ఖాకీ మూవీ రివ్యూ

Update: 2017-11-17 09:56 GMT

ప్రొడక్షన్ హౌస్: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ , రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

న‌టీన‌టులు: కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, అభిమ‌న్యుసింగ్‌, బోస్ వెంక‌ట్‌, సురేంద‌ర్ ఠాకూర్ త‌దిత‌రులు

సంగీతం: జిబ్రాన్‌

నిర్మాత‌: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా

ద‌ర్శ‌క‌త్వం: హెచ్‌.వినోద్‌

కార్తీ తమిళ హీరో అయినప్పటికీ.. అతనికి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఎందుకంటే కార్తీ తాను తమిళంలో నటించిన ప్రతి సినిమాని ఇక్కడ తెలుగులో కూడా విడుదల చేస్తుంటాడు. అంతేకాకుండా గత ఏడాది తెలుగులో స్ట్రయిట్ గా నాగార్జున తో కలిసి 'ఊపిరి' అనే మల్టీస్టారర్ సినిమాలో నటించి మెప్పించాడు. 'ఊపిరి' సినిమాలో కార్తీ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంత నేచురల్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తర్వాత కార్తీ.. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ లో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించాడు. అదే సినిమాని తెలుగులో 'ఖాకీ' అనే పేరుతొ విడుదల చేస్తున్నాడు కార్తీ. 'ఖాకి' సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ తో కార్తీ రొమాన్స్ కూడా ఈ సినిమాకి హైలెట్ కానుంది. ఈ వారం తెలుగులో దాదాపు 9 సినిమాలు విడుదలవుతున్నాయి లెక్కచెయ్యకుండా తమ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో కార్తీ ఈ శుక్రవారమే ప్రేక్షకులముందుకు వచ్చేసాడు. మరి తెలుగు తమిళంలో ఏకకాలంలో విడుదలైన 'ఖాకి' సినిమాతో కార్తీ - రకుల్ ప్రీత్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నారో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ధీరజ్(కార్తి) పోలీస్ ట్రైనింగ్ తరువాత తమిళనాడులో ఓ ప్రాంతంలో డీఎస్పీగా ఛార్జ్ తీసుకుంటాడు. ధీరజ్ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే.. ప్రియా(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏంటో నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ భార్య ప్రియను ప్రేమగా చూసుకునే ధీరజ్ జీవితాన్ని ఓ కేసు మలుపు తిప్పుతుంది. కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఇళ్లలోకి చొరబడి అతి క్రూరంగా అందరినీ చంపేస్తుంటారు. ఈ కేసుని పరిష్కరించాలని సొంతంగా నిర్ణయించుకుంటాడు ధీరజ్. వేలిముద్రల సహాయంతో వాళ్లను పట్టుకోవాలనుకుంటాడు. కానీ అతడికి ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ క్రమంలోనే ఓంవీర్ సింగ్(అభిమన్యు సింగ్) ఆద్వర్యంలోని దొంగలు ముఠా ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి ఎమ్యెల్యేని చంపేస్తారు. ఆ దొంగల ముఠాని పట్టుకునే బాధ్యతను ధీరజ్‌కు అప్పగిస్తుంది ప్రభుత్వం. అసలు పోలీస్ లంటే భయం లేకుండా దొంగలు అంతలా దొంగతనాలు ఎలా చేయగలిగారు? మరి ధీరజ్ ఎలాంటి ప్లాన్స్ తో ఆ దొంగల ముఠా ఆట కట్టించాడు? కరుడు కట్టిన నేరగాళ్ళను ధీరజ్ ఎలా మట్టు పెట్టాడు? అనే విషయాన్నీ ఖాకి చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పాత్ర:

ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా నటించే కార్తి ఈసారి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనలో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు. ప్రతి సన్నివేశంలో చక్కటి నటనను కనబరిచాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో కార్తి కాంబినేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. రకుల్, కార్తి మధ్య లవ్ ట్రాక్ మరీ అవసరం అనిపించేది కాకపోయినా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచిస్తే ఈ మాత్రం అవసరమే కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు. ఇక స్పైడర్ తో తమిళంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఖాకీ తో హిట్ అందుకునట్టే కనబడుతుంది. ఖాకీలో రకుల్ ప్రియా పాత్రలో తన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తుంది. బోస్ వెంకట్.. కార్తి టీంలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అభిమన్యు సింగ్ విలన్ పాత్రలో చాలా క్రూరంగా కనిపిస్తాడు. విలన్ గా అభిమన్యు సింగ్ తనకు అలవాటైన పాత్రే చేసాడు కాని బ్యాక్ డ్రాప్ కొత్తది కావడంతో మొనాటనీ అనిపించదు. సపోర్టింగ్ రోల్స్ లో లక్ష్మికాంతన్ , రోహిత్, సురేందర్ ఎవరికి వారు చక్కగా సెట్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు వినోద్‌ ఈ మధ్య కాలంలో ఎవరు అటెంప్ట్ చేయని ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ పోలీస్ స్టొరీని ప్రెజెంట్ చేసాడు. కథగా చూస్తే ఖాకీ ఒక మామూలు కథ. కాని దర్శకుడు ముసుగు దొంగలు అనే థ్రెడ్ మీద వాళ్ళు చేసే దొంగతనాలు, హత్యలు, వాటి నేపధ్యం, తప్పించుకోవడం గురించి చాలా రీసెర్చ్ చేసినట్టు సినిమా చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. కార్తి క్యారెక్టర్ ని మలచిన తీరు, ఆ పాత్రకు ఉండాల్సిన కసిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా డెవెలప్ చేసిన బ్యాక్ డ్రాప్ మొత్తం అద్భుతంగా కుదిరాయి. ఇక ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా నడిచిన దర్శకుడు వినోద్ ప్రీ ఇంటర్వెల్ నుంచి తన విశ్వరూపం చూపించాడు. క్రిమినల్స్ తో పోలీసుల యాక్షన్ సీక్వెన్స్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. దుండగుల కోసం పోలీసులు వారి ప్రాంతానికి వెళ్లినప్పుడు అందరూ ఏకమై పోలీసుల మీద దాడి చేయడం, పోలీసులు ఆ పరిస్థితులను ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. రాజస్తాన్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన నేటివిటీని చూపించిన వినోద్ హోం వర్క్ కి హాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దర్శకుడు ఖాకి ని రేసీ స్క్రీన్ ప్లే తో కథను మరో స్థాయికి తీసుకెళ్లాడు.

టెక్నీకల్ గా....

గిబ్రాన్ అందించిన పాటలు సో సో గానే ఉన్నప్పటికీ బ్యగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సత్యన్ సూర్యాన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం. సినిమాటోగ్రఫీ వర్క్, సిజి వర్క్ అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది . ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:

కార్తీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ ఎపిసోడ్, రకుల్ లుక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

రొమాంటిక్ ట్రాక్, తెలుగు నేటివిటీ, సీరియస్ నెస్ ఎక్కువ అవడం, అభిమన్యు సింగ్

రేటింగ్: 3 .0 /5

Similar News