తెలుగు సిని పరిశ్రమకి భావ దారిద్ర్యం.. కథా దారిద్రం ఎక్కువైందనడానికి దువ్వాడ జగన్నాధం సినిమా పెద్ద ఉదాహరణ. పాత చింతకాయ పచ్చడికి కొత్త పోపు వేసి తీసిన చిత్రం దువ్వాడ జగన్నాథం. అయితే అల్లు అర్జున్ నటుడిగా మరింత ఎత్తు ఎదిగాడని సినిమా చూసిన వాళ్లు అంగీకరించాల్సిందే. తెలుగు సినిమాలని రెండు భాగాలుగా చూడడం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు దర్శకులు. అదే దువ్వాడ జగన్నాధంలోనూ కనపడింది. సినిమా మొదటి భాగం హాయిగా సాగింది. ఇక రెండో భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకుల సహనానికి పరీక్షే.
కథ విషయానికి వస్తే ఓ అగ్రహారంలో వంటవాడిగా ఉండే బ్రాహ్మణ యువకుడు అల్లు అర్జున్. దువ్వాడ వారి అబ్బాయి. ఓ వేడుకలో హీరోయిన్ పూజ హెగ్డే ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే బ్రాహ్మణులకు చెందిన కోట్ల రూపాయల స్ధలంపై కన్నేసిన రొయ్యల నాయుడు (రావు రమేష్) భరతం పట్టడం.. విలన్ భరతం పట్టడంలో భాగంగా డిజెగా అవతారం ఎత్తుతాడు హీరో. ఇదీ స్ధూలంగా కథ. తొలి భాగం అంతా బ్రాహ్మాణ భాష... హీరోయిన్ తొ పాటలు... అక్కడక్కడ వెన్నెల కిషోర్ కామెడీ. థియేటర్ లో కూర్చున్న వారికి తొలిభాగం వినోదాన్ని పంచుతుంది. రెండో భాగం ప్రారంభమైనప్పుడే ప్రేక్షకుల సహనానికి పరీక్ష.
నటనపరంగా అల్లు అర్జున్ కు నూటికి నూరు మార్కులు వేయవచ్ఛు. రెండు క్యారెక్టర్లు రెండు డైమెన్షన్లలో చేయడమంటే కష్టమే. కాని అల్లు అర్జున్ చేసి చూపించాడు. బ్రాహ్మణ పాత్రలో ఒదిగి నటించి ఎదిగాను అనిపించాడు. డైలాగ్ డెలివరీ కాని, హావభావాలు కాని అద్భుతం. డాన్సులైతే చాలా బాగా చేశాడు. ఇక అర్జున్ నటుడిగి నిరూపించుకోవాల్సింది ఏమి లేదు. ఫైట్స్ లో కూడా మూసకాకుండా కొత్తదనాన్ని చూపించాడు.
హీరోయిన్ పూజ హెగ్డే కు అయితే నటనకు ఛాన్స్ లేదు కాని యువతను థియేటర్ల నుంచి కదలనివ్వదు. డాన్సుల విషయంలో కూడా హెగ్డెకి మంచి మార్కులు వేయవచ్చు. విలన్ గా రావు రమేష్ కి ఈ పాత్ర నల్లేరు మీద నడకే. మిగిలిన నటులు ఫరవాలేదనిపించారు.
సంగీతం విషయంలో డిఎస్ పి అద్భుతం. దేవి శ్రీ ప్రసాద్ పాటలకు యువత ఫిదా కావాల్సిందే. అలాగే బ్యాక్ స్కోర్ కూడా బాగుందనిపించాడు. నేటి సినిమాల్లో సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దీనికి దువ్వాడ కూడా మినహాయింపు కాదు. సినిమాలో లోపం అంతా దర్శకుడు హరీష్ శంకర్ దే అనక తప్పదు. కథను మలిచిన తీరులో అనేక ఇబ్బందులున్నాయి. వాటిని ముందే గ్రహించి ఉంటే తప్పులు జరగకపోవును. నిర్మాత దిల్ రాజు కి మాత్రం కాసులు కురిపించే సినిమా దువ్వాడ జగన్నాధం. కెమెరా.. ఇతర సాంకేతిక హంగులు ఓకె. సినిమాని ఓ సారి చూడడానికి ఇష్టపడే వారికి దువ్వాడ జగన్నాధం పనికి వస్తుంది.
- ముక్కామల చక్రధర్