నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, చార్లీ, మధుసూదన్ తదితరులు
సంగీతం: జావేద్ రియాజ్
నిర్మాత: పొటెన్షియల్ స్టూడియోస్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
కెరీర్ లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోవడానికి సినిమా లేని హీరో సందీప్ కిషన్.. తన సైడ్ నుండి ఎఫైర్ట్ బాగానే పెడుతున్నాడు..కానీ ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే అనుకుంటా తమిళ్ వైపు పయనించి 'మానగరం' అనే చిత్రంలో ఛాన్స్ కొట్టాడు. అలాగే ఈ మధ్య అస్సలు లక్ అనేది లేకుండా పోయిన రెజీనా ది కూడా అదే పరిస్థితి. వీరిద్దరితో పాటు శ్రీ, చార్లీ అనే మరో ఇద్దరు కూడా ఈ సినిమాలో కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రం తెలుగులో 'నగరం' అనే టైటిల్‌తో ఈ రోజు విడుదలైంది. నలుగురు వేర్వేరు వ్యక్తుల కథలతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు లోకేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా మొదటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ నలుగురి కథలేంటి? ఈ కథలు సందీప్‌కి, రెజీనా కి ఎంత వరకు ఉపయోగపడతాయి? దర్శకుడు ఈ కథలతో తీసిన సినిమా రిజల్ట్ ఏమిటి? అనేది సమీక్షలో తెలుసుకుందాం! ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? సందీప్ కిషన్‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ: ఈ సినిమాలో ఒక కథ అని చెప్పడానికి లేదు. నాలుగురి వేర్వేరు కథల్ని లింక్ చేస్తూ సినిమా మొదలవుతుంది. తన ప్రియురాలి కోసం ఉద్యోగం చెయ్యడానికి చెన్నయ్ వస్తాడు శ్రీ. తన పరిధిలో లేకపోయినా అతనికి ఉద్యోగం ఇప్పించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది రెజీనా. ఓ దశలో తనకు ఉద్యోగం వద్దు అని వెళ్ళిపోతున్న శ్రీని బ్రతిమలాడి వెనక్కి తీసుకొస్తుంది. మరో వైపు అల్లరి చిల్లరగా తిరుగుతూ లైఫ్ అంటే కేర్‌లెస్‌గా వుండే సందీప్ కిషన్.. రెజీనాని ప్రేమిస్తాడు. తనని ప్రేమించమంటూ వేధిస్తుంటాడు. ఇక నాలుగో క్యారెక్టర్ చార్లి. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కొడుక్కి చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు సంపాదించేందుకు కుటుంబ సమేతంగా చెన్నయ్ వచ్చి పికెపి అనే ఓ గూండా దగ్గర క్యాబ్ తీసుకుంటాడు. పైన చెప్పుకున్న నలుగురి లైఫ్‌లోకి ఓ కిడ్నాప్ వచ్చి చేరుతుంది. దాంతో వారి జీవితాల్లో అలజడి మొదలవుతుంది. మరి ఆ కిడ్నాప్ కథ ఏమిటి? అసలు ఈ నలుగురు కథలు కు ఉన్న సంబంధం ఏమిటీ?ఆ నలుగురిలో ఇంతకీ కిడ్నాప్ అయింది ఎవరు? ఆ కిడ్నాప్ వల్ల ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అనేది తెలియాలంటే ఖచ్చితంగా నగరాన్ని తెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: సందీప్ కిషన్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ కొత్తరకమైన క్యారెక్టర్ చేశాడు. అతను చేసిన క్యారెక్టర్లలో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. రెజీనా క్యారెక్టర్ కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్‌లో రెజీనా ఎంతో ఇన్‌వాల్వ్ అయి చేసింది. నగరంలో ఒక మనిషి ఏమైపోతున్నా ఎవరూ పట్టించుకోరని, ఉద్యోగం మానేసి ఊరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయి జరిగే సంఘటనల వల్ల మానసిక వ్యధను అనుభవించే క్యారెక్టర్‌లో శ్రీ అద్భుతంగా నటించాడు. కొడుక్కి చికిత్స చేయించడానికి సిటీకి వచ్చిన వ్యక్తికి మొదటిరోజే ఎదురైన సంఘటన అతన్ని ఎలాంటి టెన్షన్‌కి గురి చేసిందనేది అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేసి చూపించాడు చార్లి. పికెపిగా మధుసూదన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేశాడు.
సాంకేతిక వర్గం పనితీరు: ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి చెప్పాలంటే రెగ్యులర్‌గా వచ్చే సినిమాలకు భిన్నంగా తన సినిమా వుండాలన్న ఆలోచనతో ఒక కొత్త కథకు శ్రీకారం చుట్టాడు. దానికి కొత్త తరహాలో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథలో, కథనంలో, క్యారెక్టర్ల మధ్య వుండే వేరియేషన్స్‌లో, ఎమోషన్స్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తూ సినిమాని నడిపించాడు. అసలు కథలోకి వెళ్ళడానికి కామెడీ పేరుతో కొన్ని అనవసరమైన సీన్స్‌తో టైమ్ వేస్ట్ చేయకుండా సినిమా స్టార్ట్ అయిన ఐదు నిముషాల్లోనే ఆడియన్స్‌ని కథలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత సీన్ బై సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు. నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోంది అనే విషయం ఆడియన్స్ ఊహకందని విధంగా చక్కని సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశాడు. సెల్వకుమార్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం అని చెప్పాలి. అందంగా, మరెంతో సహజంగా చిత్రీకరించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జావేద్ మ్యూజిక్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేసాడు. నాలుగు కథల్ని విడి విడిగా చూపిస్తూ చివర్లో మరో ఎలిమెంట్‌తో ఈ కథల్ని జత చేస్తూ ప్రేక్షకులు ఎక్కడా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా తన ఎడిటింగ్‌తో మ్యాజిక్ చేశాడు ఫిలోమిన్ రాజ్
ప్లస్ పాయింట్స్: సందీప్ కిషన్ నటన,సస్పెన్స్, నటీనటులు, దర్శకుడు, కథ, కథనం
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, రెజీనా, కామెడీ, గ్లామర్
రేటింగ్: 2.5/5