నిర్మాణ సంస్థ: అరుణాచల్ క్రియేషన్స్
నటీనటులు: సాయి ధరం తేజ్, మెహ్రిన్, ప్రసన్న, సత్యం రాజేష్, కోట శ్రీనివాస రావు, నాగ బాబు తదితరులు
సంగీతం: యస్. తమన్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: బి.వి.ఎస్.రవి
సాయి ధరం తేజ్ గత రెండు సినిమాలు బాక్సాఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ అయ్యాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని.. దిల్ రాజు ని నమ్ముకున్నాడు. ఇక దిల్ రాజు ఈ సినిమాని తన చేతుల్లోకి తీసుకుని.. ఈ సినిమా షూటింగ్ అప్పుడు, ఎడిటింగ్ అప్పుడు తన సన్నిహితులకు ఈ సినిమాని చూపించి మార్పులు చేర్పులు.. అంటే కొన్ని సీన్స్ రీ షూట్ చేయించిమరీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇక దిల్ రాజు నిర్మాణంలో 'జవాన్' తెరకెక్కుతుంది అనగానే ఈసినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ విడుదల తేదీలు మార్చుకుంటూ వచ్చేసరికి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి తగ్గుతుందేమో అని భావించిన చిత్ర బృందం.. ఎప్పటికప్పుడు 'జవాన్' సాంగ్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చెయ్యగలిగింది. అలాగే సక్సెస్ ఫుల్ హీరోయిన్ మెహ్రీన్ అందాలు కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతాయా అన్నట్టుగా 'జవాన్' ట్రైలర్ లోను సాంగ్స్ లోను రెచ్చగొట్టారు. అయితే ఎంతో కసి గా హిట్ కొట్టాలి అని చెప్పి ప్లాప్ డైరెక్టర్ బివిఎస్ రవి తో కలిసి 'జవాన్' సినిమా చేసాడు సాయి ధరం తేజ్. మరి ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరం తేజ్ కి అలాగే బివిఎస్ రవికి కూడా 'జవాన్' సినిమా హిట్ ని తెచ్చిపెట్టిందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
చిన్నప్పటినుంచి దేశ భక్తితో పెరిగిన యువకుడు జై (సాయి ధరం తేజ్). తండ్రి టీచర్ అవ్వడంతో.. జై లో దేశ భక్తి పెరుగుతుంది. నరనరానా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనే సంకల్పం ఉన్నవాడు. డిఆర్డిఓ లో ఎలాగైనా సైంటిస్ట్ గా జాబ్ సంపాదించాలి అనే గోల్ తో హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. అదే టైం కి భారత దేశాన్ని కాపాడడానికి ఉపయోగించే ఒక మిసైల్ ని తయారు చేస్తారు డిఆర్డిఓ సైంటిస్ట్ లు. ఆ మిసైల్ ని ఉగ్రవాదులకి అప్పగించే డీల్ ని ఒప్పుకుంటాడు కేశవ్ (ప్రసన్న). కేశవ్ ఆ మిసైల్ ని కొట్టేసే ప్రాసెస్ లో అనుకోకుండా జై.... కేశవ్ వేసిన ప్లాన్ కి అడ్డు పడతాడు. ఈ స్పెషల్ స్టాంప్ కోసం విలన్ టీం జై బాబాయి ని చంపుతుంది. ఇది తెలిసిన జై.... విలన్ ప్లాన్ ని ఛేదించి క్షిపణి ని కాపాడతాడు. దానితో, విలన్ జయ్ ద్వారా నే ఆక్టోపస్ ని సంపాదించాలని వాళ్ళ ఫ్యామిలీ లో కి ఎంటర్ అవుతాడు. కేశవ్ యొక్క ప్లాన్ ని గ్రహించిన జై, వాళ్ళ ఫ్యామిలీ ని, ఆక్టోపస్ ని విలన్ భారి నుండి ఎలా కాపాడాడు? కేశవ్ ఆక్టోపస్ ఎలాంటి కుట్రలు పన్నాడు? అసలు ఆక్టోపస్ వలన జై ఫ్యామిలీ పడిన కష్టాలేమిటి? అనేది వెండితెర మీద 'జవాన్' సినిమాని కన్నులారా వీక్షించాల్సిందే.
నటీనటుల పాత్ర:
ఇంతకు ముందు సినిమాల తో పోలిస్తే సాయి ధరం తేజ్ ఈ సినిమాలో చాలా హుందాగా నటించాడు. గతంలోలాగా ఒకే పంధాలో కాకుండా కొంచెం బాధ్యతగల పౌరుడి పాత్రలో సాయి ధరం తేజ్ బాగా చేసాడు. దేశo గురించి చెప్పే డైలాగులు ఎక్కడా అతి గా కాకుండా జాగ్రత్త పడ్డాడు. డాన్సులు కొంచెం రాం చరణ్ ని ఇమిటేట్ చేసినట్లు అనిపించినా బాగున్నాయి. ఫైట్ లు కూడా బోరు లేకుండా నాచురల్ గా చేసాడు. ఇక డబ్బుకోసం ఉగ్రవాదులకి సాయం చేసే వ్యక్తి గా తమిళ హీరో అయిన ప్రసన్న పర్వాలేదు అనిపించాడు. తన నెగటివ్ షేడ్స్ తో,కొంచెం ధృవ సినిమా లో అరవింద స్వామి ని గుర్తుకు తెచ్చాడు. కానీ ప్రసన్నకి ఎక్కువగా నటించే స్కోప్ దక్కలేదు. ఇక మూవీ లో మెహ్రిన్ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఎందుకంటే అసలు కథలో మెహ్రిన్ ఎందుకు ఉందో కూడా ఎవరికీ అర్ధం కాదు. నటనలో మెహ్రీన్ చాలా డల్ అయినా..... గ్లామర్ షో లో మాత్రం మాస్ ని ఆకట్టుకుంటుంది. ఇకపోతే సీనియర్ యాక్టర్ అయిన కోట శ్రీనివాస్ రావు ఉన్న కాసేపు తన నటన తో కథ కి చాలా హెల్ప్ చేసాడు. సుబ్బరాజు, సత్యం రాజేష్ తదితరులు తమ పాత్రలమేర నటించి ఆకట్టుకున్నారు.
దర్శకత్వం:
బివిఎస్ రవి ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ డైరెక్ట్ చేసిన సినిమా జవాన్. కథ చాల సిన్సియర్ గా వుంది. ఎంత సిన్సియర్ అంటే, తెలుగు సినిమా లో కమెడియన్స్ లేకుండా ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమా ఇదే అనడం లో ఆశ్చర్యం లేదు. దర్శకుడిగా గా కంటే కూడా బివిఎస్ రవి రైటర్ గా ఈ సినిమా కి ప్రాణం పోసాడు. దేశం గురించి, సక్సెస్ గురించి హీరో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే లో కొన్ని తప్పులు ఉన్న గాని తన మాటల తో ఆ తప్పుల్ని కవర్ చేసే పని చేసాడు రవి. కాని దర్శకత్వం లో మాత్రం రవి చాలా వీక్ అని తెలిసిపోయింది. సీన్ లో ఎమోషన్ ఉన్నా గాని తన టేకింగ్ వల్ల ఆ ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయలేకపోయాడు రవి. జవాన్ ఒక మైండ్ గేమ్ కమర్షియల్ మూవీ. ఇలాంటి కాన్సెప్ట్ తో గతంలోనే సినిమాలు వచ్చాయి కాబట్టి ఇది మరీ కొత్తగా అనిపించే అవకాశం లేదు. మూస సినిమాల మాయలో పడిపోయి దెబ్బలు తిన్న సాయి ధరమ్ తేజ్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా బెటర్ మూవీ అనే చెప్పాలి. ఫైనల్ గా మంచి కథ తో వచ్చిన రవి కథకి పట్టులేని కథనాన్ని తయారు చేసుకొని సినిమా తీసాడా అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు:
తమన్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా..... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. కాకపోతే సాయి ధరం తేజ్ కి హిట్ సాంగ్స్ ని అందించిన తమన్ ఈ 'జవాన్' సినిమాతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. కెమెరా వర్క్ ని అందించిన కె.వి. గుహన్ తన వర్క్ తో ఓ.. అన్నంత ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదనిపించారు. అక్కడక్కడా కొన్ని షాట్స్ లో కెమెరా గొప్పదనం కనిపిస్తుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ చాలా వీక్. ఎడిటింగ్ లో ఇంకా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇక దర్శకుడు కొన్ని సీన్స్ లో ట్విస్ట్ లు యాడ్ చేసి ఉంటె బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు
ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ అందాలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కొన్ని డైలాగ్స్, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్: దర్శకత్వం, స్క్రీన్ ప్లే, లోజిక్ మిస్ అవడం, సెకండ్ హాఫ్, ఎడిటింగ్, క్లైమాక్స్
రేటింగ్: 2.0 /5