'స్వామి రారా', ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విభిన్న కథలతో సూపర్ హిట్స్ కొట్టిన నిఖిల్, మరోసారి సరికొత్త కథ తో ‘కేశవ‘ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో నిఖిల్ కు స్వామి రారా వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ ఈ మూవీ ని తెరకెక్కించడం తో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ అదరగొడుతుందని అందరూ ఈ మూవీపై అంచనాలు పెంచుకున్నారు..చిత్ర కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉందని ట్రైలర్ లోనే చూపించడం తో ఈ మూవీ కి ఎక్కడా లేని హైప్ ఏర్పడింది. ఒక వైపు బాహుబలి బాక్సాఫీస్ భరతం పడుతున్నా.. తమ సినిమాలో వున్నా కంటెంట్ పై వున్నా నమ్మకంతో అత్యధిక థియేటర్స్ లో కేశవ విడుదలైంది. కుడివైపు గుండె కాన్సెఫ్ట్ తో కొత్తగా రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాతో నిఖిల్ మరో హిట్ అందుకున్నాడా? స్వామి రా రా లో అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న సుధీర్ వర్మ ఈ సినిమాని ఈ రేంజ్ లో తెరకెక్కించాడా? అసలు ఇది బాక్సాఫీస్ వద్ద నిలబడే సినిమాయేనా? అనేది మన రివ్యూ లో తెలుసుకుందాం.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా , ఓ విభిన్న కథా చిత్రం అనగానే మన దర్శకుల ఫోకస్ ఎక్కువగా హీరోపైనే ఉంటుంది. హీరోకి ఏదైనా డిసీజ్ పెట్టి దానిపైన సినిమాని రన్ చేద్దాం లేదా ఓ మర్డర్ మిస్టరీని మిస్టరీగా తీద్దాం వంటి ఆలోచనలే వస్తాయి. అలా వచ్చిన ఆలోచనే ఈరోజు విడుదలైన కేశవ. కేవలం హీరో క్యారెక్టర్ పేరునే టైటిల్‌గా పెట్టారు తప్ప టైటిల్ ద్వారా ఏమీ చెప్పాలనే ప్రయత్నం చెయ్యలేదు. ఈ సినిమా గురించి మొదటి నుంచీ చెప్పుకుంటూ వస్తున్నట్టుగానే ఇది ఓ రివెంజ్ డ్రామా. ఏ కథలోనైనా హీరో.. విలన్‌పై లేదా విలన్లపై పగ తీర్చుకోవాలనుకోవడానికి ఓ బలమైన రీజన్ ఉంటుంది. హీరోకి అన్యాయం చేసిన వారిని చంపి తీరాల్సిందే అని ఆడియన్స్ కూడా ఫీల్ అయిన సందర్భాల్లోనే హీరో ఏం చేసినా విజిల్స్ వేస్తారు. అయితే ఇందులో కేవలం పగ తీర్చుకోవడానికి హీరోకి ఒక రీజన్ కావాలి కాబట్టి పోలీసుల వల్ల హీరోకి అన్యాయం జరిగినట్టు చూపించడం జరిగింది. ఓ యాక్సిడెంట్‌లో తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన పోలీసుల్ని వరసగా చంపుకుంటూ పోవడమే కేశవ ప్రధాన ఇతివృత్తం. ఎలా చంపాడు? పోలీస్ లకు ఎటువంటి క్లూ లేకుండా చంపడం అనేదే ఇక్కడ కొత్త పాయింట్. మిగతా అంటా రొటీన్ గా ఉంటుంది.
నిఖిల్ అంటే ఇప్పటి వరకు లవర్ బాయ్ గానే అందరు ఇష్టపడతారు. యెంత విభిన్న కథ అయినా నిఖిల్ కి మాత్రం సినిమాలో అమ్మాయిల వెంట పడే పాత్ర మాత్రం ఉంటుంది. కానీ ఈ సినిమాలో మొదటి నుండి చివరి వరకు సీరియస్ మూడ్‌లోనే వుండే క్యారెక్టర్ చేశాడు నిఖిల్. సినిమా మొత్తంలో అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా తక్కువ. కేశవ క్యారెక్టర్‌కి తగ్గట్టు నిఖిల్ అభినయం బావుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి అస్సలు పనిలేదు. హీరోయిన్ వుండాలి కాబట్టి వుంది అన్నట్టుగా రీతూవర్మతో ఆ క్యారెక్టర్ చేయించారు. ఆమె పెర్‌ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీరియస్ మూడ్‌లో వెళ్తున్న కథలో వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి, మధుసూదన్ వంటి ఆర్టిస్టులు అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశారు. కొంత వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కేశవ చేసే హత్యల మిస్టరీని ఛేదించేందుకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ షర్మిలగా ఈషా కొప్పికర్ పెర్‌ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడతాయి. ఆమె పెర్‌ఫార్మెన్స్‌కి, అనసూయ చెప్పిన డబ్బింగ్ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. కార్తికేయ లో లానే రెండు వేరియేషన్స్ కలిగి వున్న రావు రమేష్ క్యారెక్టర్ ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన నటులంతా వారికీ ఇచ్చిన సీన్స్ కి న్యాయం చేసే ప్రయత్నం చేసారు.
సాంకేతిక నిపుణుల వరకు వస్తే దివాకర్ మణి ఫోటోగ్రఫీ ఈ సినిమా కి హైలైట్. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని ఏరియల్ షాట్స్ చాలా అందంగా చెయ్యగలిగాడు. మ్యూజిక్ విషయానికి వస్తే సన్ని ఎం.ఆర్. ఈ చిత్రం కోసం చేసిన పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. ప్రశాంత్ పిళ్ళై ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా సీన్స్ ని ఎలివేట్ చేసింది. ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ కూడా మంచి గ్రిప్పింగ్‌గా వుంది. సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. పాటల కోసం, ఫైట్స్ కోసం ఫారిన్ లొకేషన్స్‌కి వెళ్ళకపోయినా వున్నంతలో సినిమాని రిచ్‌గా చెయ్యడంలో అభిషేక్ పిక్చర్స్ సక్సెస్ అయింది. డైరెక్టర్ సుధీర్‌వర్మ గురించి చెప్పాల్సి వస్తే నిఖిల్‌తో చేసిన మొదటి సినిమాలో వున్నంత విషయం ఈ సినిమాలో లేదనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. హీరోకి గుండె కుడివైపున వుంటుందని, దానివల్ల ఎక్కువ ఆవేశపడితే చనిపోతాడని స్టార్టింగ్‌లో చెప్తారు. అయితే దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు సినిమాలో ఎక్కడా అనిపించదు. ఇక హీరో పోలీసులకు దొరక్కుండా చాలా అలవోకగా హత్యలు చేసుకుంటూ వెళ్తుంటాడు. పోలీసులకు మాత్రం ఎలాంటి క్లూ దొరకదు. ఈ హత్యలు చేసే ప్రాసెస్ అంతా హీరోకి ఫేవర్‌గానే జరుగుతూ వుంటుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌కి హీరోని అరెస్ట్ చెయ్యడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో అందరూ ఈజీగా ఊహించేలా వుంది. హత్యల కేసులో అరెస్ట్ అయిన హీరో అంతే సునాయాసంగా నిర్దోషిగా విడుదలై వస్తాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోదగినవి హీరో పెర్‌ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ మాత్రమే. స్లో నేరేషన్, ప్రధాన ఇతివృత్తంలోనే లోపాలు వుండడం, హీరో, హీరోయిన్ మధ్య అసలు లవ్ ట్రాక్ అనేదే లేకపోవడం, పూర్తిగా రెండు గంటలు కూడా లేని సినిమాని మూడు గంటల సేపు చూస్తున్న ఫీలింగ్ కలగడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే వరసగా హిట్స్ కొడుతూ వస్తున్న నిఖిల్‌కి నిరుత్సాహాన్ని అయితే కేశవ ఇవ్వదు కానీ వాటంత పేరుని మాత్రం తీసుకురాలేదు. రివెంజ్ డ్రామాలో వుండాల్సిన స్పీడ్ లేకపోవడం వల్ల, కథ, కథనాల్లో అనేక లోపాలు వుండడం వల్ల కేశవ బాక్సాఫీస్ వద్ద ఓ రెండు వారాల సినిమాగానే మిగిలిపోతుంది.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే: హీరో గుండే కాదు..ఈ కథ కూడా అంతే..!
రేటింగ్: 2.5/5