జై సింహా రివ్యూ - 2

Update: 2018-01-12 05:59 GMT

బ్యాన‌ర్‌: CK ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

నటీనటులు: బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ

మ్యూజిక్: చిరంతన్ భట్

నిర్మాత: సి. కళ్యాణ్

దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్

ర‌న్ టైం: 163 నిమిషాలు

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2017

బాక్సాఫీస్ బొనంజా, యువ‌ర‌త్న బాల‌కృష్ణ వ‌రుస‌గా మూడోసారి సంక్రాంతి బ‌రిలో దిగాడు. 2016లో డిక్టేట‌ర్‌గా, 2017లో గౌతమీపుత్రగా వ‌చ్చి హిట్ కొట్టిన బాల‌య్య ఈ యేడాది మూడోసారి వ‌రుస‌గా జై సింహాగా వ‌స్తున్నాడు. శాత‌క‌ర్ణితో గ‌త సంక్రాంతికి కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య జై సింహాగా వ‌స్తున్నాడు. బాల‌య్య కెరీర్‌లో 102వ సినిమాగా వ‌స్తోన్న జై సింహాకు చాలా సెంటిమెంట్లు హిట్ క‌ళ‌ను తెచ్చాయి. సింహా సెంటిమెంట్‌, న‌య‌న‌తార‌, సంక్రాంతి సీజ‌న్ల‌తో జై సింహాకు మంచి హైపే వ‌చ్చింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల దెబ్బ‌తో సినిమాతో బాల‌య్య ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వ‌చ్చేసింది. మ‌రి జై సింహాగా బాల‌య్య బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ర్జించాడా ? లేదా ? మ‌రోసారి ఆయ‌న సంక్రాంతి హిట్ సెంటిమెంట్ నిజం చేసుకున్నాడా ? లేదా ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

వైజాగ్‌లో న‌ర‌సింహం (బాల‌కృష్ణ‌) మెకానిక్ షెడ్ న‌డుపుతుంటాడు. మాస్టార్ ప్ర‌కాష్‌రాజ్ కుమార్తె గౌరి (న‌య‌న‌తార‌)తో ప్రేమ‌లో ఉంటాడు. ఎవ‌రైనా అన్యాయం చేస్తే తాట తీసే మ‌న‌స్తత్వం ఉన్న న‌ర‌సింహం అక్క‌డ వైజాగ్ కింగ్ రామిరెడ్డి (అశుతోష్ రానా) కొడుకు ర‌విశంక‌ర్‌రెడ్డిని ఓ విష‌యంలో నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకోవ‌డంతో అత‌డు ఎంపీగా గెలిచే ఛాన్స్ పోతుంది. ర‌విశంక‌ర్‌రెడ్డికి అప్ప‌టికే సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ వీర‌రాఘ‌వ‌రెడ్డి (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి) కుమార్తెతో పెళ్లి కుదురుతుంది. ఎంపీ సీటు పోవ‌డంతో అవ‌మానం త‌ట్టుకోలేక ర‌విశంక‌ర్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దీంతో కొడుకు చావుకు కార‌ణ‌మైన న‌ర‌సింహ‌ను చంపాల‌ని ర‌గులుతుంటాడు. చివ‌ర‌కు రామిరెడ్డి జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన గౌరి (న‌య‌న‌తార‌)ను కాద‌ని న‌ర‌సింహం త‌న వ‌ద్ద ప‌నిచేసే మంగ (హ‌రిప్రియ‌)ను పెళ్లాడ‌తాడు. చివ‌ర‌కు న‌ర‌సింహం వైజాగ్‌ను వదలాల్సి వ‌స్తుంది. ఇక కుంభ‌కోణంలో ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీమోహ‌న్‌) ఇంట్లో కారు డ్రైవ‌ర్‌గా ఉంటూ న‌ర‌సింహం అక్క‌డే త‌న కొడుకును పెంచుకుంటూ ఉంటాడు. అక్క‌డ ముర‌ళీమోహ‌న్ కుమార్తె న‌టాషా దోషీ వ‌ల్ల లోక‌ల్ విల‌న్ల‌కు బాల‌య్య టార్గెట్ అవుతాడు. ఈ స్టోరీ ఇలా ఉంటే కుంభ‌కోణంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల్ల బాల‌య్య మీడియాలో పాపుల‌ర్ అవుతాడు. దీంతో బాల‌య్య కుంభ‌కోణంలో ఉన్న విష‌యాన్ని జైళ్లో ఉన్న రామిరెడ్డి మీడియాలో చూస్తాడు. న‌ర‌సింహాన్ని చంపేందుకు జైలు నుంచి త‌ప్పించుకున్న రామిరెడ్డి అక్క‌డ‌కు వెళ‌తాడు. ఈ వార్ చివ‌ర‌కు ఏమైంది ? న‌ర‌సింహం ఏం కోల్పోయాడు ? న‌య‌న‌తార మ‌రో వ్య‌క్తిని ఎందుకు పెళ్లాడాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా ముగిసింది ? అన్న‌దే జై సింహా స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ ఎలా ఉందంటే....

బాల‌య్య డైలాగులతోనే కాదు స్టెప్పుల‌తోను ఓ ఊపు ఊపేశాడు. న‌టాషాతో అమ్మ‌కుట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పులు మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉన్నాయి. డైలాగుల‌తో సినిమాకు ఓ ఊపు తెచ్చాడు. హీరోయిన్ల‌లో న‌య‌న‌తార రోల్ కీల‌కం. సెంటిమెంట్ ప‌రంగా ఈ రోల్ బాగా పండింది. న‌య‌న ల‌వ్ సీన్ల‌లో చలాకీత‌నంతో సెంటిమెంట్ ప‌రంగా అనుభ‌వంతో న‌టించింది. న‌టాషా దోషీ గ్లామ‌ర్‌కు ఓ సాంగ్‌కు ప‌రిమితం. బాల‌య్య భార్య‌గా హ‌రిప్రియ‌కు చాలా రోజుల త‌ర్వాత మంచి రోల్ దొరికింది. దానిని ఆమె సద్వినియోగం చేసుకుంది. మెయిన్ విల‌న్ అశుతోష్ రానా పాత్ర క‌న్నా సెకండ్ విల‌న్ ప్ర‌భాక‌ర్‌కే ఎక్కువ తెర‌పై ప్ర‌జెన్సీ ఉంది. ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఆల‌య‌ ధ‌ర్మ‌క‌ర్త‌గా, న‌య‌న‌తార తండ్రిగా ప్ర‌కాష్‌రాజ్‌, సెంట్ర‌ల్ మినిస్ట‌ర్‌గా జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డితో పాటు శివాజీరాజా, చ‌ల‌ప‌తిరావు, ప‌విత్రా లోకేష్‌, జ‌డ్జి రోల్‌లో డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. బ్ర‌హ్మీ - ప్రియ జంట కామెడీ బాగుంది. న‌య‌న భ‌ర్త‌గా చేసిన ఏసీపీ రోల్ కూడా కీల‌క‌మే.

విశ్లేష‌ణ :

బాల‌య్య క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్ ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్‌. బాల‌య్య పాట‌ల్లో డ్యాన్సుల‌తో పాటు గుక్క తిప్ప‌కుండా చెప్పిన డైలాగులు, దుమ్ము రేపే యాక్ష‌న్ సీన్లు సినిమాకు ఆయువుప‌ట్టు అయ్యాయి. అమ్మ‌కుట్టి పాట‌లో వేసిన స్టెప్పుల గురించి చెప్ప‌డం క‌న్నా స్క్రీన్ మీద చూడ‌డ‌మే బెట‌ర్‌. ఇక పురోహితుల గురించి కంటిన్యూగా చెప్పిన డైలాగులు బాల‌య్య డైలాగ్ ప‌వ‌ర్‌ను మరోసారి చూపించాయి. ఫ‌స్టాఫ్‌లో కామెడీకి స్కోప్ ఎక్కువుగా ఉంది. అలాగే సినిమా కామెడీ మిన‌హా మిగిలిన అంశాల్లో లాగ్ లేకుండా ఉంది. ముర‌ళీమోహ‌న్ ఇంట్లో ప‌ని గ్యాంగ్‌తో బ్ర‌హ్మీ - ప్రియ ఆంటీ మ‌ధ్య వ‌చ్చే కామెడీతో పాటు అక్కడ కామెడీ ప‌దే ప‌దే రిపీట్ అయిన‌ట్టు ఉంది. ఇంట‌ర్వెల్ సీన్ చాలా ట్విస్టింగ్‌గా ఉండ‌డంతో సెకండాఫ్‌లో ఏం జ‌రుగుతుందా ? అన్న ఆస‌క్తిని ద‌ర్శ‌కుడు క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

ఇక సెకండాఫ్‌లో యాక్ష‌న్‌కు స్కోప్ ఉన్నా ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ ఎమోష‌న‌ల్‌గాను, సెంటిమెంట్‌నే న‌మ్ముకుని బండి న‌డిపించాడు. న‌య‌న‌తార ఎమోష‌న‌ల్ సీన్ల‌తో పాటు బాల‌య్య - హ‌రిప్రియ పెళ్లి సీన్లు సినిమాకు కీల‌కం అయ్యాయి. వైజాగ్‌లో అశుతోష్‌ రానా కొడుకు ఎంపీగా నామినేష‌న్ వేయ‌కుండా అడ్డుకునే సీన్‌తో సినిమా గ్రాఫ్ పెరిగినా త‌ర్వాత ఆ రేంజ్ అందుకోలేక‌పోయింది. సెకండాఫ్‌లో వైజాగ్ ప్లాస్‌బ్యాక్ నేప‌థ్యంలో న‌య‌న‌తార‌తో ప్రేమ సీన్లు, బాల‌య్య త‌న ప్రేమ‌ను ప్ర‌కాష్‌రాజ్‌కు చెప్ప‌లేక‌పోవ‌డం, న‌య‌న కొంటెత‌నం ఇవ‌న్నీ బాగున్నాయి. బాల‌య్య హ‌రిప్రియ‌ను పెళ్లి చేసుకోవ‌డం కూడా స‌డెన్ ట్విస్టే. ఇక త‌న ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల్లో న‌య‌న‌తారకు ముందు ఓ పిల్లాడిని ఇచ్చి క్లైమాక్స్‌లో ఆ పిల్లాడు చ‌నిపోయిన‌ప్పుడు మ‌రో పిల్లాడిని కూడా ఇవ్వ‌డం సెంటిమెంట్ ప‌రంగా బాగా పండింది.

సెకండాఫ్‌లో క్లైమాక్స్‌కు ముందు అరగంట బాగా తేలిపోయింది. హ‌రిప్రియ పెళ్లి త‌ర్వాత శోభ‌నం సీన్ క్రియేట్ చేసి అక్కడ సాంగ్ పెట్టారు. ఇది క్లైమాక్స్ సాగ‌దీత‌కు మిన‌హా ఉప‌యోగం లేదు. హీరోపై ప‌గ‌తో ర‌గిలిపోయే విల‌న్ పోలీసుల‌తో కారులో వెళుతూ త‌ప్పించేసుకుని క్లైమాక్స్ ఫైటింగ్‌కు రెడీ అయిపోతాడు. ఈ సీన్ చూస్తుంటే ద‌ర్శ‌కుడు ఏ కాలంలో ఉన్నాడా అనిపించ‌క‌మాన‌దు. ఇక క్లైమాక్స్ ఫైట్ త‌ర్వాత సెంటిమెంట్ ముగింపు కాస్త ట‌చ్చింగ్‌గా ఉంది.

సాంకేతిక‌త :

సాంకేతికంగా చూస్తే ఎం.ర‌త్నం డైలాగుల‌కు మంచి మార్కులు వేయాలి. ఈ డైలాగులే సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. పోలీసోడు ప‌బ్లిక్‌లో సామాన్యుడి మీద చేయి వేస్తే హీరో అవుతాడు... అదే సామాన్యుడు పోలీసోడి మీద చేయి వేస్తే జీరో అవుతాడు - ఇంగ్లీష్ చ‌ద‌వులు ఇండియా క‌ల్చ‌ర్‌ను మంట క‌ల‌ప కూడ‌దు - రాజ‌కీయ నాయ‌కుల‌తో మీకు తెలిసింది ప్ర‌జ‌ల‌ను మెక్క‌డం...మీ పై వాళ్ల‌కు మొక్క‌డం - నీ రౌడీయిజం క‌త్తి పిడిలాంటిదైతే....నా ప‌వ‌ర్ క‌త్తి ప‌దును లాంటిది - గాంధీని చంపిన గాడ్సే అంటే కూడా వాళ్ల అమ్మ‌నాన్న‌కు ప్రేమే అంత‌మాత్రాన వాళ్లు పాపాత్ములే కాని..మ‌హాత్ములు అయిపోరు - ప‌ద‌వి ఆశించేవాడు ప్రాబ్ల‌మ్స్ క్లీయ‌ర్ చేయాలి కాని....క్రియేట్ చేయ‌కూడ‌దు.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో విజిల్స్ వేసేందుకు కావాల్సిన‌న్ని ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి. ర‌త్నం పాత చింతకాయ‌ప‌చ్చ‌డి క‌థ తీసుకున్నా కొన్ని మంచి సీన్లు రాసుకుని వాటికి ఇచ్చిన డైలాగులు మాత్రం అదిరిపోయాయి.

ఇక రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బాల‌య్య సినిమాల‌కు మంచి ఎఫ‌ర్ట్‌తో తీస్తాడు. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్ల‌కు లైటింగ్ త‌గ్గ‌డం, కొన్ని చోట్ల క్వాలిటీ మిస్ అవ్వ‌డం జ‌రిగింది. శాత‌క‌ర్ణితో బాల‌య్య‌కు మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంత‌న్ భ‌ట్ ఈ సినిమాతో మ‌రోసారి సత్తా చాటాడు. యాక్ష‌న్‌, సెంటిమెంట్ సీన్ల‌లో భ‌ట్ మ్యూజిక్ బాగుంది. ప్ర‌వీణ్ ఆంథోనీ ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో ట్రిమ్ చేయాల్సి ఉంది. సెకండాఫ్‌లో సినిమా ల్యాగ్ అయినా అది ద‌ర్శ‌కుడి త‌ప్పే త‌ప్పా ఎడిట‌ర్‌ను త‌ప్పు ప‌ట్ట‌లేం. ఆ సీన్లు క‌ట్ చేయ‌డానికి కూడా వీలు లేకుండా సాగ‌దీశారు. నారాయ‌ణ‌రెడ్డి ఆర్ట్ వ‌ర్క్ గొప్ప‌గా చేయ‌డానికి ఏం లేదు. ఫైట్స్ బాల‌య్య ఫ్యాన్స్‌, మాస్ ప్రేక్ష‌కుల‌కు బిర్యానీ భోజ‌నం లాంటివే. సీ క‌ళ్యాణ్ బాగానే ఖ‌ర్చు పెట్టాడు.

ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వికుమార్ ఎలా తీశాడంటే.....

ఇక ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాల విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకు క‌థ రాసిన ఎం.ర‌త్నం పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి లాంటి రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. ఓ విల‌న్‌కు అన్యాయం చేస్తే అత‌డు హీరో మీద ప‌గ‌ప‌ట్ట‌డం, హీరో మ‌రో ఊరుకు వెళ్ల‌డం, జైల్లో ఉన్న విల‌న్ పోలీసుల వ్యాన్ నుంచి త‌ప్పించేసుకుని వెళ్ల‌డం చివ‌ర‌కు హీరో అత‌డిని చంపండం ఈ క‌థ‌తో మ‌న తెలుగులో ఎన్ని సినిమాలు వ‌చ్చాయో లెక్కేలేదు. జై సింహా క‌థ కూడా అదే. వాస్త‌వంగా చూస్తే ఇదే క‌థ‌తో సినిమా తీస్తే సినిమా ప్లాపే అవ్వాలి. అయితే మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన కేఎస్‌.ర‌వికుమార్ కొన్ని చోట్ల హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయ‌డంతో పాటు ఎం.ర‌త్నం రాసిన డైలాగులు, సెంటిమెంట్ అద్దిన తీరు ఇవ‌న్నీ సినిమాను యావ‌రేజ్ మార్క్‌కు ఇవ‌త‌ల వ‌ర‌కు తీసుకెళ్లాయి. ఇక బాల‌య్య క్యారెక్ట‌ర్‌ను ఎంత ఎలివేట్ చేసినా విల‌నిజం వీక్ అయిపోయింది. విల‌న్‌కు అంత అన్యాయం జ‌రిగినా అత‌డు చివ‌ర్లో ఫైట్‌కు రావ‌డం మిన‌హా చేసిందేమి ఉండ‌దు. ఇది కూడా సినిమా ఎలివేట్ కాకుండా ఉండ‌డానికి మేజ‌ర్ మైన‌స్‌గా మారింది.

అనుకూలాంశాలు :

- బాల‌య్య న‌ట‌న‌

- ఎం.ర‌త్నం డైలాగులు

- ఫైట్స్‌

- ఫ‌స్టాఫ్‌

- నేప‌థ్య సంగీతం

- న‌య‌న‌తార సెంటిమెంట్‌

ప్ర‌తికూలాంశాలు :

- సాగ‌దీసిన సెకండాఫ్‌

- పాత చింత‌కాయ ప‌చ్చ‌డి స్టోరీ

- తేలిపోయిన విల‌నిజం

- రొటీన్ క్లైమాక్స్‌

- పాత కాలం డైరెక్ష‌న్‌

Similar News