జయదేవ్ మూవీ రివ్యూ

Update: 2017-06-30 12:28 GMT

నటీనటులు: గంటా రవి, మాళవిక రాజ్‌, వినోద్‌కుమార్‌, వెన్నెలకిషోర్‌

సంగీతం: మణిశర్మ

నిర్మాత: కె.అశోక్‌ కుమార్‌

దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ

ఏపీ బడా రాజకీయ నాయకుడు మంత్రి అయిన గంటా శ్రీనివాస్ కొడుకు గంటా రవితేజ 'జయదేవ్' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నాడు. సినిమాలంటే ఉన్న ఫ్యాషన్ తోనే రవితేజ సినిమా రంగం పై మక్కువ పెంచుకుని హీరోగా రాణించాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక గంటా శ్రీనివాస్ కి సినిమాలంటే ఎంత ఇష్టమో ఎప్పటికప్పుడు బహిరంగంగానే చెబుతున్నాడు. అలాంటి ఇష్టంతోనే మెగాస్టార్ మీద అభిమానంతో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అందుకే తన కొడుకు రవితేజ సినిమాల్లోకి వస్తానంటే అడ్డు చెప్పకుండా ప్రోత్సహించాడు. ఇక సినిమా మీద ఉన్న ఇష్టంతోనే గంటా రవితేజ.. పెద్ద పెద్ద హీరోలకు శిక్షణ ఇచ్చిన సత్యానంద్ దగ్గర నటనలో మెళుకువలు కూడా నేర్చుకున్నాడు. మరి ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సినిమాతోనే ప్రభాస్ లాంటి హీరోని పరిచయం చేసిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ వంటి వారితో పరిచయమవుతుండడం గంటా రవికి కలిసొచ్చే అంశగా చెప్పుకోవచ్చు. జయంత్ సి పరాన్జీ గతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ , నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి బడా హీరోలతో సినిమాలు చేసాడు. అంతపెద్ద డైరెక్టర్ చేతిలో పడ్డ రవితేజ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తాడా? లేకపోతె అందరిలాగే ఒక్క సినిమాతోనే ఇంటిదారి పడతాడో? జయదేవ్ సినిమా హిట్ మీద ఆధారపడి ఉంది. అలాగే 'జయదేవ్' ఆడియో వేడుకలో మెగా స్టార్ చిరు.... గంటా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించి మెప్పిస్తున్నాడని చెప్పాడు. మరి మెగాస్టార్ ఆశీస్సులతో పదికాలాల పాటు రవితేజ టాలీవుడ్ లో ఉంటాడో? లేదో? అనేది ఈ 'జయదేవ్' ఫలితాన్ని బట్టి తేలుతుంది. మరి జయదేవ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: జయదేవ్(గంటా రవి) ఒక పోలీస్ ఆఫీసర్. జయదేవ్ పోలీస్ గా డ్యూటీ చేస్తున్న దగ్గరలోనే మస్తాన్‌రాజు(వినోద్‌కుమార్‌) ఆక్రమమైన వ్యాపారాలన్నీ చేస్తుంటాడు. అతని అక్రమ వ్యాపారాల గురించి తెలుసుకున్న అధికారులు అతనిపై ఎంక్వయిరీ వేస్తారు. మస్తాన్‌రాజు పై ఎంక్వరీకి వచ్చిన ఢిల్లీ ఆఫీసర్‌ను తన క్వారీలో చంపేస్తాడు మస్తాన్‌రాజు. ఆ ఆఫీసర్ చనిపోవడంతో దోసలపాడు ఎస్‌ఐ శ్రీహరి(రవి ప్రకాష్‌) మస్తాన్ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసి మస్తాన్‌ రాజుపై ఓ ఫైల్‌ను తయారు చేస్తాడు.ఆ ఫైల్ తయారు చేసినందుకు గాను మస్తాన్ రాజు ఎస్‌ఐ శ్రీహరి ని కూడా చంపేస్తాడు. ఇక సింహాద్రిపురం టౌన్‌కు సర్కిల్‌ ఇన్సెపెక్టర్‌గా పనిచేస్తున్న జయదేవ్ మస్తాన్‌రాజు(వినోద్‌కుమార్‌) ఆక్రమమైన వ్యాపారాల మీద కన్నేస్తాడు. అలాగే మస్తానురాజు కేసు ఫైల్ కూడా జయదేవ్ చేతికొస్తుంది. ఇక కేసు ఇన్విస్టిగేషన్ చేస్తున్న జయదేవ్ మస్తాన్ తో గొడవకు దిగుతాడు. ఇక ఈ గొడవలో ఎవరిదీ పై చెయ్యి అవుతుంది? జయదేవ్ గెలుస్తాడా? మస్తాన్ రాజు గెలుస్తాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పాత్ర: గంటా రవితేజ జయదేవ్ పాత్రకి ఏ మాత్రం న్యాయం చెయ్యలేకపోయాడు. పోలీస్ పాత్రలో అస్సలు నప్పలేదు. పోలీస్ గా మెప్పించలేకపోవడమేకాదు నటనలో మెళుకువలు తెలియని రవి, జయదేవ్ పాత్రలో తేలిపోయాడనే చెప్పొచ్చు. మరి టాలీవుడ్ లో హీరో గా నిలబడాలి అంటే రవి ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే వున్నాయి. అసలు రవి కి హీరో అయ్యే లక్షణాలు మచ్చుకైనా ఈ చిత్రంలో కనబడదు. అసలు రవి తనమొదటి సినిమాకే ఇలా పోలీస్ పాత్రని ఎంచుకోకుండా వుండాల్సింది. మరే ఇతర పాత్ర అయినా బావుండేదనిపిస్తుంది. ఇక జయదేవ్ లోని రవిని చూసినప్పుడల్లా డబ్బుంటే హీరోగా అవతరమెత్తి ఇలా టాలీవుడ్ మీద దండెత్తడం భావ్యం కాదనే మాట ప్రేక్షకుల నుండి వినబడుతుంది. హీరోయిన్ మాళవిక గురించి చెప్పాలంటే అస్సలేమీ లేదు. ఆమెకు ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఎదో కాస్త గ్లామర్గా కనిపిస్తుంది అంతే. ఇక అలనాటి నటుడు వినోద్ కుమార్ ని విలన్ గా ఎన్నుకున్నారు. ఆలోచన కొత్తగా ఉన్నప్పటికీ జయదేవ్ చిత్రంలో వినోద్ కుమార్ విలన్ గా మెప్పించడంమాట దేవుడుకేరుగు కామెడీగా కనిపించాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు.

సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ ఒకప్పుడు తెలుగులో బడా హీరోలకు మంచి హిట్స్ ఇచ్చాడు. కానీ గత కొంతకాలంగా ఆయన ఏ సినిమాని డైరెక్ట్ చెయ్యలేదు. కానీ సడన్ గా ఇలా గంటా శ్రీనివాస్ కొడుకు రవిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. అయితే జయదేవ్ చిత్ర కథని డైరెక్టర్ తమిళ 'సేతుపతి' నుండి తీసుకున్నాడు.మరి తమిళ సినిమాని రీమేక్‌ చేసినా మక్కి కి మక్కి కొట్టకుండా తనదైన స్టయిల్‌లో కథలో మార్పులు చేర్పులు చేసి చెడగొట్టాడు. తమిళంలో ఆసక్తి రేపే సన్నివేశాలు తెలుగులో చాలా సాధాసీదాగా అనిపించాయి. మరి రొటీన్ కథనే తీసుకున్న జయంత్ ఎటువంటి కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చెయ్యలేక చేతులెత్తేశాడు. ఇక తమిళంలో 'సేతుపతి' చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ తెలుగులో 'జయదేవ్' చూస్తున్నంతసేపు ఎక్కడా ఆసక్తి అనేదే పుట్టదు. ఇక తమిళ సేతుపతిలో విజయ్ డాషింగ్ డేరింగ్ గా కనబడితే ఇక్కడ తెలుగులో రవి ఆ పాత్రలో తేలిపోయాడు. ఇక సంగీతం విషయానికొస్తే మణిశర్మ సంగీతం ఎక్కడా ఆకట్టుకోదు. బ్యాక్రౌండ్ స్కోర్ కూడా ఏ మాత్రం బాగోలేదు. ఇక జయదేవ్ సాంగ్స్ కూడా ఎందుకు పెటారబ్బా అన్నట్టు విసుగు తెప్పిస్తాయి. జవహర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రమే. ఎడిటింగ్ లో కూడా చాలా లోపాలున్నాయి. రచయితలు పరుచూరి బ్రదర్స్ అస్సలు ఫామ్ లో లేరనడానికి జయదేవ్ నిదర్శనం. ఇక నిర్మాణ విలువల విషయానికి వచ్చేసరికి.... అస్సలు ఆకట్టుకోవు. ఎక్కడా చూసినా రాజి పడినట్టే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: గంటా రవి బాడీ, కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్: రవి నటన, మ్యూజిక్, కథ, కథనం, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వినోద్ కుమార్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, పాటలు

రేటింగ్: 1 .25 /5

Similar News