నటీనటులు: మంచు మనోజ్, ప్రగ్య జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోట శ్రీనివాస్ రావు, పృథ్వి తదితరులు..
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ వసంత్
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య
'శ్రీ' తో కెరీర్ ని స్టార్ట్ చేసిన మంచు మనోజ్ ఇప్పటివరకు యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టార్ స్టేటస్ కాకుండా వెరైటీ గా తనకు నచ్చిన రీతిలో మంచి ఎనెర్జీతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు తప్ప హిట్ వచ్చిందా? లేక ప్రేక్షకులకి నచ్చిందా? అనేది ఆలోచించకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు. అయినా కూడా మోహన్ బాబు పెద్ద నటుడు కాబట్టి తండ్రి పేరును వారసత్వంగా వాడుకుందామనుకున్నా టాలెంట్ లేనిదే పైకి రావడం కష్టమని ఇప్పుడున్న హీరోలను చూస్తే అర్ధమైపోతుంది. అయినా హీరోగా నిలబడాలని తపనతోనే మనోజ్ సినిమాలు చేసుకుంటూ యావరేజ్ హిట్స్ తో నెట్టుకొచ్చేస్తున్నాడు. అయితే 'వేదం, ప్రయాణం, నేను మీకు తెలుసా..' వంటి చిత్రాలు మనోజ్ లోని నటుడిని బయటికి తీసినా మళ్ళీ మాస్ చిత్రాల వెంట పడడంతో మనోజ్ కి మాస్ ముద్ర పడిపోయింది. అయితే మనోజ్ లో శ్రమించే గుణం ఎక్కువ అనే విషయం తెలిసిందే. సొంతంగా ఫైట్స్ ను చేసుకుంటూ సినిమా నిర్మాణంలో నిర్మాతకు డబ్బులు మిగిల్చి పెట్టె మనోజ్ తనకి ఒక మంచి సినిమా పడితే తన రేంజ్ మారిపోతుందని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఇక ఇప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో 'గుంటూరోడు'తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో ఈ రోజు థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఇక హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ఇప్పటివరకు గ్లామర్ ప్రాధాన్యం వున్నా పాత్రల్లో నటించలేదు.ఈ గుంటూరోడులో మాత్రం తన అందచందాలతో గ్లామర్ షో చేసిందని ట్రైలర్స్, సాంగ్స్ లో చూస్తుంటే అర్ధమవుతుంది. నా రాకుమారుడు వంటి చిత్రం చేసిన ఎస్. కె. సత్య చెప్పిన కథ, మనోజ్ కి విపరీతంగా నచ్చడం తో ఈ సినిమా చేసినట్లుగా మనోజ్ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ సత్య కూడా ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చిన ప్రోమోస్ కూడా సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి ని కలిగించాయి. మరి ప్రేక్షకుల ఆసక్తి. .సినిమా కి ఎటువంటి రిజల్ట్ ని ఇచ్చిందో, అసలు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏమిటో మనం సమీక్ష లో తెలుసుకుందాం.
కథ: తల్లిని కోల్పోయిన కొడుకు కన్నా (మనోజ్) అంటే సూర్యనారాయణ రావు(రాజేంద్రప్రసాద్)కి చాలా ఇష్టం. అయితే కన్నా మాత్రం తండ్రి అతి గారాబంతో అందరితో గొడవలు పడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇక హ్యాపీగా ఉన్నప్పుడు డాన్స్ చెయ్యడం... కోపం వచ్చినప్పుడు చెయ్యి దురద పుట్టి గొడవ పడిన వారిని కొట్టడడం వంటివి చేస్తుంటాడు. అయితే కొడుకు ఇలా అందరితో గొడవలు పడడం నచ్చని సూర్యనారాయణ పెళ్లి చేస్తే అయినా దారిలో పడతాడని.. కన్నా కి ఒక సంబంధం చూసి పెళ్లి చూపులకి తీసుకెళతాడు. అయితే కన్నాకు పెళ్లి కూతురు పక్కన ఉన్న ఆమె ఫ్రెండ్ క్రిమినల్ లాయర్ శేషు చెల్లెలు అమృత(ప్రగ్యా జైస్వల్) నచ్చుతుంది. ఇక ఆమె ప్రేమలో పడ్డ కన్నా ఆమె కోసం ఏమైనా చెయ్యాలనే రేంజ్ కి చేరుకుంటాడు. కానీ క్రిమినల్ లాయర్ శేషుకి మాత్రం తనని ఎదురించే వాళ్లంటే అస్సలు నచ్చదు. అలాంటి వారిని ఏదో ఒక కేసులో ఇరికించేస్తుంటాడు. ఒకొనొక సమయంలో శేషుకి కన్నాకు మధ్యన గొడవ జరుగుతుంది. ఇక ఆ గొడవలో భాగంగా కన్నాని శేషు నానా ఇబ్బందులకు గురి చేస్తాడు. మరి కన్నా వాటిని ఏ విధంగా ఎదుర్కొంటాడు? శేషుని ఎదిరించి అమృతని దక్కించుకున్నాడా? అసలు శేషుకి కన్నాకు మధ్యన గొడవేంటి? అనేది తెర మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: మనోజ్ ఎప్పటిలాగే ఎనేర్జి తో రెచ్చిపోయాడు. సొంతంగా కంపోజ్ చేసిన ఫైట్స్ తో మనోజ్ వీరలెవెల్లో నటించేసాడు. మనోజ్ డాన్స్ ల్లో కూడా పర్వాలేదనిపించాడు. మంచి బాడీ లాంగ్వేజ్ తో మనోజ్ బాగానే ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే ప్రతిభ కనబర్చాడు. విలన్ గా సంపత్ ఆ కేరెక్టర్ కి న్యాయం చేసాడు. కోపంలో అతను చేసే పనులు ఇంట్రెస్ట్ ని కలిగిస్తాయి. ఇక హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టేలా గ్లామర్ షో చేసింది. ఇక ప్రగ్యా కేవలం అందచందాలతోనే కాకుండా నటనలో కూడా మంచి ప్రతిభ కనబరిచి అమృత క్యారెక్టర్ కి న్యాయం చేసింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు: ఒక మాస్ కథను ఎలా తెరకెక్కించాలో దర్శకుడు కె సత్య అలాగే స్క్రీన్ మీద ప్రెసెంట్ చేసాడు. ఇక సత్య అనుకున్న కేరెక్టర్ కి మంచు మనోజ్ కూడా న్యాయం చేసాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో కామెడీకి స్కోప్ లేకపోవడం తో అంతా మాస్ వాసనే కొట్టడం దీనికి అతి పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో కామెడీ కి అసలు ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం మాస్ ద్వారానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామనుకున్న దర్శకుడికి ఇది ఎదురు దెబ్బె అని చెప్పాలి. ఇక మాటలు యూత్ కి దగ్గరగా రాసుకుని వారికీ బాగా కనెక్ట్ అయ్యేలా చూసిన సత్య హాస్యానికి ప్రాధాన్యతనివ్వకపోవడం అనేది ప్రధమ తప్పిదం గా భావించాలి . ఇక పాటలు ఏ విధంగాను ఆకట్టుకొనేలా లేవు. కేవలం ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో తప్ప. శ్రీ వసంత్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పుడో ఎక్కడో విన్నట్టు వుంది. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు ఒకే.
ప్లస్ పాయింట్స్: మనోజ్, ప్రగ్యా, పవర్ ఫుల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్: దర్శకుడు, కామెడీ, పాటలు, కథ, క్లైమాక్స్
రేటింగ్: 2 .25 /5