నటీనటులు: నందమూరి బాలకృష్ణ - శ్రియ సరన్ - హేమమాలిని - కబీర్ బేడి - మిలింద్ గుణాజీ - ఫరా కరిమి - తనికెళ్ల భరణి - శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: చిరంతన్ బట్
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: సాయిబాబా జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి
రచన - దర్శకత్వం: క్రిష్
గౌతమి పుత్ర శాతకర్ణి....
ఈ సినిమా తెరకెక్కుతుందని తెలియగానే ముందుగా వచ్చే సందేహం దీని కోసం ఏ బహుబలి లాగానో సంవత్సరాల తరబడి షూటింగ్ ఉంటుందని. కానీ సినిమా విడుదల అవడం, చూసేయడం కూడా జరిగిపోయింది. కచ్చితంగా ఇది బాలయ్య మాత్రమే చేయగలిగే సినిమా. తెలుగు పరిశ్రమలో పది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సినిమా. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీపడడం మరో ముఖ్యవిషయం. షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న నాటి నుంచి జనాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ.. ఎప్పటికప్పుడు కళ్లు చెదిరే ప్రోమోలతో ఆసక్తిని మరింత పెంచుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు వెండితెరను తాకింది. మరి నందమూరి బాలకృష్ణ-క్రిష్ కలిసి చేసిన ఈ బృహత్తర ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే...
ఇదో చారిత్రక కథాంశం. రాజులు, రాజ్యాల నాటి కథ. రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలకు సంబంధించి అమ్మ చెబుతున్న కథ వింటూ.. ముక్కలు ముక్కలుగా ఉన్న భరత ఖండాన్ని ఏకం చేయాలని చిన్నప్పుడే నిశ్చయించుకున్న బాలుడి కథ. అతడే శాతకర్ణి. పెద్దయ్యాక తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తాడు. ముందు దక్షిణ భారతాన్ని గెలిచి.. ఆపై ఉత్తర భారతంపైకి దండెత్తుతాడు. ఈ క్రమంలో తన కొడుకు ప్రాణాలకే ముప్పు వాటిల్లినా.. తన భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా వెనక్కి తగ్గడు. మొత్తం దేశాన్ని వశం చేసుకున్నాక పరాయి దేశస్థుల నుంచి శాతకర్ణికి సవాలు ఎదురవుతుంది. మరి ఈ సవాలును శాతకర్ణి ఎలా ఛేదించాడు. రణరంగంలో ఎలా విజేతగా నిలిచాడు అన్నది మిగతా కథ. కథా పరంగా విస్తరణ ఎక్కువగా లేకపోయినా యుద్ధవిన్యాసాలతో అలరించే సినిమా ఇది.
కథనం-విశ్లేషణ:
కథ కన్నా సంభాషణలతో ఆకట్టుకునే సినిమా ఇది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆరంభ సన్నివేశంలో ఒక సంభాషణ ఎలా సాగుతుందో చూద్దాం. తన పరాక్రమాన్ని గౌరవించి రాజ్యాన్ని అప్పగించమంటూ శాతకర్ణి పంపిన వర్తమానాన్ని అవతలి రాజుకు అందిస్తాడు దూత. అవతలి రాజుకు పౌరుషం వస్తుంది. దూతను ఉద్దేశించి ‘‘నిన్ను బంధిస్తే’’ అంటాడు అవతలి రాజు. ‘‘వారొస్తారు. నేను కారాగారంలో ఎదురు చూస్తుంటా’’ అని బదులిస్తాడు దూత. వెంటనే ‘‘నిన్ను వధిస్తే’’ అంటూ రెట్టించి అడుగుతాడు అవతలి రాజు. ‘‘మీరొస్తారు,నేను కాటికాడ ఎదురు చూస్తుంటా’’ అంటాడు దూత. ఈ సంభాషణతోనే అర్థమైపోతుంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్థాయి ఏంటో! బాహుబలి విజువల్ వండర్ గా తెరకెక్కింది. సినిమా విడుదైన రోజు పెదవి విరిచిన వారు ఉన్నారు. కానీ శాతకర్ణి విషయంలో అలాకాదు. బాగా తీశారు. బాలయ్య బాగా చేశాడు అని ఫ్రతి ఒక్కరూ ఫీలవుతారు. ఇది తెలుగు వారు గర్వించే చిత్రం అనడంలో సందేహం లేదు. విజువల్ గ్రాండియర్.. ఎఫెక్ట్స్.. నిర్మాణ విలువలు.. లాంటి అంశాల్లో ‘బాహుబలి’ కంటే వెనుక ఉండొచ్చు కానీ.. విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ‘బాహుబలి’ కంటే మిన్నగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉంది. సిన్సియర్ గా, సీరియస్గా ఈ కథను తెరకెక్కించాడు క్రిష్. శాతకర్ణి పాత్రకు తాను తప్ప ఇంకెవరూ ఊహలోకి కూడా రాని స్థాయిలో అద్భుత అభినయం ప్రదర్శించాడు బాలకృష్ణ. బాలయ్య మాత్రమే చేయగలిగే పాత్ర ఇది. శాతకర్ణి లక్ష్యం.. పోరాటం నేపథ్యంలోనే కథను నడిపించాడు క్రిష్. నేరుగా దక్షిణ భారతాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునే ఘట్టంతోనే శాతకర్ణి పరిచయ దృశ్యాన్ని ఆవిష్కరించాడు క్రిష్. ఆ తర్వాత మొత్తం భారతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడం.. చివరగా పరదేశీయులతో పోరాడి గెలవడంతో కథ ముగిసిపోతుంది.ఈ మధ్యలో సొంత కొడుకునే రణరంగంలోకి తీసుకెళ్లడం.. భార్యే శాతకర్ణితో తీవ్రంగా విభేదించడం.. ఈ నేపథ్యంలో భావోద్వేగాల నడుమ కథ నడుస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం కూడా శాతకర్ణి లక్ష్యంతో ముడిపడే ఉంటాయి.
సినిమాలో సగానికి పైగా నిడివి యుద్ధ సన్నివేశాలతోనే నిండిపోవడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకింత నిరుత్సాహానికి గురైనా మంచి సినిమా అన్న భావన మాత్రం మిస్సవదు. కథను యుద్ధ సన్నివేశాలు డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. చూసేవాళ్లకు శాతకర్ణి యుద్ధ పిపాసి లాగా.. అధికార దాహంతో తపించిపోయేవాడిలాగా కనిపిస్తాడు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుంది. ఎందుకంటే 2 గంటల 15 నిమిషాల నిడివిలో చాలా వరకు యుద్ధాలే కనిపిస్తాయి. సినిమా చూశాక పోరాట దృశ్యాలే కళ్లముందు కదలాడుతాయి. ఐతే నెమ్మదిగా ఆలోచిస్తే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అసలు ఉద్దేశం అర్థమవుతుంది. మామూలుగా బాలయ్య సినిమాల నుంచి ఆయన మాస్ అభిమానులు ఆశించే వినోదం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో తక్కువే కానీ.. ఇందులోనూ గూస్ బంప్స్ మూమెంట్స్కు ఢోకా లేదు. యుద్ధంలో తన చేతిలో ఓడిపోయాక శత్రు రాజు వచ్చి తల వంచుతాడు. వెంటనే శాతకర్ణి.. ‘‘తల వంచకు. అది నేను గెలిచిన తల’’ అంటాడు. ఇంతకంటే రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం ఏముంటుంది? ప్రమాణాల పరంగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉన్నతమైన స్థానంలోనే ఉంటుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూశాక మాత్రం శాతకర్ణి గొప్పగా అనిపిస్తాడు. క్రిష్.. బాలయ్య ఇద్దరూ కలిసి ‘శాతకర్ణి’కి అంత ఉన్నతమైన స్థానం కట్టబెట్టారు.
మాటల రచయితకు అభినందనలు:
సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ ను అభినందించి తారాల్సిందే. మన మనసుని ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఆక్రమించుకున్నా పదునైన మాటలు మనలో పౌరుషాగ్ని రగిలిస్తాయి. ఈ సినిమాకి సంభాషణలే సగం బలం కలిగించాయి. బహుశా ఇందులో క్రిష్ నైపుణ్యం కూడా ఉండి ఉండవచ్చు.సాయిమాధవ్ బుర్రా తన కలం పదునేంటో చూపించాడు. అద్భుతమైన మాటలు రాశాడు. సాయిమాధవ్ తప్ప ఇంకెవరూ ఇలాంటి మాటలు రాయలేడేమో అనిపించాడు. ‘‘కాలం చేసైనా కాలాన్ని కందాం’’ అనే ఒక చిన్న డైలాగ్ చాలు సినిమాలో సాయిమాధవ్ మాటలు ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో చెప్పడానికి. వారెవా అనిపించే ఇలాంటి మాటలు సినిమాలో చాలా ఉన్నాయి. శాతకర్ణిగా బాలయ్య అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన వాచకం.. హావభావాలతో శాతకర్ణి పాత్రను గొప్పగా పండించాడు బాలయ్య. ఆయన కెరీర్లో ఇది ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. నటనలో మాత్రం ఎక్కడా ఒక చిన్న సన్నివేశంలోనూ బాలయ్యకు వంకలు పెట్టడానికి లేదు. పాత్రకు తగ్గ రౌద్రం.. వాచకంతో తిరుగులేని రీతిలో నటించాడు బాలయ్య. ఫలానా సన్నివేశం అని కాదు.. సినిమా అంతటా బాలయ్య అద్భుత అభినయాన్ని ప్రదర్శించారు. క్రిష్ అన్నట్లుగా శాతకర్ణి పాత్రను బాలయ్య మాత్రమే చేయగలడు అనిపించాడు. సాయిమాధవ్ బుర్రా మాటల్ని పలికిన విధానానికి బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాలి.
సాంకేతిక వర్గం:
ఇలాంటి భారీ చారిత్రక కథను ఈ స్థాయిలో చెప్పగలిగే నైపుణ్యం.. ఇంత వేగంగా పూర్తి చేయగలిగే పనితనాన్ని క్రిష్ లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అతని ఇంతకు ముందు సినిమాలకూ దీనికీ చాలా తేడా కనిపిస్తోంది. కచ్చితంగా రాజమౌళి కంటే గొప్పదర్శకుడు క్రిష్ అని చెప్పాలి. 70 రోజుల్లో ఇలాంటి సినిమా రూపొందించడం మాటలు కాదు. క్రిష్ కథను చెప్పిన విధానం.. సన్నివేశాల్ని తీర్చిదిద్దిన తీరు.. ఎమోషన్లను పండించిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
సాహో క్రిష్.. సాహో బాలయ్య... అదరహో శాతకర్ణి.