని పూర్తిగా మాత్రం కాదు. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో హ్యాపీ డేస్ సినిమా ది చాలా ప్రత్యేక స్థానం. మొదటినుండి నిఖిల్ ఈ సినిమా హ్యాపీ డేస్ లాగే ఉంటుందని హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. నిఖిల్ చెప్పినట్టే ఈ సినిమా ఆద్యంతం హ్యాపీ డేస్ నే గుర్తుకు తెస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా అల్లరి చిల్లరి సరదా లైఫ్ మొదలు పెట్టిన ఓ కుర్రాడు తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిల వల్ల జీవితాన్ని మార్చుకోవడం అనే కాన్సెప్ట్ ని రెండున్నర గంటల పాటు ఎంటర్ టైనింగ్ గా తీయడం మాటలు కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం జూనియర్, సీనియర్ ర్యాగింగ్, ఫ్రెండ్ షిప్, హీరోహీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో సరదాగానే సాగుతుంది.ఇక సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలతో నింపేసి కామెడీ ని ట్రాక్ నుండి తప్పించెయ్యడం ప్రేక్షకుడికి మింగుడు పడని విషయం.

ఇక టెక్నీకల్ గా చెప్పుకోవాలంటే.... సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందు మొండేటి డైలాగ్స్ ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేదనే చెప్పాలి. మరి మల్టీ టాలెంటెడ్ సుధీర్, చందు లు కలిసారు అంటే కిరాక్ పార్టీలో ఏమైనా అద్భుతాలు జోడించారేమో అని ఆశిస్తాం కాని అదేమీ లేదు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ పరంగా పర్వాలేదనిపించినా.... పాటలు ఓ అన్నంత లేవు. కేవలం రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రాఫర్ అద్వైత గురు మూర్తి కెమెరా చక్కగా ఉంది. కాలేజీ వాతావరణాన్ని చాలా అందంగా ఆకట్టుకునేలా చూపించాడు. ఎడిటింగ్ లో చాలా మార్పులు చేర్పులు అవసరమయ్యేవి. ఈ సినిమాకి ఎడిటింగ్ మైనస్ పాయింట్. నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

ప్లస్ పాయింట్స్: నిఖిల్, కొన్ని కామెడీ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్, లవ్ ట్రాక్, స్క్రీన్ ప్లే,ఎడిటింగ్, కన్నడ సినిమానే మక్కికి మక్కి దింపడం

రేటింగ్: 2.5/5

Similar News