ఛలో మూవీ రివ్యూ

Update: 2018-02-02 07:26 GMT

బ్యానర్: ఐరా క్రియేషన్స్

నటీనటులు:నాగ శౌర్య, రష్మిక మందన్న,అచ్యుత్ కుమార్, సీనియర్ నరేష్, ప్రగతి, వైవ హర్ష, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు.

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్

ప్రొడ్యూసర్: ఉష మూల్పూరి

డైరెక్టర్: వెంకీ కుడుములు

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, ఒక మనసు, కల్యాణ వైభోగమే వంటి సినిమాల్తో ఆకట్టుకున్న నాగ శౌర్య కి హీరోగా మంచి మార్కెట్ అయితే లేదు. అతని సినిమాలు వస్తున్నాయి అంటే అందరిలో ఆసక్తి ఉంటుంది కానీ.. ఆ సినిమా టాక్ ని బట్టి కలెక్షన్స్ ఉండడం లేదు. సరైన కథలను ఎంచుకుంటూ మినిమమ్ రేంజ్ హీరోగా ఎదుగుతున్న నాగ శౌర్య కి మీడియం రేంజ్ మార్కెట్ అంటూ ఇప్పటికీ ఏర్పడలేదు. అందుకే ఈసారి వేరే నిర్మాతలతో సెట్ అవడం లేదని గ్రహించిన నాగ శౌర్య ఈసారి తన ఓన్ బ్యానర్ లోనే నటించాడు. వెంకీ కుడుములు అనే ఒక కొత్త దర్శకుడితో తన తల్లి ఉష నిర్మాతగా ఛలో అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు. కన్నడలో సూపర్ హిట్ సినిమా కిర్రాక్ పార్టీ లో నటించి అందరి చూపుని తనవైపు తిప్పుకున్న లేత బుగ్గల భామ రష్మిక మందన్న నటించిన ఈ సినిమా ట్రైలర్ తోనే అందరి దృష్ణి ని ఆకర్షించడమే కాదు... డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశారు. సినిమా విడుదలకు ముందే మంచి పబ్లిసిటీతో ఆకట్టుకున్న నాగ శౌర్య ఈ ఛలో సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

హరి (నాగ శౌర్య) చిన్నపట్నుంచి గొడవలు పడడం, అతను తీసుకొస్తున్న సమస్యలను చూసి హరి తండ్రి (నరేష్) తట్టుకోలేకపోతాడు.ఇక హరి టార్చర్ బరించలేని తండ్రి హరి ని దూరంగా పంపించెయ్యాలనుకుంటాడు. అందులోభాగంగానే ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తిరుప్పురం అనే ఊరికి చదువు కోసం పంపిస్తాడు. ఆ ఊర్లో తమిళ వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు ఒక వర్గం గా విడిపోయి గొడవలు పడుతూ ఉంటారు. అయితే హరి అక్కడ తన తోటి స్టూడెంట్ అయిన కార్తిక (రష్మిక) ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కార్తీక కూడా హరిని లవ్ చేస్తుంది. ఇద్దరి స్వభావాలు ఒక్కటిగా ఉండడంతో త్వరగానే ప్రేమికులుగా మారిపోతారు. మరి తెలుగు వర్గాలు తమిళ వర్గాల ఘర్షణ కారణంగా హరి కూడా ఇబ్బందుల్లో పడతాడు. అలాగే కార్తీకతో హరి పెళ్లి కూడా తెలుగు, తమిళ వర్గాల విభేదాలపైనే ఆధారపడి ఉంటుంది. అసలు తెలుగు, తమిళులు ఎందుకు గొడవలు పడతారు? ఆ గొడవలకి హరికి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే కార్తీకతో హరి పెళ్లి కూడా తెలుగు, తమిళ వర్గాల విభేదాలు మీద ఎలా ఆధారపడుతుంది? అసలు హరి ఆ సమస్యలను ఎలా చేధించాడు? కార్తీక, హరి పెళ్లి చేసుకుంటారా? అనేది ఛలో సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.

నటీనటులు నటన:

నాగ శౌర్య చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. తొలి సారి నాగ శౌర్య కెరీర్ లో పక్కా కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో నటించి మెప్పించాడు. నాగ శౌర్య స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మూవీ లో చాలా అందంగా కనిపించాడు. గొడవలకు ఎదురెళ్లి యువకుడి పాత్రలో నాగ శౌర్య చక్కటి నటనతో పాటు, మంచి ఎమోషన్స్ తో హరి పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కానీ డైలాగ్ డెలివరీలో మాత్రం నాగ శౌర్య తేలిపోయాడనే చెప్పాలి. డైలాగ్ డెలివరీలో మరికాస్త బెటర్మెంట్ చూపించాల్సిన అవసరం ఉంది. యాక్షన్ సీక్వెన్స్ నాగ శౌర్య కి కొత్త కాబట్టి ఆ సీన్స్ లో నాగ శౌర్య ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక ఈ మూవీ తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న కార్తీక అనే పాత్రలో బాగా సెట్ అయ్యింది. రష్మిక ఈ మూవీ లో అందంగా, అచ్చతెలుగు అమ్మాయిలా క్యూట్ గా ఉన్న గాని పెర్ఫార్మన్స్ విషయం లో మాత్రం అంత గొప్పగా అనిపించలేదు. ఈ సినిమాలో కథ పరంగా చూసుకుంటే నాగ శౌర్య కంటే కొంచెం బాగా చేసింది అని చెప్పొచ్చు. ఇకపోతే నాగ శౌర్య తల్లితండ్రులుగా నరేష్ ఇంకా ప్రగతి జంట ఆకట్టుకున్నారు.ఇక కామెడీ పరంగా సుదర్శన్, సత్య ఇంకా వైవ హర్ష బాగానే ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర మెప్పించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

ఛలో పాటలతో మహతి స్వర సాగర్ బాగానే ఆకట్టుకున్నాడు. సినిమా విడుదలకు ముందే 'చూసి చూడంగానే' పాట అందరి హృదయాలను కొల్లగొట్టింది. అలాగే ఛలో లో మరో పాట కూడా అందరిని ఆకట్టుకుంది కానీ... మహతి మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోలేకపోయాడు. అసలు పాటల చిత్రీకరణ మరికాస్త బెటర్ గా ఉంటె బావుండేది అనిపిస్తుంది. కోటగిరి ఎడిటింగ్ లో మాత్రం చాలానే లోపాలున్నాయి. చాలా సీన్స్ ని ఎడిట్ లో లేపేస్తే పోలా అన్నట్టుగా వుంది. అలాగే సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్ సన్నివేశాలను కొత్తగా చూపించడంలో సాయి శ్రీరామ్ సక్సెస్ అవడమే కాదు సినిమాని రిచ్ గా చూపించాడు. ఇక ఐరా క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక నాగ శౌర్య సొంత బ్యానర్ కాబట్టి మూవీ ని ప్రొడ్యూస్ చేయడం లో ఎక్కడా తగ్గలేదు అనిపించింది.

దర్శకుడు:

తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల ఛలో సినిమాని పక్కా కమర్షియల్ గా తెరకెక్కించిన వెంకీ కథ మాత్రం చాలా రొటీన్ గా రాసుకున్నాడు. కథ పాతగా రాసుకున్న కథనం కొత్తగా ఉంది అంటే కథనం కూడా చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఒక పక్కా కమర్షియల్ తెలుగు ఫార్మాట్ ని ఫాలో అవుతూ క్యారెక్టర్స్ ని రాసుకున్నాడు. పాటలు కూడా కథకి సంభందం లేకుండా కేవలం సీన్ నుంచి లీడ్ తీసుకొని వస్తూ ఉంటాయి. అసలు రెండు ఊళ్లను కలిపే సినిమాలు తెలుగులో ఇప్పటికి లెక్కపెట్టలేనన్ని సినిమాలు వచ్చేసాయి. కానీ వెంకీ కథను నడిపించిన తీరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అలాగే వెంకీ స్క్రీన్ ప్లే ని ఎంటర్టైనింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ని కొంతో గొప్పోవినోదం తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని మాత్రం అలా గాలికి వదిలేసినట్టు అనిపించింది. అందులోని కొన్ని కామెడీ సీన్స్ మాత్రం మరీ రొటీన్ గా ఉన్నాయి. కాలేజ్ లో ఉన్న సీన్స్ బోర్ కొట్టించేస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా ఇచ్చిన వెంకీ సీరియస్ మోడ్ లో సెకండ్ హాఫ్ ని రన్ చేయలేకపోయాడు. కథ పాతగా ఉన్నా కామెడీ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపించి ఉంటె ఛలో సినిమాకి ఆశించిన విజయం అయితే దక్కేది. దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని కథను కొత్తగా రూపొందించి ఉంటె నాగ శౌర్య అనుకున్న విజయమైతే సాధించేవాడే.

పాజిటివ్ పాయింట్స్: నాగ శౌర్య, రష్మిక, ఇంటర్వెల్ బ్యాంగ్, కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కొన్ని కామెడీ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్

రేటింగ్: 2.5 /5

Similar News