ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్ మెంట్...
నటీనటులు : బాలకృష్ణ., శ్రేయా శరణ్., హేమామాలిని., కబీర్ బేడి., తనికెళ్ల భరణి తదితరులు
దర్శకుడు : క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ)
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్
సంగీతం : చింతన్ భట్
ఆర్ట్ : మహేష్ భూపతి
పాటలు : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
డైలాగ్స్ : బుర్రా సాయి మాధవ్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
సమర్పణ : బిబో శ్రీనివాస్
సహనిర్మాత : కొమ్మినేని వెంకటేశ్వరరావు.
నిర్మాతలు : వై.రాజీవ్ రెడ్డి., జాగర్లమూడి సాయిబాబు
నందమూరి నట విశ్వరూపం మరోసారి తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించింది. పౌరాణిక, చారిత్రక పాత్రల్లో తనకు తానే సాటి అని నందమూరి బాలకృష్ణ నిరూపించుకున్నారు. 100వ చిత్రంగా ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాతకర్ణి తెలుగు సినిమా స్థాయిని మరోసారి నిరూపించింది.
ముక్కలు చెక్కలై., అనైక్యతతో సతమతమవుతున్న భరత ఖండాన్ని ఏకం చేసేందుకు నడుం బిగించిన శాతకర్ణి.....రాజ్యాలను ఏకం చేస్తూ అఖండ భారతావని స్థాపనలో భాగంగా కళ్యాణ రాజ్యానికి దూతను పంపిస్తాడు. తన ఏలుబడిని ఒప్పుకుని సామంత రాజుగా సామ్రాజ్యంలో విలీనమవ్వాలని ప్రతిపాదిస్తాడు. అందుకు ఒప్పుకోని కళ్యాణ రాజు పరిథస్..... శాతకర్ణి దూతను బంధిస్తాడు. దీంతో ఇరు పక్షాల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. కళ్యాణ రాజ్యాన్ని జయించిన ఉత్సాహంతో శాతకర్ణి తన దండయాత్ర కొనసాగిస్తాడు. కళ్యాణ రాజ్యాన్ని జయించిన తర్వాత మహారాణి వాసిస్టి దేవిని రాజ్యానికి ఆహ్వానిస్తాడు. బిడ్డ కడుపులో ఉండగా యుద్ధరంగానికి వెళ్లిన శాతకర్ణి, రాజ్యాలను జయించుకుంటూ ఇంటికి దూరమవడంపై వాసిస్టి దేవి అలకవహిస్తుంది. అదే సమయంలో శాతకర్ణి హవాకు అడ్డుకట్ట వేయాలని భావించిన మరాఠా రాజు నెహపానుడు, సామంత రాజ్యాల యువరాజుల్ని బంధించి వారి రాజ్యాలను బలవంతంగా ఆక్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే నెహపానుడ్ని తనకు తలొగ్గాలని శాతకర్ణి రాయబారం పంపడంతో, శాతకర్ణి కుమారుడ్ని పులోవిని తనకు అప్పగించాలని అవహేళన చేస్తాడు. పులోవిని నెహపాణుడికి అప్పగించేందుకు వాసిస్టి దేవి ససేమిరా అన్నా ఆమెను ఒప్పించి..., కుమారుడితో సహా యుద్ధ రంగానికి తరలివెళ్తాడు. నెహపానుడిపై దండెత్తే క్రమంలో అతని వద్ద బందీలుగా ఉన్న యువరాజుల్ని విడిపించే ఒప్పందంతో అయా రాజ్యాలు శాతకర్ణికి సహకరిస్తాయి.నెహపానుడి రాజ్యాన్ని జయించేందుకు తీవ్రంగా శ్రమిస్తాడు. ఇతర రాజ్యాల రాకుమారుల్ని విడిపించినా ,తన కుమారుడ్నినెహపాలుడు బందీగా చేసుకోవడం అతడిని వధించి అతని అల్లుడి వృషభదత్తుడ్ని సామంతుడిగా చేసుకోవడంతో ఓ అంకం ముగుస్తుంది. కోటి లింగాలలో పుట్టి, ముక్కలు చెక్కలుగా ఉన్న రాజ్యాలను ఏకం చేసుకుంటూ దూసుకుపోతున్న శాతకర్ణి రాజసూయ యాగాన్ని చేపడతాడు. యాగం చివర్లో తన విజయాలన్నింటికి చిహ్నంగా అగ్రతాంబులాన్ని రాజమాత గౌతమి దేవికి ఇవ్వాలని సంకల్పిస్తాడు. మహిళ., విధవరాలు అంటూ గౌతమీ దేవికి అగ్రస్థానం ఇవ్వడాన్ని సామంత రాజ్యాలు వ్యతిరేకించినా , రాజసూయంలో అగ్రస్థానం తన తల్లికే అని స్పష్టం చేసి అమరావతి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసి గౌతమి పుత్ర శాతకర్ణిగా ప్రకటించుకుంటాడు. నాటి నుంచే శాలివాహన శకం ప్రారంభమైందని అదే యుగాది అని పట్టాభిషేక వేదికపై ప్రకటిస్తాడు.
వరుసగా రాజ్యాలను జయించుకుంటూ పోతున్న శాతకర్ణికు అడ్డుకట్ట వేసేందుకు గ్రీకు రాజు డెమోత్రియస్ పన్నాగం పన్నుతాడు. శాతకర్ణి సామంతుడు కాంజీరాజు సహకారంతో కోటలోకి శత్రువుల్ని ప్రవేశపెట్టి అతడిని అంతమొదించేందుకు ప్రయత్నిస్తాడు. శత్రువుల కుట్రల నుంచి బయటపడిన శాతకర్ణి కుట్రదారులను కఠినంగా శిక్షిస్తాడు. డెమొత్రియస్‌ను ఓడించేందుకు శాతకర్ణిని వెళ్లవద్దంటూ వాసిస్టిదేవి అడ్డుపడుతుంది. కోటిలింగాలలో గౌతమీ దేవితో కలిసి చేసిన పూజలో దుశ్శకునాలు కనిపించాయని వారిస్తుంది. అఖండ రాజ్య స్థాపన స్వప్నాన్ని వాసిస్టి దేవికి వివరించి యుద్ధభూమికి వెళతాడు.ప్రత్యక్ష యుద్ధంలో శాతకర్ణిని ఓడించలేమని భావించిన డెమొత్రియస్...., శాతకర్ణి చేతిలో మరణించిన పరిథస్ భార్యను పావుగా వాడి శాతకర్ణిపై విషప్రయోగం చేయిస్తాడు. ఈ కుట్రలు కుతంత్రాలను జయించి అఖండ జంబూద్వీప రాజ్య స్థాప న స్వప్నాన్ని సాధించడంతో కథ ముగుస్తుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. రికార్డు సమయంలో చిత్రీకరణ పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో నిలిచిన శాతకర్ణి బాలయ్య అభిమానుల్ని పూర్తిగా అలరిస్తుంది. బాలయ్య తరహా మాస్ చిత్రాలకు భిన్నంగా రాజసం ఉట్టిపడేలా శాతకర్ణిలో ఆయన నటన ఉంటుంది.
భరత ఖండాన్నంతటిని ఏకం చేసి పాలించిన శాతకర్ణి వంటి చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎంచుకుని దర్శకుడు క్రిష్ గొప్ప సాహసమే చేశారు. శాతకర్ణి పాత్రలో బాలయ్య వీరవిహారం చేశారు. గౌతమీ దేవి పాత్ర హేమామాలిని., వాసిస్టి దేవిగా శ్రియా., నహపాణుడిగా కబీర్ బేడి అద్భుతంగా నటించారు. అఖండ రాజ్య స్థాపనలో భాగంగా జరిగిన యుద్ధాలు తెలుగు సినిమా స్థాయిని ఇంగ్లీష్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. వందల కొద్దీ గుర్రాలు., వేల సంఖ్యలో సైనికులు యుద్ధ క్షేత్రంలో తలపడే సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తాయి.
దర్శకుడి కలల నుంచి ఆవిష్కృతమైన శాతకర్ణి చిత్రం మొదట్నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. పోరాట దృశ్యాల చిత్రీకరణ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. హాలీవుడ్ స్థాయిలో పోరాటాలను చిత్రీకరించిన కాస్ట్యూమ్స్ ప్రేక్షకులకు పాత చిత్రాలను జ్ఞప్తికి తెస్తాయి. ట్రాయ్., 300 వంటి చిత్రాల్లో గ్రీకు యోధుల పాత్రలు., పోరాటాలు ప్రేక్షకుడి కళ్లముందు కదలాడుతాయి. ఝార్జియా., మొరాకో వంటి దేశాల్లో చిత్రీకరణ జరిగినా గ్రాఫిక్ వర్క్ హడావుడిగా చేసినట్లు అర్థమైపోతుంది. రికార్డు సమయంలో విడుదల చేసే హడావుడిలో ఈ పొరపాట్లు జరిగి ఉండవచ్చు. విదేశీ నటులతో చేసిన షూటింగ్ కూడా సినిమాకు కొంత మైనస్..... కథలోని ముఖ్య పాత్రలతో పాటు సాగే క్యారెక్టర్లలో ఎలాంటి హావభావాలు కనిపించవు. యుద్ధ రంగంలో కూడా అయా పాత్రల్లో ఒకే తరహా ఎమోషన్ కనిపిస్తుంటుంది. రౌద్రంగా ఊరకాల్సిన సన్నివేశాల్లో కత్తి యుద్ధాలు కూడా నీరసంగా సాగుతాయి. సినిమా లెంగ్త్‌లో అధిక భాగాన్ని ఆక్రమించే యుద్ధ సన్నివేశాలు పునరుక్తమైనట్లు కనిపిస్తాయి. సినిమా పాటల్లో సంగీతం ప్రేక్షకుల్ని అలరించినా నేపథ్య సంగీతం., ఆర్‌ఆర్ ట్రాక్‌లు అంతగా ఆకట్టుకోదు. మొత్తం మీద సంక్రాంతి వినోదాన్ని క్రిష్- బాలకృష్ణల చిత్రం సంపూర్ణంగా అందిస్తుంది.
రేటింగ్: 3.5 / 5