ప్రొడక్షన్ హౌస్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నటీనటులు: విశాల్, ప్రసన్న, అను ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా జెరీమియా, జయప్రకాష్, సిమ్రన్
సంగీతం: అరుళ్ కొరోలి
నిర్మాత: జి. హరి
దర్శకత్వం: మిష్కిన్
తమిళనాట విశాల్ ప్రభంజనం మాములుగా లేదు. అక్కడ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్ కి సినిమాల విషయంలో మాత్రం వరుసగా పరాజయాలు చవి చూస్తున్నాడు. అక్కడ కోలీవుడ్ లో నడిగర్ సంఘం ఎన్నికలప్పటినుండి సినిమాల్లో హీరోలెలా హీరోయిజాన్ని ప్రదర్శిస్తారో అలంటి హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నాడు విశాల్. అలాగే మొన్నామధ్యన సినిమాల పైరసీ విషయంలో కూడా చాలా హడావిడి చేసాడు. పైరసీ రాయుళ్ల ఆటకట్టిస్తానంటూ ఒక టీమ్ ని కూడా ఏర్పాటు చేసాడు. అదే సమయంలో విశాల్ - మిష్కిల్ కలయికలో తెరకెక్కిన 'తుప్పరివాలన్' విడుదలయింది. ఆ సినిమాలోని తెలుగులో కూడా డిటెక్టీవ్ అంటూ విడుదల చేస్తున్నారు. విశాల్ తాను తమిళంలో నటించిన ఏ సినిమానైనా తెలుగులోనూ విడుదల చేస్తుంటాడు. అదేవిధంగా ఇప్పుడు 'డిటెక్టీవ్' సినిమాని ఈ రోజు నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి అక్కడ తమిళంలో 'తుప్పరివాలన్' తో హిట్ కొట్టిన విశాల్ ఇక్కడ 'డిటెక్టీవ్' తో ఎలాంటి హిట్ సొంతం చేసుకుంటాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఆది (విశాల్) ఓ ప్రైవేట్ డిటెక్టివ్. పోలీస్ లకు కూడా సాధ్యం కానీ కేసులను ఆది పరిష్కరిస్తాడు. ఎప్పుడూ తనవైన ఆలోచనలలో మునిగి ఉంటాడు. ఇల్లు, తన ఫ్రెండ్ మను (ప్రసన్న) అతని లోకం. అలంటి ఆది దగ్గరకు ఒక హత్య, కిడ్నాప్ కేసు వస్తుంది. ఆ కేసు తన తెలివితేటలకు ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఆ కేసుని మరుక్షణమే టేకప్ చేస్తాడు. ఆ కేసుతో చాలా హత్యలు కు సంబంధం ఉన్నట్టుగా ఆది కనిపెడతాడు. పలు ఆసక్తికర విషయాలతో ఆ కేసు లోతుకు వెళ్ళేకొలది జఠిలమవుతుంది. ఆ కేసు ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఆదికి మల్లిక( అను ఇమ్మాన్యువల్) పరిచయం అవుతుంది. అలా మల్లికతోపాటే ఆ కేసుకు సంబందించిన వారు కూడా ఆదికి పరిచయమవుతుంటారు. అసలు ఆది ఒప్పుకున్న ఆ హత్య కేసు ఎవరిది? హత్య కి కిడ్నాప్ కి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఆది ఆకేసుని ఎలా ఛేదించాడు? ఇన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే డిటెక్టీవ్ ని వెండితెర మీద చూసి తెలుసుకోవాలి.
నటీనటుల నటన:
విశాల్ ఎప్పటిలాగే మాస్ యాక్టింగ్ తో అదిరిపోయే పెరఫార్మెన్స్ ఇచ్చాడు. డిటెక్టీవ్ గా విశాల్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. హై ఓల్టేజ్ నటన అంటారే.. అలా వుంది విశాల్ నటన. ప్రతి విషయాన్నీ తీక్షణంగా పరిశీలిస్తూ బయట ప్రపంచాన్ని మరిచిపోయి.. తన వృత్తికి న్యాయం చేసే పాత్రలో చెలరేగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్సప్రెషన్స్ తో విశాల్ సూపర్ గా ఆకట్టుకున్నాడు. డిటెక్టీవ్ సినిమా మొత్తాన్ని విశాల్ తన భుజ స్కందాల మీద మోశాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక విశాల్ తర్వాత ప్రసన్న పాత్ర కొంచెం ఆకట్టుకునేలా వుంది. ఇక హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు. గ్లామర్ పరంగా ఓకె ఓకే గా అనిపించింది. ఇక ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో బాగానే ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలలో ఆండ్రియా నటన బావుంది. భాగ్యరాజ్, సిమ్రాన్ ... మిగతా వారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు మిష్కిన్ ఒక మంచి థ్రిల్లర్ ఎలెమెంట్స్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనదయిన స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఈ సినిమాని ఆద్యంతం రక్తి కట్టించాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల మైండ్ సెట్ ని మనసులో పెట్టుకుని... ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ తో సినిమాని తీర్చిదిద్దాడు. ట్విస్ట్ లు అనుకున్నంతగా లేకపోయినా సినిమా మొదటినుండి చివరివరకు ప్రేక్షకుడు ఆసక్తి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మైంటైన్ చేయగలిగాడు. కొన్ని సన్నివేశాల్లో విశాల్ తన పాత్రకు ప్రాణం పోసాడు. తన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ తో దర్శకుడు ఈ సినిమాలోని పలు సన్నివేశాలను రాసుకున్నడనిపిస్తుంది. కానీ ఎక్కడా హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టిన ఫీలింగ్ రాకుండా మేనేజ్ చేసాడు మిష్కిల్. అయితే ఈ సినిమాలో కామెడీని దర్శకుడు లైట్ తీసుకున్నట్టుగా అనిపించింది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీకి కామెడీని జత చేసినట్లయితే... ఈ సినిమాతో విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఉండేవాడు. అయినా ఈ సినిమాతో అటు విశాల్ ఇటు దర్శకుడు మిష్కిన్ కూడా మంచి హిట్ అందుకున్నట్టే.
టెక్నీకల్ గా చెప్పాలంటే అరుళ్ కొరోలి అందించిన మ్యూజిక్ కన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. కొన్ని యాక్షన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అరిపించేసింది. పాటల విషయానికొచ్చేసరికి తెలుగు ప్రేక్షకులను డిటెక్టీవ్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేవు. ఆ పాటల్లో తమిళ ఫ్లేవర్ ఎక్కువగా కనబడుతుంది. రాజేశ్ మూర్తి డైలాగులు సినిమాను నిలబెడుతాయి. చాలా క్లిష్టమైన సన్నివేశాల్లోనూ వివరంగా డైలాగులు రాసాడు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే... ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీనే. కొన్ని సన్నివేశాలను ఎంతో అందంగా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ద వహిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సెకెండ్ హాఫ్ లో ఎక్కువ డ్రాగ్స్ వున్నాయి. ఇక నిర్మాత మాత్రం ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజి పడలేదు. అందుకే నిర్మాణ విలువలు బావున్నాయి.
ప్లస్ పాయింట్స్: విశాల్ నటన,కథ, స్రీన్ ప్లే,దర్శకత్వం,బ్యాగ్రౌండ్ స్కోర్,ఫస్ట్ హాఫ్,క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:కామెడీ,కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం,స్లో కథనం,సెకండ్ హాఫ్,ఎడిటింగ్
రేటింగ్: 3.0/5